సృజనాత్మక కళలంటే ఆమెకు ఎంతో మక్కువ. చిన్నతనం నుండి ఆర్కిటెక్చర్, డిజైనింగ్ అంటే ఎంతో ఆసక్తి. పాఠశాల విద్య పూర్తి చేసే నాటికే ఇందులోనే తన కెరీర్ కొనసాగాలని బలంగా నిర్ణయించుకుంది. అయితే అప్పటికి అది పురుషాధిక్యత రాజ్యమేలుతున్న రంగమని అవగాహన పెద్దగా లేదు. ఒక్క సారి ప్రవేశించిన తర్వాత ఎన్ని సవాళ్లు ఎదురైనా ముందుకే పోవాలని భావిం చింది. ఆ ధైర్యంతోనే 1989లో స్థపతి పేరుతో తన సొంత ఆర్కిటెక్చర్ సంస్థను ప్రారంభించింది. ఆమే ప్రముఖ ఆర్కిటెక్చర్ విపుల్ బి వర్షన్యేయ. ఇప్పుడు విద్యా సంస్థలు, ఎయిర్‌పోర్ట్ టెర్మినల్స్, ప్రజా రవాణా వంటి నిర్మాణాలలో తన మార్క్‌ను చూపిస్తున్న ఆమె పరిచయం నేటి మానవిలో…
విపుల్ తండ్రి టౌన్ ప్లానర్. చిన్న పిల్లగా ఉన్నప్పటి నుండి సృజన్మాతక కళలంటే ఆమెకెంతో ఇష్టం. ఆర్కిటెక్చర్, డిజైన్‌పై మక్కువ చూపేది. ఈ ఆసక్తిని అలాగే కొనసాగించింది. పాఠశాల పూర్తి చేసే సమయానికి ఆర్కిటెక్చర్‌లో వృత్తిని కొనసాగించాలని బలంగా అనుకుంది. హైస్కూల్లో సైన్స్, గణితంలో మంచి మార్కులు సాధించేది. ఆమె ఆర్కిటెక్చర్‌లోకి రావాలనే నిర్ణయానికి తండ్రి మద్దతునిచ్చాడు. ఈ నిర్ణయమే ఆమె 1989లో తన సొంత కంపెనీ అయిన స్థపతిని ప్రారంభించేలా చేసింది. ఇప్పుడు ఆమె తన భర్త అనుజ్ వర్షన్యేయతో కలిసి లక్నో ప్రధాన కార్యాలయంగా ఆర్కిటెక్చరల్ కంపెనీని నడుపుతోంది.
స్పష్టమైన ఆలోచనతో…
పెద్ద పెద్ద పట్టణాల్లో ఎయిర్‌పోర్ట్ టెర్మినల్స్, పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం ఆమె సంస్థ వ్యక్తిగత నివాసాలను నిర్మించింది. ఇది వారసత్వ పరిరక్షణ ప్రయత్నాలకు కూడా ప్రసిద్ధి చెందింది. విపుల్ తన సొంత కంపెనీని ప్రారంభించాలని మొదటి నుండి చాలా స్పష్టంగా ఉంది. ఆమె భర్త, సంస్థ సహ వ్యవస్థాపకుడైన అనుజ్ ఐఐటీ రూర్కీ నుండి స్ట్రక్చరల్ ఇంజనీర్ చేశారు. ఈ అనుభవంతోనే అతను విపుల్‌కు సహకరించారు. ‘నేను ప్రణాళికను సిద్ధం చేసాను. వ్యాపారం ప్రారంభించాలనే స్పష్టమైన ఆలోచన నాలో కళాశాల నుండే ఉంది. మా కంపెనీ అన్ని రకాల ప్రాజెక్ట్‌లను చేస్తున్నప్పటికీ, ఇటీవల మేము విమానయానం, విద్యా భవనాలు, రావాణా వ్యవస్థ వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నాం.
ఆమె ప్రయాణం
లక్నోలోని ఖుర్రామ్‌నగర్‌లో ఒక కుటుంబానికి ఇల్లు నిర్మించడం ద్వారా విపుల్ తన ప్రయాణాన్ని ప్రారంభించారు. అప్పటి నుండి వారు భారతదేశంతో పాటు ఇతర దేశాల్లో కూడా సుమారు వెయ్యి నిర్మాణాలను రూపొందించారు. స్థపతి రూపొందించిన ప్రాజెక్టులలో భుజ్ పునరావాసం, లేV్‌ా విమానాశ్రయం చాలా ప్రత్యేకమైనవని ఆమె అంటున్నారు. 2001లో భుజ్‌లో సంభవించిన భారీ భూకంపం ఆసుపత్రుల వంటి మౌలిక సదుపాయాలతో సహా 90శాతం భవనాలను ధ్వంసం చేసింది. ఈ విపత్తు దాదాపు ఆరులక్షల మందిని నిరాశ్రయులను చేసింది. గుజరాత్ రాష్ట్రంలో 14 ఏండ్ల కంటే తక్కువ వయసున్న దాదాపు మూడు మిలియన్ల మంది పిల్లలను ప్రభావితం చేసింది. ‘డిజైనింగ్ చేస్తున్నప్పుడు నేను స్థలాకృతి, వాతావరణం, విపత్తులను తట్టుకునే శక్తి వంటి వాటికి అధిక ప్రాధాన్యం ఇస్తాను. అవసరమైన విస్తృతమైన పునరాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని నివాసితులకు సౌకర్యవంతమైన వాతావరణాన్ని సృష్టించడంపై మా దృష్టి కేంద్రీకరించబడి వుంటుంది’ ఆమె చెప్పారు.
