‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు?’ అన్నట్టు ఉంది నేడు దేశంలో గవర్నర్లు వ్యవహరిస్తున్న తీరు. ఏవరు ఏమనుకుంటే నాకేంటి? ఏలినవారి మనసెరిగి నడుచుకోవడమొక్కటే ఏకైక పరమావధి అన్నట్టు ఉన్నవారి వ్యవహరం రోత పుట్టిస్తోంది. తాజాగా తమిళనాడు గవర్నర్ లౌకిక తత్వంపై చేసిన వ్యాఖ్యలు ఇందుకో పరాకాష్ట! బీజేపీ అధికారంలోకి వచ్చాక ఎన్నికైన బీజేపీయేతర ప్రభుత్వాలను కూలదోయడం, కుదరకుంటే ఇబ్బందులకు గురిచేయడం, ఫెడరల్ స్ఫూర్తికి తూట్లు పొడవడం ఓ విధానంగా సాగుతోంది. ఇందుకు గవర్నర్‌ల వ్యవస్థను అడ్డు పెట్టుకోవడం ఆనవాయితీగా మారింది.
‘కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి పూర్తి భిన్నమైన రాజకీయ పక్షం పాలనలో ఏ రాష్ట్రమైనా ఉంటే అక్కడి గవర్నర్ పోషించే పాత్ర ఎలా ఉంటుంది?’ రాజ్యాంగసభ సభ్యులుగా బిశ్వనాథ్ దాస్ సంధించిన ప్రశ్న ఇది. అటువంటి సందర్భాల్లో గవర్నర్లు ఢిల్లీ ప్రభువుల సంకుచిత వ్యూహాల్లో పావులై, రాష్ట్ర ప్రభుత్వాల పాలిట అపర సైంధవులుగా పరిణమిస్తారన్న సందేహన్ని ఆనాడే ఆయన ఎత్తిచూపారు. అది నూరుపాళ్లువాస్తవమేనని అనేకసార్లు రుజువైంది. తాజాగా ‘లౌకికతత్వం మన దేశానికి అవసరం లేదు. సెక్యులరిజం అనే భావన యూరప్ నుంచి వచ్చిందని, మనం దాన్ని అనుసరించవలసిన అగత్యం మనకు లేదు’ అని తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగానే కించపరుస్తున్నాయి. ఇలా అసంబద్ధంగా ఏదో ఒకటి మాట్లాడే ఈ ‘ప్రథమ పౌరుల’ తీరు సమాజాన్ని కలవరపరుస్తోంది. రాజకీయ నిరుద్యో గుల పునరావాస కేంద్రాలుగా రాజ్‌భవన్లు మారడం వలనే ఆ రాజ్యాంగ వ్యవస్థ ఔన్నత్యం ఇంత మసిబారిపోతోంది!
ఆయన సెక్యులరిజం మనకు అనవసరం అని చెప్పి ఊరుకోలేదు. ఇది యూరప్ దేశాల భావన అనీ అక్కడ చర్చికి, రాజ్య వ్యవస్థకు మధ్య చెలరేగిన ఘర్షణ కారణంగా సెక్యులరిజం అన్న భావన రూపుదిద్దుకుందని కూడా ఆయన సెలవిచ్చారు. ఇది అచ్చు గుద్దినట్టు బీజేపీ అభిప్రాయమే. కాకపోతే ఈయన నోటినుంచి బయటకు వచ్చింది. అందులో ఆశ్చర్యం లేదు. తిరువనంతపురంలోని తిరువత్తూరులో హిందూధర్మ విద్యాపీఠం స్నాతకోత్సవంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాని రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి రాజ్యాంగాన్ని తూలనాడే రీతిలో మాట్లా డడం ఆయన చిత్త వైపరీత్యానికి సంకేతం. అలాంటి వ్యకికి ఆ హోదాలో అర్హతే ఏ మాత్రమూ లేదు.
సెక్యులరిజానికి తప్పుడు భాష్యం చెప్పి దేశాన్ని మోసగించారు అని కూడా రవి వ్యాఖ్యానించారు. సెక్యులరిజం భారతీయ భావన కాదట.సెక్యులరిజం అన్న మాటను చేర్చడాన్ని తప్పుపట్టడం ఆయన లాంటి వారు మాత్రమే చేయగల దుస్సాహసం. ప్రస్తుత గవర్నర్లు కేంద్రం చేతుల్లో కీలుబొమ్మలై ప్రజాతంత్ర విలువలను మంటగలుపుతున్నారు. బూటాసింగ్, భండారీల వారసులు అడుగడుగునా తారసపడుతున్నారు. గవర్నర్ అంటే కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో మెలగవలసిన వ్యక్తి కాదని, ఆ పదవి రాజ్యాంగబద్దమైన స్వతంత్ర వ్యవస్థ అని ‘ఎస్‌ఆర్ బొమ్మై వర్సెస్ భారత ప్రభుత్వం’ కేసులో సర్వోన్నత న్యాయస్థానం కుండబద్దలుకొట్టింది. అవన్నీ అటకెక్కిపోయిన దురవస్థలో గవర్నర్ల ఎంపికలో పార్టీ విధేయతే ఏకైక ప్రమాణమైంది.
ఆమధ్య ‘ప్రభుత్వమంటే నేనే’ నంటూ ఢిల్లీ మాజీ ఎల్‌జీ నజీబ్ జంగ్ నోరు పారేసుకోవడం నివ్వెరపరిచింది. ‘ప్రతీ దేశం ఏదో ఒక మతంపైనే ఆధారపడిందనీ, భారతదేశం అందుకు మినహాయింపేమీ కాదని’ ఇదే తమిళనాడు గవర్నర్ గతంలోనూ వివాదస్పద వ్యాఖ్యలే చేశారు.తరచూ ఇలాంటి వివాదాలతో ‘సమాఖ్య భావన’ బీటలు వారడానికి రాజ్‌భవనే పుణ్యం కట్టుకుంటున్న వైనాన్ని కళ్లకు కడుతున్నాయి. రాష్ట్రపతి ప్రతినిధిగా రాష్ట్రాల్లో గవర్నర్లు నిర్వహించాల్సిన రాజ్యాంగ విహిత బాధ్యతలు పరిమితమైనవి, నామమాత్రమైనవి.
ఏదైనా రాజ్యాంగ సంక్షోభం తలెత్తినప్పుడు తెరపైకి వచ్చి అత్యవసరంగా విధ్యుక్తధర్మం నిర్వర్తించాల్సిన గవర్నర్లు ఆ హద్దును దాటి తామే సంచలనాలకు కేంద్రబిందువుగా మారితే ఎలాగుంటుందో తెలుసుకోవడానికి ఈ పదేండ్ల ఉదం తాలు చాలు. ఈ వివాదాస్పద గవర్నర్‌లందరూ పూర్వా శ్రమంలో కాషాయదళ కీలక నేతలే కావడం, వీరివల్ల ఇక్కట్లకు గురవుతున్నవన్నీ బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాలే కావడం యాధృచ్ఛికమేమీ కాదు. కనుక ఇదంతా ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న వారి ప్రాయోజిత రాజకీయ తతంగమేనన్నది సత్యదూరమూ కాదు.