– మల్లు స్వరాజ్యం వర్థంతి సభలో వక్తలు
– మెడికల్ క్యాంపు ప్రారంభించిన శాంతా సిన్హా
– ఓ పోరాట యోధ.. ప్రజా పక్షపాతి.. గొప్ప మానవతావాది
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
‘మల్లు స్వరాజ్యం ఉద్యమ కారిణే కాదు..గొప్ప మానవతా వాది. మహిళా హక్కుల కోసం జీవితాంతం పోరాడారు. ఆమె చాలా ధైర్యవంతురాలు’ అని జాతీయ బాలల హక్కుల కమీషన్ మాజీ చైర్‌పర్సన్ డాక్టర్ శాంత సిన్హా అన్నారు. ఐద్వా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మల్లు స్వరాజ్యం రెండో వర్థంతి సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లోని వీరనారి ఐలమ్మ భవన్‌లో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును శాంతసిన్హా ప్రారంభించారు. అనంతరం స్వరాజ్యం చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఐద్వా అధ్యక్షురాలు ఆర్ ఆరుణజ్యోతి అధ్యక్షతన జరిగిన సభలో శాంతసిన్హా మాట్లాడుతూ మల్లు స్వరాజ్యం నిరంతరం ప్రజల, ముఖ్యంగా మహిళల బాధలగురించి ఆలోచించారని తెలిపారు. పూర్తి జీవితం ప్రజల పక్షాన నిలబడి పోరాడిన ధీరవనిత ఆమె అని చెప్పారు. అలాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారన్నారు. ఇప్పటికీ ఆమె గురించి జనం కథలు కథలుగా చెప్పుకోవటం విశేషమన్నారు. సమాజ హితం కోసం ఆమె జీవితాన్ని త్యాగం చేశారని చెప్పారు. చదువుతోనే జ్ఞానం వస్తుందనీ, దానితో స్వయ రక్షణకు పాటు పడ్తారని నమ్మటమంటే ఆడపిల్లల భద్రత గురించి ఎంతగా పరితపించారో అర్థమవుతుందన్నారు.
ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి మాట్లాడుతూ భూస్వామ్య వ్యవస్థను అంతమొందించాలనీ, వెట్టి చాకిరి, దోపిడీ, పీడనలకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో మల్లు స్వరాజ్యం ముఖ్య భూమిక పోషించిందని గుర్తు చేశారు. పురుషులతో పాటు స్త్రీలకు సమాన హక్కులు కావాలని పోరాటం చేసిందని చెప్పారు. సమసమాజ నిర్మాణం కోసం ఆమె పోరాడిన తీరు, తెగువ నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. అసహన రాజకీయాలు, అప్రజాస్వామిక నిర్ణయాలు, హక్కులపై దాడులు జరుగుతున్న నేటి తరుణంలో పోరాట యోథులను యాది చేసుకోవటం అవసరమన్నారు. మహిళలపై దాడులు, దౌర్జన్యాలు, లైంగిక వేధింపులు విచ్చలవిడిగా జరుగుతున్న పరిస్థితుల్లో మహిళలకు, బాలికలకు ఆత్మరక్షణ శిబిరాలు నిర్వహించడానికి ఆమె ఎప్పుడూ కృషి చేసేవారని గుర్తు చేశారు. స్వయం రక్షణకోసం కరాటే లాంటి శిక్షణలు ఇవ్వటం అవసరమని నిరంతర పరితపించారని తెలిపారు. కుల, మత, పురుషాధిపత్యానికి వ్యతిరేకంగా చివరికంటూ పోరాడారని చెప్పారు. కుటుంబాలను సర్వనాశనం చేస్తున్న ‘సారా’ కు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలోనూ ఆమె పాత్ర మరువలేనిదన్నారు. తుపాకీ తూటాలాంటి తన మాటలతో ప్రజలను ఉద్యమాల వైపు నడిపించారన్నారు. ముక్కుసూటిగా మర్మం లేని మాటలతో తప్పులపై విమర్శనాస్త్రాలను సంధించేవారని గుర్తు చేశారు. ఐద్వా ఉపాద్యక్షులు ఇందిరా, కెఎన్ ఆశాలత, ట్రస్ట్ చైర్‌పర్సన్ బుగ్గవీటి సరళ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం వచ్చిన ప్రజలకు ఆమె మాటలే కొండంత ధైర్యాన్ని ఇచ్చేవన్నారు. ఎక్కడ ప్రజా ఉద్యమాలు ఉంటే అక్కడ ఉండేదని గుర్తు చేశారు. పేద ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. మహిళా సాధికారత కావాలనీ, రైతు రాజ్యం రావాలని ఆసుపత్రిలో చివరి క్షణాల్లో ఉన్నప్పుడు సైతం పిడికిలి బిగించి నినదించారని గుర్తు చేశారు. అనంతరం వీరనారి ఐలమ్మ ట్రస్టు నిర్వహిస్తున్న కరాటే శిక్షణ పాఠశాలలో ప్రతిభను ప్రదర్శించిన పది మంది విద్యార్థులకు గ్రీన్ బెల్టు, ఎల్లో బెల్టులను శాంత సిన్హా , ట్రస్ట్ చైర్‌పర్సన్ బుగ్గ వీటి సరళ అందజేశారు.
కరాటే మాస్టారు సుబ్రహ్మణ్యంతో పాటు విద్యార్థులను వారు సన్మానించారు. కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి పి శశికళ, రాష్ట్ర నాయకులు ఎ పద్మ, ఎండి షబానా బేగం, విజయమ్మ, మస్తాన్ బి, ఎం స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. వాసవి కంటి ఆస్పత్రి, కోరంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్లు, నర్సులు ల్యాబ్ టెక్నీషియన్లు డాక్టర్ దీప్తి టీం ఆ ప్రాంత ప్రజలకు వైద్య సేవలందించారు.