రెడీ… లైట్స్… కెమెరా.. యాక్షన్.. అంటూ సాగే సినిమా లోకం ఓ ప్రత్యేకం. అలాంటి రంగంలో చదువూ సంధ్యా లేని ఓ మహిళ అద్భుతాన్ని సృష్టించారు. కూలీ పనులు చేస్తూ.. చిన్నపాటి హోటల్ నడుపుతూ ఏకంగా రూ.80 లక్షలు పెట్టి సినిమానే తీశారు. ఆమె పేరు చెన్నెబోయిన వెంకట నర్సమ్మ, ప్రకాశం కొనకనమిట్ల మండలం పెదరికట్ల గ్రామం. సినిమా అంటే చిన్నప్పటినుంచి విపరీతమైన ఇష్టం. ఆ ఇష్టమే కొడుకు చేత ఓ సినిమాను తీయించేలా చేసింది. సంకల్ప బలం ఉంటే ఎంత కష్టమైనా ఇట్టే సాధించొచ్చు అని రుజువు చేసిన ఆమె పరిచయం నేటి మానవిలో…
వెంకట నర్సమ్మ, చెన్నెబోయిన వెంకటేశ్వరరావు దంపతులది ఓ చిన్న రైతు కుటుంబం. ఉండేది చుట్టుంటి పాకలో.. నేటికీ వంట కట్టెలపొయ్యి మీదే. వారి కొడుకు వెంకట రవీంద్రనాథ్. దంపతులు ఇద్దరూ తమ పొలంలో పనులు చేసుకుంటూ ఖాళీ సమయాల్లో వ్యవసాయ పనులకు సైతం వెళ్తుంటారు. కొడుకు రవి చిన్నా చితకా ఉద్యోగాలు చేస్తున్నాడు. బాల్యం నుంచే సినిమాలపై ఓ ప్రత్యేకమైన ఇష్టమున్న వెంకట నర్సమ్మ ఎప్పటికైనా ఓ సినిమా తీయాలనుకున్నారు. తరచూ ఆ మాట అంటూ ఉంటే భర్త, కొడుకు నవ్వి ఊరుకునేవారు. ఆమె మాటలను సరదాగా తీసుకునేవారు.
బలమైన కోరికతో…
‘సినిమా అంటే మాటలు కాదు, ధనం మూటలు కావాలీ’ అనుకునే వారు ఆ తండ్రీకొడుకులు. ఆ విషయం తనకూ తెలుసని, డబ్బు ఎలాగైనా సమకూరుస్తానని అనేది వెంకట నర్సమ్మ. పదేండ్ల కిందట కొడుకుతో సినిమా తీయాలనే కోరిక గురించి గట్టిగా చెప్పింది. అంతేనా రూ.500 చేతిలో పెట్టి హైదరాబాద్ పంపింది. రవి ఇక్కడ చిన్నపాటి ఉద్యోగాలు చేసుకుంటూ, ఖాళీ సమయాల్లో స్టూడియోలకు వెళ్లి అనేక మంది దర్శకులు, నిర్మాతలను కలిశాడు. ఎప్పటికప్పుడు తల్లికి ఆ విషయాలన్నీ వివరిస్తూ ఉండేవాడు. సినిమా పరిశ్రమలో వివిధ రంగాల్లో పనిచేసి, కొంత ప్రావీణ్యం సంపాదించాడు. చివరకు తన తల్లి కోరినట్టుగానే సినిమా తీస్తే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చాడు.
20 ఏండ్లుగా హుండీ
వెంకట నర్సమ్మ కుటుంబం వ్యవసాయ పనులు చేసుకుంటూనే 70 జీవాలు (గొర్రెలు, మేకలు), 30 వరకూ గేదెలు పెంచుతూ, వాటి ద్వారా ఆదాయం పొందేది. వారికి మూడెకరాల పొలం కూడా ఉండేది. వచ్చే సంపాదనలో కొంత భాగాన్ని వెంకట నర్సమ్మ హుండీలో జమ చేస్తుండేవారు. ఒకసారి ఆ సొమ్ము బయటికి తీసి లెక్కిస్తే మొత్తం రూ.3 లక్షలు అయింది. ఆ మొత్తాన్ని కొడుక్కు పంపించి, సినిమాకు తొలి పెట్టుబడి సిద్ధం అన్నారు వెంకట నర్సమ్మ.
