కుటుంబం అంటే మొగుడు పెళ్ళాల సంసారం. సాధారణంగా మొగుడు యజమానిగా వ్యవహరిస్తాడు. ఆధిపత్య స్వభావ సమాజంలో యజమాని స్థానంలో ఉన్నవాడు వీలైనంత ఆధిక్యత ప్రదర్శిస్తాడు. ఇందులో భాగంగా భార్యను భర్త కొట్టడం, తిట్టడం సమంజసం కాకున్నా చలామణిలో ఉన్న వ్యవహారం. కానీ భార్యనే భర్తను కొట్టడం ఆశ్చర్యం. ఈ స్థితిలో ‘మొగన్ని కొట్టి మొర పెట్టిందట’ అనే సామెత పుట్టింది. మొగన్ని కొట్టే పెళ్ళాన్ని రంకులాడి అనే పేరు వస్తుందని తనే కొట్టి తనే దెబ్బలు పడ్డట్టు ఏడవడం. ఎవరు ఎవరిపై ఆధిపత్యం చెలాయించకూడదు. కానీ చలాయించడం నడుస్తున్న కాలం. అట్లాగే మరొక సామెత. ‘మొగుడు కొట్టిన దెబ్బ ఊరంతా బొబ్బ, మిండెడు కొట్టిన దెబ్బ సప్పుడు లేని దెబ్బ’ ఇక్కడ మిండెడు అంటే వివాహేతర రహస్య సంబంధీకుడని అర్థం. భర్త కొడితే ఊరంతా లొల్లి చేయడం, పైన పేర్కొన్న మనిషికి రహస్య సంబంధం కాబట్టి మౌనంగా ఉండడం అని అర్థం. ‘ముచ్చట సంబురాన మొగన్ని మరిచిందట’ అంటే పక్కింటికి పోయి ముచ్చట పెట్టి పెట్టి భర్త వస్తాడు అన్నం పెట్టాలే అనే విషయం మర్చిపోయే సందర్భంలో ఈ సామెత వాడతారు. మరొక సామెత మొగుడు పెళ్లాలా మీదనే ‘మొగడు సచ్చినంక ముండ బుద్ధిమంతురాలు అయిందట’ అంటే ఆయన చావుకు ఈమె చర్యలే కారణం అయి ఉంటాయి. చివరికి బుద్ధిమంతురాలుగా వ్యవహరిస్తే లాభమేమిటి. తన కారణం వల్లనే ఆయన మరణం సంభవిస్తే, తరువాత ఇగ మానుకుంటా అంటే ఏమి ప్రయోజనం?
– అన్నవరం దేవేందర్, 9440763479