ఐపీఎల్‌కు షమి దూరం

ఐపీఎల్‌కు షమి దూరం– 2024 టీ20 వరల్డ్‌కప్‌కు సైతం!
ముంబయి : భారత స్టార్‌ పేసర్‌, 2023 వన్డే వరల్డ్‌కప్‌ హీరో మహ్మద్‌ షమి మరింత కాలం క్రికెట్‌కు దూరం కానున్నాడు. స్వదేశంలో జరిగిన ఐసీసీ వరల్డ్‌కప్‌లో 10.70 సగటు, 12.20 స్ట్రయిక్‌రేట్‌తో 24 వికెట్లు పడగొట్టిన మహ్మద్‌ షమి.. మోకాలి నొప్పి వేధించినా ప్రపంచకప్‌లో పోరాట పటమి చూపించాడు. ఇంజెక్షన్స్‌ తీసుకుని మోకాలి నొప్పి నుంచి ఉపశమనం పొందిన మహ్మద్‌ షమి.. వరల్డ్‌కప్‌ తర్వాత గాయం తీవ్రతతో ఆటకు దూరంగా ఉన్నాడు. దక్షిణాఫ్రికాకు పర్యటనకు దూరంగా ఉన్న మహ్మద్‌ షమి స్వదేశంలో ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు అందుబాటులో ఉంటాడని అనుకున్నారు. కానీ బెంగళూర్‌లోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో మహ్మద్‌ షమి ఫిట్‌నెస్‌ చూసిన వైద్య బృందం.. అతడిని ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు దూరం పెట్టింది. గాయం తీవ్రత దృష్ట్యా మహ్మద్‌ షమికి శస్త్రచికిత్స అవసరమైని బీసీసీఐ వైద్య నిపుణులు సూచించారు. దీంతో సోమవారం లండన్‌లో మహ్మద్‌ షమికి శస్త్రచికిత్స చేశారు. శస్త్రచికిత్స విజయవంతం కాగా.. మహ్మద్‌ షమి కోలుకుని, మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ సాధించేందుకు కనీసం 4-5 నెలల సమయం పట్టనుంది. దీంతో రానున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 7 సీజన్‌కు సీనియర్‌ సీమర్‌ దూరం కానున్నాడు. ఇప్పటికే హార్దిక్‌ పాండ్య సేవలను కోల్పోయిన గుజరాత్‌ టైటాన్స్‌.. ఇప్పుడు పేస్‌ దళపతి షమిని కోల్పోయింది. ఈ ఏడాది జూన్‌లో కరీబియన్‌, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు సైతం షమి అందుబాటులో ఉండే అవకాశాలు లేవు. మహ్మద్‌ షమి లేని వేళ భారత్‌ ముకేశ్‌ కుమార్‌, ఆకాశ్‌ దీప్‌లకు టెస్టు జట్టులో అవకాశాలు కల్పించింది.