– ఏఐసీసీ రమ్మంటున్నది…టీపీసీసీ వద్దంటున్నది
– ఆంధ్రా పెత్తనమంటూ విమర్శలొస్తాయేమోనని అనుమానం
– బీఆర్‌ఎస్‌కు మరోసారి సెంటిమెంట్ రెచ్చగొట్టే అవకాశమిచ్చినట్టువుతుందని అంచనా
కాంగ్రెస్‌లో చేరాలనే వైఎస్ షర్మిల ప్రయత్నాలు ఫలించడం లేదు. ఆమె చేరికను ఏఐసీసీ అధిష్టానం తాత్కాలికంగా పెండింగ్‌లో పెట్టింది. ఈ విషయంలో టీపీసీసీ, ఏఐసీసీ మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె కాంగ్రెస్‌లో చేరితే తమకు అభ్యంతరం లేదంటూనే…తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కాకుండా ఏపీపీసీసీలో చేరాలని, ఆమె సేవలు అక్కడే ఉపయోగించుకోవాలని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు సూచించినట్టు తెలిసింది. షర్మిల చేరికపై ఏఐసీసీ అగ్రనేతలు సోనియగాంధీ, రాహుల్‌గాంధీ గ్రీన్‌సిగల్ ఇచ్చినప్పటికీ…స్థానిక పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర నాయకులు వద్దంటున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
గుడిగ రఘు
కాంగ్రెస్‌లో వైఎస్‌ఆర్‌టీపీని విలీనం చేయాలని నిర్ణయించుకున్న షర్మిల…నేరుగా కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. వారి మధ్య చర్చలు సఫలమైన తర్వాత ఢిల్లీలో సోనియా, రాహుల్‌గాంధీని కలిసిన విషయం తెలిసిందే. వైఎస్‌ఆర్ ఆశయాలను కాంగ్రెస్‌పార్టీ మాత్రమేనెరవేర్చగలదనే నమ్మకంతో ఉన్నట్టు కూడా షర్మిల ప్రకటించారు. సీడబ్య్లూసీ సమావేశాల సందర్భంగా మళ్లీ డీకేతో సమావేశమయ్యారు. ఇలా అగ్రనేతలతో షర్మిల సమావేశమైన తర్వాత రాష్ట్ర కాంగ్రెస్‌లో కొత్త అనుమానం మొదలైంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన షర్మిల రాష్ట్ర కాంగ్రెస్‌లో చేరి, ఇక్కడ ఏదో ఒక నియోజకవర్గంలో పోటీ చేయడం ద్వారా పార్టీకి ఇబ్బందులొస్తాయనే ఆందోళన వ్యక్తమవుతున్నది. పార్టీ పెట్టే సమయంలో వైఎస్ షర్మిల ఖమ్మం కోడలిగానూ, హైదరాబాద్‌లో పుట్టిన పెరిగిన విషయాలను ప్రస్తావించారు. సొంత పార్టీ పెట్టి తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర కూడా చేశారు. షర్మిలకు వ్యక్తిగతంగా ఛరిష్మా ఉన్నప్పటికీ పార్టీ పరంగా ప్రజల్లో పెద్దగా ఆదరణ లభించలేదు. దీంతో వైఎస్‌ఆర్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలనే వైపు ఆమె అడుగులేశారు. దీన్ని పసిగట్టిన కాంగ్రెస్ నేతలు అధిష్టానానికి ఇక్కడి రాజకీయ పరిణామాలను వివరించారు. దీంతో ఆమె చేరిక తాత్కాలికంగా వాయిదా పడింది. ఎన్నకల సమయంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరితే, అది బీఆర్‌ఎస్‌కు, సీఎం కేసీఆర్‌కు తెలంగాణ సెంటిమెంటు రెచ్చగొట్టడానికి అస్త్రంగా మారుతుందని టీపీసీసీ నేతలు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో పెత్తనం చేసేందుకు ఆంధ్రానేతలు వస్తున్నారంటూ కేసీఆర్ రెచ్చగొట్టే ప్రమాదం ఉందని పార్టీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అసలే అధికార పార్టీ తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టేందుకు అవకాశం కోసం కాచుకుని కూర్చుంది. ఇప్పటికే మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, వైఎస్ షర్మిల, మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ గడ్డపై జమవుతున్నారంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో షర్మిల, కేవీపీ పార్టీలో చేరితే అది బీఆర్‌ఎస్‌కు ఓ ప్రచార అస్త్రంగా మారుతుందని చెబుతున్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పంపుహౌస్ ప్రారంభోత్సవంలోనూ సీఎం కేసీఆర్ పొతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకంతో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన నేతల గురించి ప్రస్తావన చేయడం ద్వారా భవిష్యత్తులో వారి పెత్తనాన్ని సహించేది లేదంటూ పరోక్షంగా వ్యాఖ్యానించారు.