జాకీ లైసెన్స్‌ పొందిన మొదటి మహిళ

She was the first woman to be licensed as a jockeyఅపర్ణా దాస్‌… వేగమంటే అభిమానం, క్రీడలో విజయం సాధించాలనే సంకల్పంతో గుర్రపు పందెం వైపు ఆకర్షితురాలైంది.జాకీ జీవితమంటే మాటలు కాదని ఆమెకు తెలుసు. చాలా మంది దీన్ని ఆనందించే క్రీడ అనుకుంటారు. కానీ ఇది చాలా సందర్భాల్లో ప్రాణాలు తీసే ప్రమాదకర ఆట. పురుషాధిక్య సమాజంలో ఓ మహిళ అలాంటి క్రీడను ఎంపిక చేసుకుని పోటీ చేయడమంటే అత్యంత సవాలుతో కూడిన విషయం. కానీ ఆమె మాత్రం రేస్ట్రాక్‌లో విజయం సాధించగలిగింది. యుఎస్‌లో జాకీ లైసెన్స్‌ పొందిన మొదటి భారతీయ మహిళగా కీర్తి ఘడించిన ఆమె పరిచయం నేటి మానవిలో…

ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌లో పుట్టి, బెంగుళూరులో పెరిగింది. బెంగళూరులోని మౌంట్‌ కార్మెల్‌ కాలేజీలో బయోటెక్నాలజీలో బ్యాచిలర్‌ డిగ్రీని అభ్యసించింది. అపర్ణకు స్కూల్‌ నుంచి క్రీడలంటే చాలా ఇష్టం. ఆమె హాకీ క్రీడాకారిణి, జాతీయ స్థాయి స్కేటింగ్‌ ఛాంపియన్‌, రాష్ట్ర క్రీడాకారిణి. గ్రాడ్యుయేషన్‌ తర్వాత ఆమె తండ్రి ఒక వార్తాపత్రిక ప్రకటనను చూసి బెంగుళూరు టర్ఫ్‌ క్లబ్‌ (BTC)లో శిక్షణ తీసుకోమన్నాడు. అక్కడే ఆమె తన రైడింగ్‌ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంది. ప్రతిరోజూ కాలేజీకి వెళ్లే ముందు శిక్షణ తీసుకునేది. ఆ సమయంలోనే గుర్రాల పట్ల ఆమెకున్న ప్రేమ పెరిగింది. రేస్‌ కోర్స్‌లో భాగంగా మొదటి సారి గుర్రం ఎక్కింది. కానీ రెండు నిమిషాల్లోనే పడిపోయింది. అయితే నేర్చుకోవాలనే ఆమె ఆశను మాత్రం కోల్పోలేదు. తాను జాకీ కావాలని అప్పుడే నిర్ణయించుకుంది.
ధైర్యం, పట్టుదలతోనే…
”అపర్ణ వేగంగా నేర్చుకుంది, కఠినమైన గుర్రాలను కూడా చాలా సులభంగా ఎదుర్కోగలిగింది. తన వయసులో ఉన్న చాలా మంది అబ్బాయిల కంటే వేగంగా ర్యాంక్‌లను సాధించింది. ఆమె వచ్చిన మొదటి రోజు నాకు బాగా గుర్తుంది. గుర్రాలపై ఆమెకున్న ప్రేమను గుర్తించాను. ఎంతో మంది అమ్మాయిలకు శిక్షణ ఇచ్చాను కానీ అపర్ణ స్థాయికి ఎవరూ చేరుకోలేకపోయారు. ధైర్యం, ఏదైనా చేయాలనే పట్టుదల ఆమెను ఈ క్రీడలో విజయం సాధించేలా చేశాయి” అని BTC సభ్యుడు గౌతమ్‌ సురేందర్‌ చెప్పారు.