కొడుకుని ప్రోత్సహించారు
సినిమా తీసేందుకు ఎలాగైనా మిగిలిన డబ్బు కూడా సమకూర్చాలనే తపనతో చెరకురసం బండి కూడా నడిపారు ఆమె. ఆ తర్వాత టిఫిన్ బండి పెట్టారు. కొండగట్టు వద్ద రాగి సంగటి హోటల్ ఏర్పాటు చేశారు. ఇలా వచ్చిన సంపాదనలో కొంత భాగాన్ని పోగేశారు. హోటల్, పొలం, జీవాల ద్వారా వచ్చిన ఆదాయం మొత్తంతో రూ.50 లక్షలు కూడా బెట్టారు. ఈ డబ్బుతో సినిమా తీయాల్సిందిగా కొడుకుని ప్రోత్సహించారు. రవి ఈలోగా ఓ సినిమా స్ట్రిప్టు తయారు చేశాడు. నటీనటులను ఎంచుకున్నాడు. రెండేండ్ల కిందటే షూటింగ్ ప్రారంభించాడు. అయితే అప్పటి వరకు ఆమె సమకూర్చిన డబ్బులు సరిపోలేదు. దీంతో ఉన్న మూడెకరాల పొలాన్ని అమ్మేశారు. ఆ మొత్తం కూడా చాలకపోవటంతో ఆమె తన పుస్తెలమ్మి సినిమాను తీశారు. మొత్తానికి ఆ సినిమాకు నిర్మాతగా ఆమె పేరు పోస్టరు మీదికి ఎక్కింది.
సినిమా ‘స్పిరిట్’
తెలంగాణాలో దేవదాసీ వ్యవస్థలాగానే కోస్తాంధ్రలో ఒకప్పుడు మాతంగులు ఉండేవారు. ఇప్పుడూ ఉత్సవాలు, జాతర్లు, ఎల్లమ్మ తిరునాళ్ల వంటి సమయాల్లో వారిని డ్యాన్స్ చేయటానికి తీసుకొస్తుంటారు. పెత్తందారులు వారిని తమ కోర్కెలు తీర్చే సాధనంగా చూసేవారు. వారు చెప్పినట్లుగా వినకపోతే కొట్టడం, హింసించటం చేస్తుంటారు. పరిసర ప్రాంతాల్లో జరిగే ఉత్సవాల్లో ఇలాంటి సంఘటనలను వెంకటనర్సమ్మ దంపతులు స్వయంగా చూశారు. వారితో అనేకసార్లు మాట్లాడారు. అప్పుడు వెంకట నర్సమ్మ మనసులో నాటుకున్న భావమే ‘స్పిరిట్’ సినిమాగా రూపుదిద్దుకుంది.
చిన్నప్పటి నుంచే …
వెంకట నర్సమ్మ తన బాల్యంలో అనేక సినిమాలు చూసేవారు. తన చట్టుపక్కల వారితో చూసిన సినిమా గురించి చెబుతూ ఉండేవారు. చిన్నప్పుడు ‘బ్రహ్మంగారి చరిత్ర’, ‘పొట్టేలు పున్నమ్మ’ సినిమాలు తనను బాగా కదిలించాయని ఆమె చెబుతారు. పెండ్లి తర్వాత భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ‘పుట్టింటికి రా చెల్లి’ సినిమా చూశారు. అది కూడా తనకు బాగా జ్ఞాపకం అని చెబుతారామె. మహిళా పాత్రలు బలంగా, ప్రభావశీలంగా ఉంటే ఆమెకు ఇష్టం. చదువు లేకపోయినా, సినిమా పరిజ్ఞానం ఎప్పటికప్పుడు పెంచుకున్నారు. ఎప్పటికన్నా సినిమా తీయాలి అనుకొని ఎంతో కష్టపడి డబ్బు సమకూర్చి కొడుకు ద్వారా సినిమా కోరికను నెరవేర్చుకున్నారు.
తారాగణం
8త్ వండర్ సినిమా బ్యానర్‌పై నిర్మితమైన ఈ ‘స్పిరిట్ (ఈజ్ నాట్ వన్)’ సినిమా త్వరలో విడుదల కానుంది. రవిబాబు, సత్యప్రకాష్, చిత్రం శ్రీను, రమ్య, ప్రియ, పింకీ, జూనియర్ రాజశేఖర్, ప్రేమకథా చిత్రం సైదులు, జబర్దస్త్ నాగ్‌తేజ్, చిట్టిబాబు తదితరులు ఇందులో నటించారు. నిర్మాత చెన్నెబోయిన వెంకట నర్సమ్మ కాగా, దర్శకత్వం ఆమె కుమారుడు వెంకట రవీంద్రనాథ్.
– దురాచారం పోవాలని…
మాతంగుల జీవితాలు చాలా దుర్భరం. వారి చేత అశ్లీల ప్రదర్శనలు ఇవ్వటమే కాదు, వారిని లైంగికంగా వేధించటం, దౌర్జన్యాలు చేయడం మంచిదికాదు. మాతంగులపై జరిగే దురాచారాలు పోవాలి. వారు కూడా మంచిగా జీవించాలనే ఇతివృత్తంతో ఈ సినిమా తీశాం. వారి పిల్లలు ఇలాంటి వృత్తిలోకి రాకుండా ఉండాలనేది మా సంకల్పం. మా సినిమాను అందరూ ఆదరించాలని కోరుకుంటున్నా.
– చెన్నుబోయిన వెంకటనర్సమ్మ, నిర్మాత
– యడవల్లి శ్రీనివాసరావు