ఆమెకు బీమా.. ధీమా.!

Insurance for her.. Dhima.!– మహిళ సంఘాల సభ్యులకు రెండు రకాల బీమా సౌకర్యం
– రుణాలు మాఫీ…రూ.10 లక్షల బీమా వర్తింపు
– మండలంలో 7,540 మందికి లబ్ది
నవతెలంగాణ – మల్హర్ రావు
మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు గాను ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నాయి.ఇప్పటి వరకు వ్యాపార నిర్వహణ, ఉపాధికల్పన, వాహనాల కొనుగోలు, ఆహారపదార్థాల ఉత్పత్తి, వ్యవసాయం వంటి వాటి రూపంలో మహిళలకు ఆర్థికంగా ప్రభుత్వం తోడ్పాటును అందించింది.నూతనంగా ప్రవేశపెడుతున్న బీమా పథకంలో సాధారణ మరణాలు. ప్రమాద మరణాలను ఆధారంగా చేసుకొని రుణ బీమా, ప్రమాద బీమా పథకాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మహిళా సంఘంలో ఉన్న మహిళలు ఇకపై ఎలా మరణిం చినా ప్రభుత్వం నుంచి బీమా సొమ్ము అందిస్తారు. ఈ బీమాకు సంబంధించి అన్ని రకాల గెడ్లైన్స్ అధికారులకు అందినట్లుగా తెలుస్తోంది.
మండల వ్యాప్తంగా 27 గ్రామ సమాఖ్యలకు గాను, మొత్తం 684 మహిళా స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. వీటిలో ఒక్కో మహిళా సంఘానికి 10 నుంచి 15 మంది చొప్పున సభ్యులు ఉండగా మొత్తం 7,540 మంది ఉన్నారు. ఈ మేరకు ప్రభుత్వం తీసుకొచ్చిన రెండు రకాల బీమా పథకాలకు వీరంతా అర్హులుకానున్నారు. మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉన్న ప్రతీ మహిళకు రుణంతో సంబంధం లేకుండా బిమాను వర్తింపజేస్తూ నూతనంగా ఈ పథకాలను అమలు చేస్తోంది.
ప్రమాదబీమా రూ.10 లక్షలు
మహిళా సంఘంలో సభ్యురాలుగా నమోదైన ప్రతీ మహిళకు ప్రమాదబీమా సౌకర్యం వర్తించనుంది. ప్రమాదవశాత్తు ఎవరైనా సభ్యురాలు చనిపోతే ప్రమాదబీమా పథకం కింద రూ.10 లక్షలు మృతురాలి కుటుంబ సభ్యు లకు అందిస్తారు. ఆ సభ్యురాలి వయస్సు తెలిపే ఆధార్, ఓటర్ ఐడీ, ఏదో ఒక గుర్తింపు కార్డుతో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. కానీ ప్రమాదవశాత్తు చనిపోతే పోలీస్ ఎఫ్ఐఆర్ కాపీ, మెడికల్ ధ్రువీకరణ పత్రాలు, గ్రామ సంఘం ట్యాబ్ ద్వారా గాని, సెర్చ్,మెస్మా సిబ్బంది ద్వారా ఆన్లైన్లో ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి.ఒకవేళ ఏదైనా అంగవైకల్యం జరిగితే రూ.5లక్షల పరిహారం అందిస్తారు.బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆమ్ ఆద్మీ బీమా, అభయహస్తం పథకాలను రద్దు చేయడంతో ఈ పథకాలకు మహిళలు దూరమైయ్యారు.మళ్ళీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఋణభిమాను అమలు చేయడం ప్రయోజనకరమని మహిళలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
60 ఏళ్లలోపు మహిళలందరికీ..
మహిళ సంఘ సభ్యులకు ప్రభుత్వం రుణ బీమా, ప్రమాద బీమా పథకాలను అమల్లోకి తీసుకొచ్చింది. ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాలను 60 ఏళ్ల లోపు వయస్సు ఉన్న మహిళ సంఘం సభ్యులందరూ అర్హులు. వయస్సుకు సంబంధించిన కటాఫ్ తేదీని మార్చి 14, 2024గా ప్రకటించింది.
రూ.2 లక్షల వరకు రుణమాఫీ
రుణ బీమా పథకంలో భాగంగా మహిళా సంఘం సభ్యురాలు రుణం తీసుకున్న తర్వాత ఏ కారణంతోనైనా చనిపోతే తీసుకున్న రూ.2 లక్షల రుణం మాఫీ కానుంది. ఒక వేళ చనిపోయిన మహిళ బ్యాంకు లింకేజీ రుణంతోపాటుగా స్త్రీనిధి రుణం కూడా తీసుకుంటే వాటిలో ఒక్క లోన్ మాత్రమే మాఫీ కానుంది. గతంలో మహిళ సభ్యురాలు మరణిస్తే మృతురాలు తీసుకున్న రుణం కుటుంబ సభ్యులు చెల్లించేందుకు ముందుకు రాకపోయేది. దీంతో గ్రూపు మొత్తం సభ్యులపై ఈ భారం పడిం ది.మరణించిన మహిళ వాటా తీసేసి బ్యాంకులో రుణం చెల్లిస్తే బ్యాంకర్లు తీసుకోకపోవడంతో పాటుగా వారి గ్రూపును ఎన్పీఏ జాబితాలో వేసే వారు. కానీ ప్రస్తుతం ఈ పథకాల ద్వారా అలాంటి ఇబ్బందులను నివారించేందుకు వీలుంది.
మహిళలకు ఎంతో మేలు: మండల ఐకెపి ఏపీఎం కమల
ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన రెండు రకాల బీమా పథకాలతో మహిళలకు ఎంతో మేలు జరగనుంది. ప్రస్తుత రోజుల్లో బీమా అందరికీ అవసరమని, మహిళల కోసం ప్రభుత్వ ప్రవేశ పెట్టిన ఈ బీమా పథకాలకు సంబంధించిన పూర్తి ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తుంది. మహిళలు సాధారణ, ప్రమాద మరణాలు, అంగవైకల్యం జరిగినా సంబంధిత అధికారుల ధ్రువీకరణల మేరకు వారికి లబ్ది చేకూరనుంది.