పురుషాధిక్య ప్రపంచంలో ఓ మహిళ నాయకత్వ స్థానానికి ఎదగడం అంటే సాధారణ విషయం కాదు. ఇక వ్యాపారమంటే కుటుంబాల నుండి వారసత్వంగా స్వీకరించేవారే ఎక్కువ. ఇలాంటి వారు వ్యవస్థాపకులుగా మాత్రమే కాక శతకోటీశ్వరులుగా ఎదుగుతారు. అయితే పద్మశ్రీ గ్రహీత జస్వంతిబెన్ జమ్నాదాస్ పోపట్ అలాంటి వారసత్వానికి అతీతం. భారత చరిత్రలోనే ఈమె స్ఫూర్తిదాయక కథకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. అదే 62 ఏండ్ల కిందట ఆమె ప్రారంభించిన బ్రాండ్ లిజ్జత్ పాపడ్. తన ఏడుగురు అక్కచెల్లెళ్లతో కలిసి ఆనాడు ఆమె ప్రారంభించిన ఆ ప్రయాణం ఇప్పుడు దేశవ్యాప్తంగా అనేక మంది మహిళల స్వతంత్రతకు, సాధికారతకు కేంద్రంగా ఉంది.
ప్రస్తుతం 94 ఏండ్ల జస్వంతిబెన్ అందులో 65 ఏండ్లు సోదరీమణులతో కలిసి ప్రారంభించిన వ్యాపారానికి తన జీవితాన్ని అంకితం చేసింది. ఉపాధి సరిగా దొరకని కాలం అది. చదువులూ అంతంత మాత్రమే. అలాంటి సమయంలో తన పెద్ద కుటుంబానికి ఆర్థికంగా సహకరించాలని 1959లో ఏడుగురు మహిళలు కలిసి ప్రారంభించిన బ్రాండ్ లిజ్జత్ పాపడ్. అదే ఇప్పుడు మొత్తం దేశానికి గేమ్ ఛేంజర్‌గా మారింది.
80 రూపాయాలు అప్పు చేసి
1959 మార్చి 15న జస్వంతిబెన్ జమ్నాదాస్ పోపట్, పార్వతీబెన్ రాందాస్ తోడనీ, ఉజంబెన్ నారందాస్ కుండలియా, బానుబెన్‌లతో సహా ఏడుగురు అక్కచెల్లెళ్లు ఉన్నారు. ఎన్. తన్నా, లగుబెన్ అమృత్‌లాల్ గోకాని, జయబెన్.వి. విఠలానీ, చుతాడ్‌బెన్ అమిష్ గవాడెమ్ ఇలా అందరూ కలిసి రద్దీగా ఉండే ముంబై ప్రాంతంలోని పాత భవనం టెర్రస్‌పై గుమిగూడారు. విక్రయించడానికి నాలుగు ప్యాకెట్ల పాపడ్‌లను బయటకు తీశారు. ఆ ఏడుగురు మహిళలు కలిసి ఈ వ్యాపారాన్ని కేవలం రూ.80తో ప్రారంభించారు. చగన్‌లాల్ కరామ్సీ పరేఖ్ అనే సామాజిక కార్యకర్త వద్ద ఆ మొత్తాన్ని వారు అప్పుగా తీసుకున్నారు. కుటుంబం కోసం డబ్బు సంపాదించడానికి వారు చేసిన తీవ్ర ప్రయత్నం లిజ్జత్ పాపడ్‌గా మారుతుందని వారు ఎన్నడూ ఊహించలేదు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో తమ కోసం ఎదురుచూసిన పోరాటాల నుండి వారు ఎప్పుడూ తప్పించుకునే ప్రయత్నం చేయలేదు.
నాణ్యతకు మారుపేరుగా
రద్దీకి, పేదరికానికి చిహ్నంగా ఉండే ముంబై పట్టణంలో వారి వ్యాపారం వృద్ధి చెందడానికి ఎక్కువ కాలం పట్టలేదు. మూడు నెలల్లోనే పాపడ్ నాణ్యతగా, రుచిగా ఉండటంతో తయారు చేసే వారి సంఖ్య ఏడు నుండి 25 మంది మహిళలకు పెరిగింది. అయితే వర్షాకాలం ప్రారంభం కావడంతో టెర్రస్‌పై పాపడ్‌లు ఎండ బెట్టడం ఇబ్బందిగా మారింది. ఈ అనుభవం నుండి వారు మరుసటి ఏడాది మంచాలు, పొయ్యి సిద్ధం చేసుకున్నారు. నాణ్యతలో రాజీ పడకుండా వారు తమ వ్యాపారాన్ని కొనసాగించారు. దాని కోసం సరైన ఖాతాలు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించుకున్నారు.
మొదట్లో అడ్డంకులు
ప్రస్తుతం దేశంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న లిజ్జత్ పాపడ్ విస్తరణకు మొదట్లో అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. విస్తరణ కోసం వారి మొదటి ప్రయత్నం విఫలమైంది. రుచికి, నాణ్యతకు మారుపేరుగా ఉన్న లిజ్జత్ తరువాతి ఏడాది ముంబైతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాలలో కూడా బ్రాంచులు ఏర్పాటు చేయగలిగారు. దాంతో ఈ మహిళలు అవార్డులతో పాటు ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. విదేశీ ప్రముఖులు సైతం వీరి పరిశ్రమలను సందర్శించారు. ఎగుమతులు భారీగా వృద్ధి చెందాయి. శ్రీ మహిళా ఫ్రిహ ఉద్యోగ్ లిజ్జత్ పాపడ్‌గా ఉన్న ఈ పరిశ్రమ తర్వాత కాలంలో శ్రీ ఉమెన్ హోమ్ ఇండిస్టీ టేస్టీ పాపార్డమ్స్‌గా మారి ఓ సొసైటీగా నమోదు పేరు నమోదు చేసుకుంది.
వివిధ రకరకాలు
వ్యాపారం వృద్ధి చెందే కొద్ది రకరకాల రుచులతో వివిధ పాపడ్‌లను తయారు చేయడం ప్రారంభించారు. ఖఖ్రా (1974), మసాలా (1976), వాడి, గోధుమ అట్టా, బేకరీ ఉత్పత్తులపై (1979) దృష్టి పెట్టారు. వీటిని తయారు చేసేందుకు పిండి మిల్లులను (1975), ప్రింటింగ్ విభాగం కూడా ఏర్పాటు చేశారు. పాలీప్రొఫైలిన్ ప్యాకింగ్ డివిజన్ (1978) కూడా ఏర్పాటు చేశారు. అయితే తర్వాత కాలంలో వారు కుటీర తోలు (1979), అగ్గిపెట్టెలు (1979), అగర్బత్తిలు (ధూపం కర్రలు) వంటి కొన్ని వెంచర్‌లు ప్రారంభించారు కానీ అవి అంతగా విజయవంతం కాలేదు.
మహిళలకు ఉపాధి
ఈ లిజ్జత్ పాపడ్ నైపుణ్యం ఉన్న నిరక్షరాస్యులైన గ్రామీణ మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను అందిస్తున్నది. ప్రస్తుతం వారు తమ సంస్థలో 43000 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. వేల మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నందు ఆమెకు ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. తన 91వ ఏట 2021 జనవరి 26, భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆమె భారత ప్రభుత్వం నుండి ఈ పురస్కారాన్ని అందుకున్నారు. మరింత మంది మహిళలకు ఉపాధి కల్పించి వారిని సాధికాతవైపు నడిపించాలని ఆమె కోరుకుంటుంది.