ఇది గొప్ప విజయం
రెండేండ్లలో సంస్థ భుజ్ పునరావాస ప్రాజెక్ట్‌ను పూర్తి చేసింది. దాదాపు 1,000 ఇళ్లను నిర్మించి బాధిత కుటుంబాలకు అందించింది. లేV్‌ా విమానాశ్రయం కూడా అనేక సవాళ్లతో వచ్చిందని విపుల్ అంటున్నారు. ఈ ప్రదేశం అసమాన స్థలాకృతి, కఠినమైన వాతావరణమే దీనికి కారణం ‘ఇతర చలి ప్రాంతాలలోని విమానాశ్రయాలను అధ్యయనం చేసి, వాటి నుండి ప్రేరణ పొందాము. ముఖ్యంగా రష్యాలో మేము ఈ ప్రాంత ప్రత్యేక పరిస్థితులను అవసరమైన వినూత్న పద్ధతులను రూపొందించగలిగాం. దీని నిర్మాణ సమయంలో భూఉష్ణ శక్తిని ఉత్పత్తి చేయడానికి ఘనీభవించిన నీటిని ఉపయోగించడం ఒక కీలకమైన పురోగతిగా మాకు అనిపించింది. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం వల్ల కార్బన్ న్యూట్రాలిటీని సాధించే అద్భుతమైన ఫీట్‌ని సాధించగలిగాం. భారతదేశంలో ఇది గొప్ప విజయం. స్థపతి న్యూ ఢిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా పునరాభివృద్ధిని కూడా చేపట్టింది. ఇది ఒక ఎగ్జిబిషన్ సెంటర్. ఢిల్లీ రూపకల్పనలో కూడా పాలుపంచుకుంది. లీజర్ పార్క్, నోయిడా, అయోధ్యలోని మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం కూడా మా సంస్థే నిర్మించింది
సవాళ్లు తప్పవు
చాలా మంది మహిళా పారిశ్రామికవేత్తల మాదిరిగానే విపుల్ కూడా తన వ్యాపార ప్రయాణంలో అనేక సవాళ్లు ఎదుర్కొన్నారు. ప్రారంభంలో సంస్థ అనేక క్లిష్ణ పరిస్థితులను ఎదుర్కొంది. ఆ సమయంలో సిబ్బందిని చాలా వరకు తగ్గించవలసి వచ్చిందని ఆమె గుర్తుచేసుకున్నారు. వ్యాపారాన్ని నిలబెట్టుకోవడానికి చిన్న ప్రాజెక్టులు, ఇంటీరియర్ డిజైన్ పనులను కూడా చేపట్టింది. ‘మేము సాధారణ ప్రభుత్వ పనులతో పాటు చిన్న, ప్రైవేట్ ప్రాజెక్టులను కూడా ఉపయోగించాం. ఇలాంటి మా స్థిరమైన ప్రయత్నాల వల్ల సంస్థ ఫలించింది’ అని ఆమె జతచేస్తున్నారు. అదే పంథాలో ఆర్కిటెక్చర్ రంగంలో మహిళగా ఉండటం కూడా ఆమెకు ఓ సవాల్‌గా మారింది. భర్తతో కలిసి వ్యాపారం ప్రారంభించినప్పుడు చాలా మంది మొదట అతన్ని మాత్రమే సంస్థకు బాస్‌గా భావించారు. ‘లింగ వివక్ష చాలా సూక్ష్మ పద్ధతిలో ఉంటుంది. కంటికి కనబడదు. కానీ అది చివరికి ఆవిరైపోయింది’ ఆమె జతచేస్తుంది. ఇటువంటి సవాళ్లను న్యాయంగా ఎదుర్కొంటూ, కష్టాలు అనివార్యమే కానీ తాత్కాలికమైనవని ఇతర మహిళా పారిశ్రామికవేత్తలు అర్థం చేసుకుంటారని విపుల్ ఆశిస్తున్నారు. ‘మీపై మీకు నమ్మకం ఉండాలి. ఏ ప్రయాణమైనా సాఫీగా సాగదు. కానీ మీరు మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి రోడ్‌బ్లాక్‌లకు కూడా సిద్ధంగా ఉండాల్సిందే’ ఆమె చెప్పారు.