నవ్విపోదురుగాక మాకేటి సిగ్గు..!

సావిత్రీబాయి ఫూలే. గొప్ప సంఘ సంస్కర్త. పితృస్వామ్యవ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన ధీరవనిత. మహిళల హక్కుల కోసం మనుధర్మంపై తిరుగుబాటు చేసిన అగ్గిపిడుగు. నూతన వ్యవస్థ కోసం ప్రాణాన్నే ఫణంగా పెట్టి పోరాడిన యోధురాలు. 18వ శతాబ్దంలోనే ఆడపిల్లల విద్య, వారి హక్కులకు గొంతెత్తి ఆనాటి సమాజానికి ఎదురొడ్డి పోరాడిన చైతన్య వంతురాలు. ఇది జగమెరిగిన సత్యం. 18వ శతాబ్దంలో మహిళల కోసం సావిత్రీబాయి ఫూలే కొట్లాడితే..20వ శతాబ్దంలో మహిళలను మనుధర్మం ప్రకారం నడుకోవాలని చెప్పే పార్టీ బీజేపీ. ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ అయితే ‘మహిళలు వంటింటికే పరిమితం కావాలి. ఇంటి పనులను చేస్తూ పురుషులను సంతృప్తిపరిస్తే చాలు’ అని బాహాటంగానే వ్యాఖ్యానించాడు. ‘మహిళలు చీరలోనూ, సల్వార్‌ కమీజ్‌ సూట్‌లోనూ అందంగా ఉంటారు. వారు దుస్తువులు ధరించకున్నా బాగానే ఉంటారు’ అంటూ ఓ బాబా తన నోటికొచ్చినట్టు మాట్లాడాడు. ‘మహిళలు పొట్టి దుస్తువులు ధరించడం, ఇష్టానుసారంగా రోడ్లెక్కడం వల్లనే అత్యాచారాలు పెరిగిపోతు న్నాయి’ అంటూ మరో బీజేపీ నేత కొత్త నిర్వచనం చెప్పేశాడు. ఇదీ బీజేపీ నేతల నిజ స్వరూపం. కడుపునిండా వారిపై అక్కసు, తమ మూల సిద్ధాంతానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే కోపం ఉన్నా పైకి ఓట్ల కోసం భలే నటించేస్తారు. ఇందుకు సావిత్రీబాయి ఫూలేనీ వదలట్లేదు. పెక్కు జనం నవ్విపోదురుగాక మాకేటి సిగ్గు నాలుగు ఓట్లు రాలితే చాలు అని సంతృప్తి చెందుతున్నారు. అనుకున్నట్టుగానే ఇటీవల బీజేపీ లీడర్‌ ఓ వేదికపై తన ప్రసంగాన్ని ఇరగదీశాడు. ‘స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలి మహిళా ఉపాధ్యాయురాలు, సమాజానికి గొప్ప ఆదర్శనీయులు సావిత్రిబాయి పూలే. వితంతువులను దగ్గరకు తీసి అందరూ సమానంగా బతకాలని తపించిన సామాజిక విప్లవ మాతృమూర్తి’ అంటూ తన ఉపాన్యాసాన్ని దంచేశాడు.
– ప్రశాంత్‌