గ్రామ సభలో సర్పంచ్‌కు అవమానం…

నవతెలంగాణ-మహబూబాబాద్‌
మహబూబాబాద్‌ మండలం మోట్లతండ గ్రామపంచా యతీ బీఆర్‌ఎస్‌ సర్పంచ్‌ బానోత్‌ సుమన్‌నాయక్‌పై అదే గ్రామానికి చెందిన వర్రే మహేష్‌ అనే వ్యక్తి గ్రామసభలో చెప్పుతో దాడి చేసిన వీడియోలు వైరల్‌ అయ్యాయి. సర్పంచ్‌ సుమన్‌ నాయక్‌ కథనం ప్రకారం బుధవారం మట్లతండ గ్రామపంచాయతీ పరిధిలోని ప్రాథమిక పాఠశాలలో గ్రామసభ నిర్వహించారు. సభ జరుగుతుండగా సర్పంచ్‌ సుమన్‌ మాట్లాడుతుండగా సభలో గందరగోళం నెలకొంది. ఒక్కసారిగా వర్రే మహేష్‌ అనే వ్యక్తి చెప్పుతో సర్పంచ్‌ పై దాడి చేశాడు. పలువురు గ్రామస్తులు ఈ ఘటనను ఆపే ప్రయత్నం చేశారు. గ్రామస్తులకు సర్పంచ్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. సర్పంచ్‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా డని, అభివృద్ధి పనులు చేయడం లేదని, కనీసం రోడ్లపై మట్టి కూడా పోయడం లేదని, గ్రామపంచాయతీకి కొనుగోలు చేసిన ట్రాక్టర్‌ వృథాగా ఉందని, దానికి డ్రైవర్‌ కూడా లేడని, గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయ డం లేదని ప్రశ్నించిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని గ్రామస్తులు విమర్శించారు. కాగా తాను చిన్నతనంలోనే సర్పంచ్‌గా గెలుపొందానని, చిన్న పోరడు వీడేం చేస్తారని చాలామంది ఎద్దేవా చేశారని సర్పంచ్‌ అన్నారు. గ్రామంలో చేస్తున్న అభివృద్ధి పనులు చూసి మళ్లీ గెలుస్తాడని అక్కస్సుతో తనపై కొంతమంది కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. వర్రే మహేష్‌, వర్రే వెంకన్న, లింగయ్య తనపై చెప్పుతో దాడి చేశారని, ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు.