– ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌కు స్టార్ పేసర్
– బుమ్రా, పంత్, యశస్విలకు విశ్రాంతి
మహ్మద్ షమి ఎట్టకేలకు భారత జట్టులోకి వచ్చేశాడు. 2023 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ తర్వాత గాయంతో జాతీయ జట్టుకు స్టార్ పేసర్ దూరమయ్యాడు. దేశవాళీ సర్క్యూట్‌లో ఫిట్‌నెస్, ఫామ్ నిరూపించుకున్న షమి ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికయ్యాడు. తెలుగు తేజాలు తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి సైతం టీ20 జట్టులో చోటు దక్కించుకున్నారు.
నవతెలంగాణ-ముంబయి
ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో పోటీపడే భారత జట్టును బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం ఎంపిక చేసింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. మోకాలు నొప్పి, చీలమండ గాయానికి శస్త్రచికిత్సతో సుమారు ఏడాదికి పైగా ఆటకు దూరమైన స్టార్ పేసర్ మహ్మద్ షమి మళ్లీ జాతీయ జట్టులోకి వచ్చాడు. జనవరి 22న కోల్‌కతలో జరుగనున్న భారత్, ఇంగ్లాండ్ తొలి టీ20లో మహ్మద్ షమి బరిలోకి దిగనున్నాడు. ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌కు సహా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత జట్టును సెలక్షన్ కమిటీ ఇంకా ప్రకటించలేదు. ప్రాథమిక జట్లను సమర్పించేందుకు జనవరి 12ను ఐసీసీ గడువుగా నిర్దేశించింది. ఐసీసీ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకుంటే మినహా.. గడువులోగా భారత జట్టును బీసీసీఐ వెల్లడించాల్సి ఉంటుంది.
బుమ్రాకు విశ్రాంతి
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కండ్లుచెదిరే ప్రదర్శన చేసిన జశ్‌ప్రీత్ బుమ్రా సహా వికెట్ కీపర్ రిషబ్ పంత్, ఓపెనర్ యశస్వి జైస్వాల్ విశ్రాంతి పొందారు. ఈ ముగ్గురు క్రికెటర్లు ఐదు టెస్టుల్లోనూ ఆడారు. ఆఖరు టెస్టులో బుమ్రా వెన్నునొప్పితో మైదానం వీడటంతో అతడి గాయం తీవ్రతపై బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణ కొనసాగుతుంది. ఫిట్‌నెస్ సమస్యలు లేకుంటే.. వన్డే సిరీస్ లేదంటే నేరుగా చాంపియన్స్ ట్రోఫీ జట్టులో బుమ్రా నిలిచే అవకాశం ఉంది. శుభ్‌మన్ గిల్‌ను సెలక్టర్లు పరిగణనలోకి తీసుకున్నట్టు లేదు!. వికెట్ కీపర్లుగా సంజు శాంసన్, ధ్రువ్ జురెల్ జట్టులో నిలిచారు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో బెంగాల్ తరఫున ఆడిన మహ్మద్ షమి 7.85 ఎకానమితో 11 వికెట్లు పడగొట్టాడు. విజరు హజారే ట్రోఫీలోనూ 25.80 సగటుతో ఐదు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. షమి ఫిట్‌నెస్‌పై అనుమానాలు కొనసాగుతున్నా.. టీ20 మ్యాచ్‌కు పెద్దగా ఇబ్బందులు ఉండవనే భావనతో సెలక్షన్ కమిటీ అతడిని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.
ఆ ఐదుగురు అవుట్
నిరుడు దక్షిణాఫ్రికాపై టీ20 సిరీస్ నెగ్గిన జట్టులోని ఐదుగురు ఆటగాళ్లను సెలక్షన్ కమిటీ పక్కనపెట్టింది. రమణ్‌దీప్ సింగ్, జితేశ్ శర్మ, అవేశ్ ఖాన్, యశ్ దయాల్, విజరు కుమార్ వైశాక్‌లకు ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో చోటు దక్కలేదు. ఆసీస్‌తో టెస్టులో సిరీస్‌లో ఆడిన నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రానా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్‌లు టీ20 జట్టులో నిలిచారు. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ సెలక్షన్ కమిటీ నుంచి మరోసారి అవకాశం దక్కించుకోగా.. స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ప్రమోషన్ అందుకున్నాడు. టీ20 జట్టుకు వైస్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్ ఎంపికయ్యాడు. రవి బిష్ణోరు, వరుణ్ చక్రవర్తి, అర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్య, రింకూ సింగ్‌లు జట్టులో కొనసాగుతున్నారు.
తెలుగు వెలుగు
టీమ్ ఇండియా టీ20 జట్టులో తెలుగుదనం ఉట్టిపడుతోంది. తెలంగాణ క్రికెటర్ తిలక్ వర్మ, ఆంధ్ర స్టార్ నితీశ్ కుమార్ రెడ్డి జాతీయ జట్టులో నిలిచారు. 22 ఏండ్ల తిలక్ వర్మ భారత్‌కు 22 టీ20లు ఆడగా.. 21 ఏండ్ల నితీశ్ కుమార్ ఇప్పటివరకు 3 టీ20లు ఆడాడు. భారత జట్టులో ఒక్క తెలుగు క్రికెటర్ ప్రాతినిథ్యం వహించటమే గగమైన రోజుల నుంచి.. ఏకంగా ఇద్దరు క్రికెటర్లు చోటు సాధించటం తెలుగు రాష్ట్రాలకు గర్వకారణమని చెప్పవచ్చు.
22న తొలి టీ20
భారత్, ఇంగ్లాండ్ పొట్టి సిరీస్ ఈ నెల 22న ఆరంభం కానుంది. చాంపియన్స్ ట్రోఫీ ముంగిట భారత్ ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. కోల్‌కత, చెన్నై, రాజ్‌కోట్, పుణె, ముంబయిలు టీ20 మ్యాచులకు వేదికగా నిలువనున్నాయి. తొలి మ్యాచ్ 22న, ఐదో మ్యాచ్ ఫిబ్రవరి 2న జరుగుతుంది. కీలక వన్డే సిరీస్ ఫిబ్రవరి 6న షురూ కానుంది. నాగ్‌పూర్‌లో తొలి వన్డే షెడ్యూల్ చేయగా.. కటక్, అహ్మదాబాద్‌లో చివరి రెండు వన్డేలు జరుగుతాయి. ఐసీసీ 2025 చాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19న ఆరంభం కానుంది. ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ అనంతరం భారత్ నేరుగా దుబారుకు చేరుకోనుంది. గత ఏడాది మూడు వన్డేలే ఆడిన టీమ్ ఇండియా ఆశించిన ప్రదర్శన చేయలేదు.
భారత టీ20 జట్టు
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, మహ్మద్ షమి, అర్షదీప్ సింగ్, హర్షిత్ రానా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రింకూ సింగ్, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), రవి బిష్ణోరు, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్.