ఆమె ఒక చైతన్యం!

She is a consciousness!‘ఇంటి పనుల కోసమే ఇల్లాలు. భార్య భర్తను సుఖపెట్టాలి. ఆమె అవసరాలు భర్త తీర్చాలి.’ అని ఈ దేశపు అరెస్సెస్‌ అధినేత మోహన్‌ భగవత్‌ బహిరంగంగానే సెలవిచ్చారు. ఇక స్త్రీ, పురుషులు సమానం కాదు, దేవుడు ఇద్దర్నీ సమానంగా సృష్టించలేదని, స్త్రీ, పురుషుడు సృష్టించిన సమాజానికి లోబడి ఉండాలని అప్ఘనిస్తాన్‌ విద్యాశాఖ మంత్రి ప్రకటించినదీ భగవత్‌కు సరిపోలుతున్నది. ఇరాన్‌లోనూ అంతే. మహిళను పురుషులకు సేవచేసే బానిసగా చూడటమే మతవాదుల భావజాలం. మన ఏలికల భావజాలమూ ఆ కుదురు నుండి వచ్చినదే కావటం ఆందోళన కలిగించే అంశం. ఇలాంటి ఆలోచనాపరులు స్త్రీలకోసం అది చేశాం ఇది చేశాం అని ప్రచారాలు చేస్తుండటం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ కపట వ్యూహాలను పసికట్టవలసిన అవసరం వుంది.
ఆధునిక వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడయినా సరే, స్వేచ్ఛా స్వాతంత్య్రాలను కోరు కుంటుంది. అది పెట్టుబది దారీ వ్యవస్థా విధానంలోనూ వ్యాపార స్వేచ్ఛతో పాటు మనుషులకు స్వేచ్ఛ ఉండాలనే అంటుంది. స్వేచ్ఛా సమానత్వాలు నేటి ప్రపంచపు నినాదాలు. సమస్యలు కూడా. ఇప్పటికీ ప్రపంచంలో మానవ హక్కు లకు, స్వేచ్ఛా సమానత్వాలకు బోలెడన్ని ఆటంకాలు, అవరోధాలు కలుగుతూనే వున్నాయి. మరీ ముఖ్యంగా స్త్రీల హక్కులను, సమానత్వాన్ని నిరాకరిస్తూనే వున్నారు. మతం ఆధారంగా వారిని అణిచివేయడం, హద్దులు గీయటం, ఆంక్షలు విధించడం కొనసాగుతూనే వుంది. అందుకు ప్రతిఘటనా వెల్లువెత్తుతూనే వుంది. ఇప్పుడా ప్రతిఘటనా పతాకకు ప్రపంచ శాంతి పురస్కారం అందింది. ‘ఆధునిక స్త్రీ చరిత్రను పునర్లిఖిస్తుంది’ అన్న గురజాడ భావాన్ని నిజం చేస్తూనే వున్నారు నేటి మహిళలు. కొరడాలతో కొట్టి శిక్షించినా, ఎన్నిసార్లు నిర్భంధాలకు గురిచేసినా, శిక్షలు పడినా, ముప్పయేండ్లుగా జైలులో గడిపినా, నేటికీ జైళ్లోనే వున్న నర్గిస్‌ మొహమ్మది మానవ హక్కుల కోసం, మహిళా హక్కుల కోసం నినదిస్తూనే వుంది. ఆమె విదేశీ ప్రయాణాలపై ఉన్న ఆంక్షలు ఎత్తివేసినా తన సొంత దేశం ఇరాన్‌ భూభాగాన్నీ వదిలిపోనని ప్రకటించిన ఆ దేశభక్తి ఆమెది. ప్రపంచంలోని మతాలలో పితృ స్వామిక రాజ్య నిర్భందానికి గురవుతున్న మహిళలందరికీ ఆమె పోరాటం గొప్ప స్ఫూర్తి. చైతన్యపూరిత ప్రేరణ. ఆమెకు నోబెల్‌శాంతి బహుమతి రావడం మహిళా ఉద్యమాలకు కొండంత బలం.
