– సింగపూర్ స్మాష్ 2024
సింగపూర్ : భారత టేబుల్ టెన్నిస్ స్టార్ క్రీడాకారుడు, వరల్డ్ నం.88 అచంట శరత్ కమల్ మెరుపు విజయాలకు బ్రేక్ పడింది. సింగపూర్ స్మాష్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్‌లో వరుసగా వరల్డ్ నం.13, వరల్డ్ నం.22 ర్యాంక్ ఆటగాళ్లను ఓడించిన శరత్ కమల్ క్వార్టర్‌ఫైనల్లో తడబడ్డాడు. ఈ టోర్నీలో తొలిసారి క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్న శరత్ కమల్ 9-11, 2-11, 7-11, 11-9, 8-11తో పరాజయం పాలయ్యాడు. వరల్డ్ నం.6, ఫ్రాన్స్ ఆటగాడు ఫెలిక్స్ లెబ్రూన్ 4-1తో శరత్ కమల్‌పై సాధికారిక విజయం నమోదు చేశాడు. ఇటీవల కాలంలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన శరత్ కమల్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్-40లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. పారిస్ ఒలింపిక్స్ ముంగిట శరత్ కమల్ ప్రదర్శన అతడిలో ఆత్మవిశ్వాసం రెట్టింపు చేయనుంది.