ఏఐ మ్యూజిక్‌తో శారీ

ఏఐ మ్యూజిక్‌తో శారీదర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ డెన్‌ నుండి ‘శారీ’ అనే చిత్రం రాబోతోంది. పాన్‌ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, తమిళ, మరియు మళయాళ భాషల్లో ఈ చిత్రాన్ని నవంబర్‌లో విడుదల చేయనున్నారు. గిరి కష్ణకమల్‌ దర్శకత్వంలో ఆర్జీవీ ఆర్వీ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో వ్యాపారవేత్త రవివర్మ నిర్మించారు. సత్య యాదు, ఆరాధ్య దేవి హీరో,హీరోయిన్లుగా నిజ  జీవిత సంఘటనల ఆధారాలతో సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా ఈ మూవీ రూపొందుతోంది. రామ్‌గోపాల్‌ వర్మ ఎప్పటికప్పుడు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ  ప్రేక్షకుల్ని రంజింప చేస్తూ ఉంటారు. తాజాగా ఆయన ఏఐ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) ప్రక్రియతో ఈ చిత్రంలోని ‘ఐ వాంట్‌ లవ్‌’ అనే గీతాన్ని రూపొందించారు. ఇలా లిరికల్‌  వీడియో సాంగ్‌ చేయటం దేశంలోని ప్రధమం కావడం విశేషం. ఈ సందర్భంగా రామ్‌గోపాల్‌ వర్మ మాట్లాడుతూ,’మా పార్టనర్‌ రవివర్మతో కలసి నేను ‘ఆర్జీవీ డెన్‌ మ్యూజిక్‌’ను  ఆరంభిస్తున్నాని చెప్పడానికి థ్రిల్‌ ఫీలవుతున్నాను. ఇందులో ఏఐ యాప్స్‌తో రూపొందిన సంగీతం మాత్రమే ఉంటుంది. ఈ సినిమా మొత్తం ఏఐ సంగీతంతోనే చేస్తున్నాం. నేపథ్య సంగీతానికి కూడా ఏఐ మ్యూజిక్‌నే ఉపయోగిస్తున్నాం. వందేళ్ల భారతీయ చలన చిత్ర చరిత్రలో ఏఐ మ్యూజిక్‌తో వస్తున్న పూర్తి స్థాయి తొలి చలన చిత్రం ఇదని చెప్పటానికి గర్వంగా ఉంది’ అని తెలిపారు.