సోషల్‌ మీడియాలో రాజ్యాంగ పీఠిక షేర్‌

సోషల్‌ మీడియాలో రాజ్యాంగ పీఠిక షేర్‌– రామ మందిర ప్రారంభం రోజు
– మలయాళ నటులు, డైరెక్టర్ల వినూత్న చర్య
తిరువనంతపురం : అయోధ్యలో రామ మందిర ప్రారంభం రోజు మలయాళ నటులు, డైరెక్టర్లు వినూత్న చర్యకు దిగారు. తమ సోషల్‌ మీడియా ఖాతాల్లో రాజ్యాంగ పీఠిక ఫోటోలను షేర్‌ చేశారు. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు తన హిందూత్వ వాగ్దానాల్లో ఒకటైన అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని ఆవిష్కరిస్తున్న తరుణంలో భారత రాజ్యాంగ మూల స్వభావాన్ని గుర్తు చేసే ఉద్దేశంతో మలయాళ నటులు, డైరెక్టర్లు ఈ చర్యకు పూనుకున్నారు. సెక్యులర్‌, సోషలిస్ట్‌, డెమోక్రటిక్‌ విలువలు తెలిసేలా రాజ్యాంగ పీఠికను షేర్‌ చేయటం కనిపించింది. రాజ్యాంగ పీఠికను షేర్‌ చేసినవారిలో ప్రముఖ మలయాళ నటులు పార్వతి తిరువోతు, రిమా కల్లింగల్‌, దివ్య ప్రభ, కనీ కుస్రుతి, డైరెక్టర్లు జియో బేబి, ఆశిక్‌ అబూ, కమల్‌ కె.ఎం, గాయకులు సూరజ్‌ సంతోశ్‌లు ఉన్నారు. దేశ ప్రజలందరికి ప్రతినిధిగా ప్రధాని హౌదాలో అయోధ్యలోని రామ మందిర ప్రారంభోత్సవంలో మోడీ పాల్గొనటంపై ఇప్పటికే సర్వత్రా విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. సెక్యులర్‌ భావనకు విరుద్ధంగా మోడీ వ్యవహరించారని రాజకీయ విశ్లేషకులు, రాజ్యాంగ నిపుణులు, మేధావులు ఆరోపిస్తున్నారు.