‘షష్టిపూర్తి’ సినిమా కాదు.. జీవితం

'Shashtipurti' is not a movie.. Lifeరూపేష్‌ హీరోగా మా ఆయి ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించిన సినిమా ‘షష్టిపూర్తి’. రాజేంద్రప్రసాద్‌, అర్చన ఇందులో ప్రధాన తారాగణం. ఆకాంక్షా సింగ్‌ ఇందులో రూపేష్‌ సరసన కథానాయికగా నటించారు. పవన్‌ ప్రభ దర్శకుడు. రూపేష్‌ చౌదరి నిర్మాత. ఈ చిత్ర గ్లింప్స్‌ని మేకర్స్‌ బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ,’ ‘నిజ జీవితంలో నాకు అరవై దాటిన తర్వాత షష్టి పూర్తి పెట్టకుండా తప్పించుకున్నాను. కానీ భగవంతుడు ఊరుకుంటాడా? ఇదిగో ఇలా షష్టిపూర్తి చేశాడు. ఇది సినిమా కాదు.. జీవితం. అందరూ గర్వపడే సినిమా. ఈ సినిమాను అందరూ థియేటర్లలో చూడాలి. తల్లిదండ్రుల పెళ్లి చూసే అవకాశం బిడ్డలకు ఉండదు. కానీ పిల్లలు చూడగలిగిన పెళ్లి ఏదైనా ఉందీ అంటే అది షష్టిపూర్తి ఒక్కటే. ప్రతి మనిషికి షష్టిపూర్తి చాలా ముఖ్యం. ఒక అద్భుతమైన సినిమా చేసే అవకాశాన్ని నాకు కల్పించాడు దర్శకుడు పవన్‌. ఫస్ట్‌ టైమ్‌ నిర్మాత అయినా కూడా.. ఎక్కడా చిన్న తేడా కూడా జరగకుండా చూసుకున్నారు’ అని తెలిపారు. ‘చాలా గ్యాప్‌ తర్వాత మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. మా ఆయి ప్రొడక్షన్‌ ప్రొడ్యూసర్‌ రూపేష్‌ చౌదరి, డైరెక్టర్‌ పవన్‌ ప్రభ వీళ్లిద్దరూ కలిసి నాకు ఈ సినిమా ప్రపోజ్‌ చేసినప్పుడు.. సినిమా పేరు ఏంటి? అని అడిగాను. ‘షష్టిపూర్తి’ అని అన్నారు. రాజేంద్ర ప్రసాద్‌, ఇళయరాజా, తోట తరణి… ఇంత మంచి కాంబినేషన్‌లో సినిమా చేయటం చాలా ఆనందంగా ఉంది. మంచి విలువలు ఉన్న సినిమాతో మరోమారు మీ ముందుకు వస్తున్నాను’ అని నటి అర్చన చెప్పారు. హీరో రూపేష్‌ మాట్లాడుతూ, ‘ఇది నా మొదటి సినిమా. సినిమాను అందరూ ఆదరించి, ఆశీస్సులు అందజేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు. ‘రాజేంద్రప్రసాద్‌, అర్చన, ఇళయరాజా..ఇలాంటి మహామహులతో సినిమా చేసే అవకాశాన్ని ఇచ్చిన మా నిర్మాతకి రుణపడి ఉంటాను. అలాగే మంచి విలువలు ఉన్న సినిమాని తీయడం సంతోషంగా ఉంది. చైతన్య ప్రసాద్‌ నాకు బంగారం లాంటి గిఫ్ట్‌ ఇచ్చారు. ఆ గిఫ్ట్‌ ఎవరో కాదు కీరవాణి. రెహమాన్‌ ఇక్కడకు రాలేదు కానీ.. ఆయన కూడా రెండు మంచి పాటలు రాశారు. ఇందులోని పాటలు, మాటలు, విజువల్స్‌.. ఇలా ప్రతీదీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ అవుతాయి’ అని దర్శకుడు పవన్‌ ప్రభ అన్నారు.