– ప్రపంచవ్యాప్తంగా మూడో వంతు స్త్రీలకు ఇదే బాధ
– తమ జీవిత కాలంలో శారీరక, లైంగిక హింస : డబ్ల్యూహెచ్‌ఓ
న్యూఢిల్లీ : ప్రపంచంలో మహిళకు భద్రత కరువైంది. ప్రాంతమేదైనా వారికి వేధింపులు మాత్రం తప్పటం లేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురు మహిళల్లో దాదాపు ఒకరు తమ జీవితకాలంలో శారీరక, లైంగిక హింసను అనుభవిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తెలిపింది.
డబ్ల్యూహెచ్‌ఓ సమాచారం ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 33 శాతం మంది మహిళలు శారీరక లేదా లైంగిక హింసకు గురవుతున్నారు. ఆగేయాసియా ప్రాంతం (ఎస్‌ఈఏఆర్‌ఓ) ఈ విషయంలో రెండవ అత్యధికంగా ఉన్నది. డబ్ల్యూహెచ్‌ఓ ఎస్‌ఈఏఆర్‌ఓ ప్రాంతీయ డైరెక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్ మాట్లాడుతూ.. చాలా మంది మహిళలు తమతో నివసించే వ్యక్తులచే వేధింపులకు గురయ్యే ప్రమాదం ఉన్నది. ఇందులో ఎక్కువ భాగం సన్నిహిత భాగస్వామి హింస రూపంలో ఉంటాయని ఆమె చెప్పారు.
మహిళలపై హింస, ముఖ్యంగా సన్నిహిత భాగస్వామి హింస, తక్షణ, దీర్ఘకాలికంగా తీవ్రమైన ఆరోగ్య ప్రభావాలను కలిగి ఉంటుంది. ఇవి గాయాలతో పాటు తీవ్రమైన శారీరక, మానసిక, లైంగిక, పునరుత్పత్తి ఆరోగ్య సమస్యలను కలిగి ఉంటాయని హెచ్చరించారు.
2021లోనూ డబ్ల్యూహెచ్‌ఓ అదే సంఖ్యలను హైలైట్ చేస్తూ ఇదే విధమైన నివేదికను విడుదల చేసింది. గత దశాబ్ద కాలంగా ఈ సంఖ్యలో పెద్దగా మార్పు లేదని పేర్కొనటం గమనార్హం. ప్రభుత్వాలు, సంఘాలు, వ్యక్తుల ప్రయత్నాలతోనే ఈ హింసపై పోరాడగలమని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ ఘెబ్రేయేసస్ తెలిపారు.
2016లో ప్రచురించబడిన యూఎన్ ఉమెన్ నివేదిక ప్రకారం.. హింసను అనుభవించని స్త్రీల కంటే హింసను అనుభవించే మహిళలు 60 శాతం తక్కువ సంపాదిస్తారు. మహిళలపై హింసకు అయ్యే ఖర్చు ప్రపంచ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో దాదాపు రెండు శాతం వరకు ఉంటుంది. ఇది కెనడా ఆర్థిక వ్యవస్థ పరిమాణం సుమారుగా 1.5 ట్రిలియన్లకు సమానం.
కాగా, భారత్‌లో 27 శాతం మంది మహిళలు మాత్రమే వర్క్ ఫోర్స్‌లో ఉన్నారు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ది ఇండియన్ ఎకానమీ(సీఎంఐఈ) 2022లో కేవలం 10 శాతం మంది వర్కింగ్-వయస్సు గల భారతీయ మహిళలు ఉద్యోగాల కోసం వెతుకుతున్నారని తెలిపింది. అంటే దీని ప్రకారం.. 3.9 కోట్ల మంది మహిళలు మాత్రమే వర్క్‌ఫోర్స్‌లో పనిచేస్తున్నారు. పురుషులలో ఇది 36.1 కోట్ల మందిగా ఉండటం గమనార్హం.