– నాలుగు రాష్ట్రాల్లో గెలిచినవి తక్కువ స్థానాలే
– ఛత్తీస్‌గఢ్‌లో 21 శాతం..తెలంగాణలో 8 శాతమే
– ఎంపీలో 11 శాతం..రాజస్థాన్‌లో పది శాతం
న్యూఢిల్లీ : తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడ్డాయి. తెలంగాణ కాంగ్రెస్, మిగతా మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించాయి. అయితే, ఈ రాష్ట్రాల అసెంబ్లీలో మహిళలకు తగిన ప్రాధాన్యత దక్కలేదు. ఆయా రాష్ట్రాల్లో విజయం సాధించిన మహిళా ఎమ్మెల్యేల సంఖ్య తక్కువగా ఉండటమే ఇప్పుడు ఆందోళనను కలిగిస్తున్నది.
ఎన్నికల సంఘం విడుదల చేసిన ఫలితాలను విశ్లేషిస్తే.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర అసెంబ్లీలో 20 శాతం కంటే ఎక్కువ మంది మహిళా ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. మొత్తం 90 మంది ఎమ్మెల్యేలలో 19 మంది మహిళా శాసనసభ్యులు ఉన్నారు. ఇది ఇప్పటివరకు అసెంబ్లీలో రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా అత్యధికంగా 21 శాతం కావటం గమనార్హం. అయితే మహిళా రిజర్వేషన్ బిల్లు కల్పించే 33 శాతం రిజర్వేషన్ల కంటే ఇది చాలా తక్కువ.
ఎన్నికలు జరిగిన ఇతర రాష్ట్రాల్లో మహిళల ప్రాతినిధ్యం మరింత దారుణంగా ఉన్నది. తెలంగాణ మొత్తం 119 మంది శాసన సభ్యుల్లో 10 మంది మహిళా ఎమ్మెల్యేలు ఈ సారి ఎన్నికయ్యారు. 2018లో ఈ సంఖ్య ఆరు మాత్రమే. అంటే ఈ సారి మరో నలుగురు మహిళలు వచ్చి చేరారు. దీని క్రారం.. రాష్ట్ర అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేల సంఖ్య 8 శాతమే.
మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలోని 230 సీట్లలో 27 స్థానాల్లో మహిళా అభ్యర్థులు విజయం సాధించారు. రాష్ట్ర అంసెబ్లీలో వీరి సంఖ్య 11.7 శాతం అన్నమాట. రాష్ట్రంలో అత్యధికంగా 2013లో 30 మంది మహిళలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. రాజస్థాన్‌లో గతంతో పోలిస్తే ఈసారి మహిళా ఎమ్మెల్యేల సంఖ్య పడిపోయింది. 2018లో 24 మంది మహిళలు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. ఈ సారి ఆ సంఖ్య 20కి (పది శాతానికి) తగ్గిపోవటం గమనార్హం.
చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే మహిళా రిజర్వేషన్ బిల్లును రెండు నెలల క్రితమే కేంద్రం ఆమోదించిన విషయం తెలిసిందే. 2029 వరకు మహిళా రిజర్వేషన్ అమలు చేయబోమని కేంద్రం స్పష్టం చేసింది. 2024 లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలో మహిళల ప్రాతినిథ్యం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇకనైనా పార్టీలు తమ బాధ్యతను గుర్తెరికి మహిళలకు తగిన సంఖ్యలో సీట్లను కేటాయించాలని దేశవ్యాప్తంగా మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.