రంజీ బరిలో షమి

Shami in Ranji– పూర్తిగా కోలుకున్న పేస్‌ బౌలర్‌
న్యూఢిల్లీ : భారత స్టార్‌ పేస్‌ బౌలర్‌ మహ్మద్‌ షమి పూర్తి స్థాయి ఫిట్‌నెస్‌ సాధించాడు. 2023 వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్‌ అనంతరం గాయంతో ఆటకు దూరమైన షమి.. ఈ ఏడాది ఫిబ్రవరిలో శస్త్రచికత్స చేయించుకున్నాడు. బెంగళూర్‌లోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో రిహాబిలిటేషన్‌లో కొనసాగుతున్న మహ్మద్‌ షమి ఆదివారం టీమ్‌ ఇండియా సహాయక సిబ్బంది పర్యవేక్షణలో చిన్నస్వామి స్టేడియంలో బౌలింగ్‌ సాధన చేశాడు. భారత్‌, న్యూజిలాండ్‌ టెస్టు మ్యాచ్‌ అనంతరం బౌలింగ్‌ కోచ్‌ మోర్ని మోర్కెల్‌ పర్యవేక్షణలో మహ్మద్‌ షమి నెట్స్‌లో బంతులు వేశాడు. ఫుల్‌ రనప్‌తో బౌలింగ్‌ చేసిన షమి మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ సాధించినట్టే కనిపించాడు. గాయంతో బాధపడుతున్న శుభ్‌మన్‌ గిల్‌ సైతం నెట్స్‌లో బ్యాటింగ్‌ చేశాడు. బ్యాటింగ్‌ కోచ్‌ గిల్‌ సాధనను పర్యవేక్షించాడు. నవంబర్‌ ఆఖరులో ఆరంభం కానున్న బోర్డర్‌ గవాస్కర్‌ టెస్టు సిరీస్‌తో రీ ఎంట్రీకి సిద్ధమవుతున్న మహ్మద్‌ షమి.. అంతకుముందు ఒకట్రెండు రంజీ మ్యాచులు ఆడే అవకాశం ఉంది. ‘ ఆదివారం నెట్స్‌లో బౌలింగ్‌ చేశాను. సర్జరీ తర్వాత తొలిసారి పూర్తి స్థాయిలో బౌలింగ్‌ చేశాను. ఎటువంటి ఇబ్బంది అనిపించలేదు. ఏకధాటిగా 20-30 ఓవర్లు వేసినప్పుడు, వైద్యుల సలహాతో మ్యాచ్‌కు సిద్ధమవుతాను. ప్రస్తుతానికి వంద శాతం ఫిట్‌నెస్‌ సాధించాను’ అని మహ్మద్‌ షమి సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో తెలిపాడు.