– కోహ్లి, రాహుల్ అజేయ సెంచరీలు
– పాక్‌పై భారత్ ఏకపక్ష విజయం
పాకిస్థాన్‌పై శతక తాండవం. బ్యాటింగ్ మాస్టర్ విరాట్ కోహ్లి (122 నాటౌట్), కెఎల్ రాహుల్ (111 నాటౌట్) అజేయ సెంచరీలతో చెలరేగారు. భారత టాప్-4 బ్యాటర్ల మెరుపులతో భారత్ 356/2 పరుగుల భారీ స్కోరు చేయగా.. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (5/25) ఐదు వికెట్ల మాయజాలం ప్రదర్శించాడు. పాకిస్థాన్‌ను 128 పరుగులకే కుప్పకూల్చిన భారత్ 228 పరుగుల తేడాతో ఏకపక్ష విజయం సాధించింది.
నవతెలంగాణ-కొలంబో
పాకిస్థాన్ చిత్తు. భారత్ ఏకపక్ష విజయం. కుల్దీప్ యాదవ్ (5/25) ఐదు వికెట్ల మాయజాలంతో చెలరేగటంతో భారీ ఛేదనలో పాకిస్థాన్ చేతులెత్తేసింది. 128 పరుగులకే కుప్పకూలిన పాకిస్థాన్.. 32 ఓవర్లలోనే భారత్‌కు తలొగ్గింది. దీంతో భార త్ 228 పరుగుల తేడాతో భారీ విజయం నమోదు చేసింది. అంతకుముందు,. విరాట్ కోహ్లి (122 నాటౌట్, 94 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లు), కెఎల్ రాహుల్ (111 నాటౌట్, 106 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ సెంచరీలతో కదం తొక్కారు. వర్షం అంతరాయం కలిగిన భారత్, పాకిస్థాన్ ఆసియా కప్ సూపర్4 మ్యాచ్‌లో రిజర్వ్ డే బ్యాటింగ్‌కు వచ్చిన విరాట్ కోహ్లి, కెఎల్ రాహుల్ జోడీ పాకిస్థాన్ బౌలింగ్‌ను చీల్చిచెం డాడింది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (58, 52 బంతుల్లో 10 ఫోర్లు), రోహిత్ శర్మ (56, 49 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్థ సెంచరీలు సాధించిన సంగతి తెలిసిందే.
శతక గర్జన :
ఆసియా కప్ గ్రూప్ దశ మ్యాచ్‌లో భారత టాప్-4 బ్యాటర్లు విఫలమవగా.. తాజాగా సూపర్4 మ్యాచ్‌లో టాప్-4 బ్యాటర్లే విరుచుకుపడ్డారు. తొలుత ఓపెనర్లు రోహిత్, గిల్ 121 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేశారు. కొత్త బంతితో పాక్ పేస్ త్రయం షహీన్, నసీం, రవూఫ్‌లపై ఎదురుదాడి చేసిన ఓపెనర్లు 100 బంతుల్లోనే 121 పరుగులు జోడించి భారీ స్కోరుకు గట్టి పునాది వేశారు. స్వల్ప విరామంలో ఓపెనర్లు నిష్క్రమించినా, వరుణుడి అంతరాయంతో ఆదివారం రోజు ఆట సోమవారానికి వాయిదా పడినా.. విరాట్ కోహ్లి, కెఎల్ రాహుల్ శతక తాండవం నుంచి పాకిస్థాన్ తప్పించుకోలేకపోయింది. తొలుత కోహ్లి ఆచితూచి ఆడగా.. కెఎల్ రాహుల్ కాస్త దూకుడు ప్రదర్శించాడు. సోమవారం ఆటలో కోహ్లి దూకుడుగా ఆడగా.. రాహుల్ నెమ్మదిగా పరుగులు సాధించాడు. రాహుల్ ఐదు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 60 బంతుల్లో అర్థ సెంచరీ నమోదు చేయగా.. విరాట్ కోహ్లి నాలుగు ఫోర్లతో 55 బంతుల్లో అర్థ సెంచరీ అందుకున్నాడు. ఫిఫ్టీ తర్వాత విరాట్ కోహ్లి గేర్ మార్చాడు. వేగంగా పరుగులు పిండుకున్నాడు. వికెట్ల మధ్య చురుగ్గా పరుగులు తీశాడు. ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో 84 బంతుల్లోనే వన్డేల్లో కెరీర్ 47వ సెంచరీ నమోదు చేశాడు. ఇక వన్డేల్లో వేగంగా 13000 పరుగులు సాధించిన బ్యాటర్‌గా సైతం కోహ్లి రికార్డు నెలకొల్పాడు. మరో ఎండ్‌లో ఈ ఏడాది మే 1 తర్వాత తొలిసారి ఆడుతున్న కెఎల్ రాహుల్ రీ ఎంట్రీ ఘనంగా చాటాడు. పది ఫోర్లు, రెండు సిక్సర్లతో 100 బంతుల్లో 100 పరుగుల మైలురాయి చేరుకున్నాడు. పాక్ స్పిన్నర్లు, పేసర్లను దంచికొట్టిన ఈ జోడీ.. మూడో వికెట్‌కు అజేయంగా 233 పరుగులు జోడించింది. చివరి ఓవర్లో రెండు ఫోర్లు, ఓ సిక్సర్ సంధించిన విరాట్ కోహ్లి భారత ఇన్నింగ్స్‌కు పర్‌ఫెక్ట్ ముగింపు అందించాడు. పాక్ బౌలర్లలో షహీన్ షా అఫ్రిది (1/79), షాదాబ్ ఖాన్ (1/71) చెరో వికెట్ పడగొట్టారు.
కుల్దీప్ మాయ
357 పరుగుల ఛేదనలో పాక్ 128 పరుగులకే కుప్పకూలింది. ఇమామ్ (9) వికెట్‌తో బుమ్రా బ్రేక్ సాధించగా.. క్రమం తప్పకుండా పాక్ వికెట్లు చేజార్చుకుంది. బాబర్ (10), రిజ్వాన్ (2), సల్మాన్ (23), ఇఫ్తీకార్ (23), షాదాబ్ ఖాన్ (6), ఫహీం (4), జమాన్ (27)లు తేలిపోయారు. కుల్దీప్ యాదవ్ మాయలో విలవిల్లాడిన పాక్ బ్యాటర్లు.. పోరాడకుండానే ఓటమికి సిద్ధపడ్డారు. 32 ఓవర్లలోనే లాంఛనం ముగించిన భారత్.. సూపర్4 దశలో ఘన విజయం సాధించింది.