చెలరేగిన శశాంక్‌

Shashank erupted– టైటాన్స్‌పై పంజాబ్‌ గెలుపు
– గుజరాత్‌ 199/4, పంజాబ్‌ 200/7
నవతెలంగాణ-అహ్మదాబాద్‌
గుజరాత్‌ టైటాన్స్‌పై పంజాబ్‌ కింగ్స్‌ మెరుపు విజయం సాధించింది. 200 పరుగుల ఛేదనలో శశాంక్‌ సింగ్‌ (61 నాటౌట్‌, 29 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. ఆషుతోశ్‌ శర్మ (31, 17 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా అదరగొట్టాడు. ధావన్‌ (1), బెయిర్‌స్టో (22), ప్రభుసిమ్రన్‌ (35), కరన్‌ (5), సికిందర్‌ (15)లు 111/5కే పెవిలియన్‌కు చేరారు. ఈ దశలో శశాంక్‌ సింగ్‌ సూపర్‌ ఇన్నింగ్స్‌తో టైటాన్స్‌పై 19.5 ఓవర్లలో 3 వికెట్ల తేడాతో విజయాన్ని అందించాడు. అంతకుముందు, కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ (89 నాటౌట్‌, 48 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ అర్థ సెంచరీతో గర్జించాడు. సాయి సుదర్శన్‌ (33, 19 బంతుల్లో 6 ఫోర్లు), కేన్‌ విలియమ్సన్‌ (26, 22 బంతుల్లో 4 ఫోర్లు), రాహుల్‌ తెవాటియ (23 నాటౌట్‌, 8 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ టైటాన్స్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 199 పరుగుల భారీ స్కోరు సాధించింది.
అతనొక్కడే : టాస్‌ నెగ్గిన పంజాబ్‌ కింగ్స్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. టైటాన్స్‌ ఓపెనర్‌ వృద్దిమాన్‌ సాహా (11)ను ఆరంభంలో అవుట్‌ చేసినా కింగ్స్‌కు ఆశించిన పట్టు చిక్కలేదు. కేన్‌ విలియమ్సన్‌ (26) తోడుగా గిల్‌ 33 బంతుల్లో 40 పరుగులు జోడించాడు. బరార్‌ ఓవర్లో కేన్‌ నిష్క్రమించినా.. సాయి సుదర్శన్‌ (33) తోడుగా ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 31 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించిన శుభ్‌మన్‌ గిల్‌.. ఎక్కువగా స్ట్రయిక్‌ తీసుకోలేదు. జోరుమీదున్న సాయి సుదర్శన్‌ ఆరు బౌండరీలతో అదరగొట్టాడు. విజరు శంకర్‌ (8) నిరాశపరిచినా.. రాహుల్‌ తెవాటియ (23 నాటౌట్‌) తోడుగా గిల్‌ ధనాధన్‌ ముగింపు అందించాడు. తెవాటియ మూడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 8 బంతుల్లోనే 23 పరుగులు పిండుకున్నాడు. 48 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో శుభ్‌మన్‌ అజేయంగా 89 పరుగులు చేశాడు.