‘ప్రభుత్వం నన్ను ఎంత అణగదొక్కాలని చూస్తే, ఎంతగా శిక్షిస్తే నాలో పోరాటస్ఫూర్తి అంతకంతకూ పెరుగుతుంది. దేశంలో మహిళలు స్వేచ్ఛా వాయు వులు పీల్చుకునే వరకు ఈ పోరాటం ఆగదు’ అని చెప్పే ఇరాన్‌ దేశ మహిళా ఉద్యమకారణి నర్గిస్‌ అత్యంత సాహసవంతురాలు. ‘వుమన్‌ లైఫ్‌ ఫ్రీడమ్‌’ అనే ఆమె ఆలోచనని, 1979 నుండి అధికారంలో వున్న ఇరాన్‌ మత ప్రభుత్వం నియంత్రించలేకపోయింది. 2022లో కుర్ధిష్‌ అమ్మాయి మసాజినా అమిని, ఇరాన్‌ మోరల్‌ పోలిసింగ్‌కు బలైపోయినప్పుడు, ఇరాన్‌ మహిళలు రోడ్డు మీదకు వచ్చి జుట్టు కత్తిరించుకుని చేసిన ఆందోళనకు నర్గిస్‌ పోరాటం ప్రేరణ. ఆ పోరాటంలో 500 మంది మహిళలు చనిపోగా ఇరవై వేల మంది జైలు పాల య్యారు. అయినా పోరాడుతూనే వున్నారు. ప్రపంచవ్యాపితంగా ఏ మతంలో అయినా, ఆ మత నియమాల పేరుతో మహిళలపై చేసే అణిచివేతను ఎదిరించి పోరాడే మహిళలందరికీ దక్కిన గౌరవంగానే ఈ బహుమతిని భావించాలి. నర్గిస్‌ మొహమ్మది ఇంజనీరింగు చదివినా జర్నలిస్టుగా పనిచేస్తూ, మానవ హక్కుల కోసం పోరాడుతున్నారు. జైళ్లోంచే పత్రికలకు వ్యాసాలు రాశారు. ఇప్పుడు ఆమెను జైళ్లోనే పెట్టి ఉంచింది అక్కడి మితవాద ప్రభుత్వం. మన దేశంలో కూడా అదే జరుగుతోంది. నిజాలు వెలికితీస్తూ, ప్రభుత్వ అసంబద్ధ విధానాలను బయట పెట్టే ప్రయత్నం చేస్తున్న ప్రముఖ జర్నలిస్టు ప్రబీర్‌ పురకాయస్తతో పాటు అనేకమందిని తప్పుడు ఆరోపణలతో జైళ్లో పెట్టింది ఇక్కడి ప్రభుత్వం కూడా. హక్కుల కార్యకర్తలనూ నిర్భంధాలకు గురిచేస్తోంది. అందుకే స్వేచ్ఛ కోసం పోరాటం అనివార్యమవుతోంది.
ప్రపంచంలోని ఏ మతమయినా స్త్రీలకు సమానత్వాన్ని, స్వేచ్ఛను నిరాకరి స్తూనే వున్నది. అది ఇరాన్‌లో అయినా, ఇండియాలో అయినా, అప్ఘనిస్తాన్‌ అయినా వారి భావాలన్నీ మహిళను హీనంగా చూడటమే. ‘ఇంటి పనుల కోసమే ఇల్లాలు. భార్య భర్తను సుఖపెట్టాలి. ఆమె అవసరాలు భర్త తీర్చాలి.’ అని ఈ దేశపు అరెస్సెస్‌ అధినేత మోహన్‌ భగవత్‌ బహిరంగంగానే సెలవిచ్చారు. ఇక స్త్రీ, పురుషులు సమానం కాదు, దేవుడు ఇద్దర్నీ సమానంగా సృష్టించలేదని, స్త్రీ, పురుషుడు సృష్టిం చిన సమాజానికి లోబడి ఉండాలని అప్ఘనిస్తాన్‌ విద్యాశాఖ మంత్రి ప్రకటించినదీ భగవత్‌కు సరిపోలుతున్నది. ఇరాన్‌లోనూ అంతే. మహిళను పురుషులకు సేవచేసే బానిసగా చూడటమే మతవాదుల భావజాలం. మన ఏలికల భావజాలమూ ఆ కుదురు నుండి వచ్చినదే కావటం ఆందోళన కలిగించే అంశం. ఇలాంటి ఆలోచనా పరులు స్త్రీలకోసం అది చేశాం ఇది చేశాం అని ప్రచారాలు చేస్తుండటం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ కపట వ్యూహాలను పసికట్టవలసిన అవసరం వుంది. ఎక్కడ తిరోగమనవాదులు అధికారంలోకి వస్తారో అక్కడల్లా హక్కులు, స్వేచ్ఛ హరించబడుతూనే వుంటుంది. ఇప్పుడు ఇరాన్‌లోనూ ఇండియాలోనూ ఈ రకమైన నిర్భంధమే కొనసాగుతున్నది. ఇలాంటి సంకెళ్లకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడా ల్సిందేనని నర్గిస్‌ మొహమ్మది చెప్పిన సందేశం ఎంతో స్ఫూర్తిదాయకమైనది. ఆమె పోరాటానికి జేజేలు.