ఆమె

ఆమెగేరు మార్చి బండిని రోడ్డు మీద పెట్టి హారన్‌ కొట్టగానే
ఆశ్చర్యార్ధక చూపుల వలయాలు అవహేళనాపూర్వక దష్టులు
గ్రహాంతరం నుండి భూగోళానికి దిగి వచ్చిన అన్యలోకప్రాణిగానో
నాలుగు కాళ్ళ నాలుగు చేతుల వింత జంతువుగానో
ఆమెను కుట్టే కందిరీగలు తేనె తుట్టెను కదిలించినట్లు
ముఖం చుట్టూ ముసురుతున్న ముళ్ళచూపులు
ఆకాశం లో సగమని అతిశయోక్తులు చెప్పినా
ఆటవిక పర్వంనుండి అణుపర్వం వరకు
మారని మౌలిక సిధ్ధాంతాలు, మూర్ఖ సంప్రదాయాలు
సకల కళానిధులైనా విజ్ఞాన సర్వస్వాలైనా
గేస్‌ పొయ్యిలూ గరిటెలు స్త్రీలకేననీ, బయటపని పురుషులకేననీ
పాఠ్య పుస్తకాలలో మనసు పుస్తకాల్లో సచిత్రంగా ముద్రించి నపుడు
ఏ కాలమైనా పురుష కాలమే, నియమితపనివేళల భద్రత ఉద్యోగాలకే
స్త్రీల బ్రతుకులు పరిమితమైనపుడు
వంటింటి కుందేళ్ళు, ఇంటికి దీపం ఇల్లాళ్ళు
పాత పడికట్టు పదాల వలల్లోనే ఇంకా కొట్టు మిట్టాడుతున్నపుడు
లారీ డ్రైవర్లు రైలింజన్‌ డ్రైవర్లంటే పురుషులేనని స్థిరపడినపుడు
ఆ పాతరాతలను చెరిపేసిన ధీరురాలు ఆమె
చీకటి తెరలు ముసురుకొన్నపుడు
అర్థరాత్రి రైలు దిగి ఇంటికి వచ్చే వేళ గత్యంతరం లేక ఎక్కినప్పుడు
మద్యం మత్తు తలకెక్కో, జన్మతః సంక్రమించిన మగాహంకారంతోనో
తుమ్మ చెట్ల డొంక ల్లోకో, గుబురు వక్షాల గుహల్లోకో
దారి మళ్లించి నా శరీరనిధిని ఈడ్చుకెళ్ళినపుడు
భయం పులి సంచరిస్తున్న నరకక్షణాలకుసెలవు
ఇప్పుడు అమ్మ ఒడిని కరచుకున్న చంటి పిల్లను
నిశ్చింత గూట్లో కువకువలాడుతూ
గుడి గోపురం మీదో, మసీదు మీనార్‌ మీదో
ఎగిరే పావురాన్ని, మాలాంటి వాళ్ళని ఎక్కించుకొని
హిమాలయమంత పొగరుతో
దేశం జెండాకున్న గర్వంతో మందహాసంతో
ముందుకు వెళ్తూ చిద్విలాసంగా ఆమె
– మందరపు హైమవతి, 9441062732