ఎదుగుదల అసాధ్యమనుకున్నా
‘నా గుర్రపు స్వారీ గురించి కుటుంబ సభ్యులకు చాలా సందేహాలున్నాయి. కానీ నా నిర్ణయాన్ని వారు హృదయపూర్వకంగా సమర్థించారు. ఈ ప్రయాణంలో నా అక్కచెల్లెళ్లు, స్నేహితులు కూడా కీలక పాత్ర పోషించారు. నాకు క్రీడలో రేసింగ్‌ నేపథ్యం లేదా గాడ్‌ఫాదర్‌లు ఎవ్వరూ లేరు. అలాగే ఒక మహిళగా అవకాశాలు చాలా పరిమితంగా ఉన్నాయి. మొదట్లో నా ఎదుగుదల దాదాపు అసాధ్యం అనిపించింది’ అని 28 ఏండ్ల అపర్ణ అంటున్నారు. ‘అవకాశం అపారమైనది. ముఖ్యంగా ఆమె మగ జాకీలతో సమానంగా పరిగెడుతుంది. అందుకే నేను అపర్ణను ఇతర దేశాల్లో తన జాకీయింగ్‌ వృత్తిని కొనసాగించమని సలహా ఇచ్చాను. మన దేశంలో మహిళా జాకీలకు ప్రోత్సాహం లేదు. గుర్రపు పందాల ప్రపంచంలో తనదైనా ముద్ర వేయడానికి సామర్థ్యాలు ఉన్నాయని ఆమె నిరూపించుకోవాలి” అని దీుజలో అప్పటి జాకీ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ఉన్న సింక్లైర్‌ మార్షల్‌ చెప్పారు.
చాలామంది వ్యతిరేకించారు
అపర్ణ ఎంతో ఆలోచించి కెంటకీలోని లెక్సింగ్టన్‌లోని నార్త్‌ అమెరికన్‌ రేసింగ్‌ అకాడమీ (NARA)కి దరఖాస్తు చేసుకుంది. ‘అకాడమీలో నాకు అవకాశం దొరకడమంటే చాలా గొప్ప విషయం. NARAలో హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ జాకీ క్రిస్‌ మెక్‌కరాన్‌ ద్వారా శిక్షణ పొందాను. గుర్రాలతో నా కెరీర్‌ను రూపొందించుకోగలిగాను. ఆ ఏడాది అంగీకరించిన ఏకైక అంతర్జాతీయ విద్యార్థిని నేనే. అయితే కెంటకీకి రావడం గురించి బాగా ఆలోచిం చాను. ఎందుకంటే నా నిర్ణయాన్ని నా బంధువులందరూ వ్యతిరేకించారు. నన్ను అక్కడికి పంపవద్దని, పెండ్లి చేయాల్సిందిగా అందరూ మా నాన్నకు సలహా ఇచ్చారు. కానీ నాన్న మాత్రం నాకు మద్దతు ఇచ్చారు. ఆయన ప్రోత్సాహంతో శిక్షణలో చేరాను’ అన్నారు ఆమె.
శిక్షకుల లైసెన్స్‌ కోసం…
యుఎస్‌లో శిక్షకుల లైసెన్స్‌ పొందాలంటే ముందు రాత, బార్న్‌ పరీక్ష రాయాలి. జాకీ నుండి శిక్షకులుగా మారడం అంత సులభమైన విషయం కాదు. ‘నా చుట్టూ ఉన్న వ్యక్తులు నా కంటే ఎక్కువగా నన్ను విశ్వసిస్తున్నారని తెలుసుకు న్నప్పుడు నేను నా శిక్షకుని లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసాను. వారి గుర్రాలు ఏడు రేసుల్లో ఐదింటిని గెలుచుకున్నప్పుడు సిగ్మా ప్రాపర్టీ ఇన్వెస్ట్‌మెంట్స్‌, మోనికా విలి యమ్స్‌ వంటి నా యజమా నులతో పాలుపంచు కోవడం నాకు దొరికిన మంచి అవకాశం. కెరీర్‌లో నాకు వాళ్లు చాలా సపోర్ట్‌ చేశారు. తర్వాత నేను నా గుర్రాలను పరిగెత్తించాను. అన్ని రేసుల్లో నా గుర్రాలు అద్భుతంగా ప్రదర్శించాయి. ప్రత్యేకించి హార్స్‌ మో మోన్స్‌ కాపీక్యాట్‌లో 5,000 డాలర్లను క్లెయిమ్‌ చేసాము. న్యూజెర్సీ-బ్రెడ్‌ అలవెన్స్‌ రేస్‌, మోన్‌మౌత్‌ పార్క్‌లో 50,000 డాలర్లల భత్యం గెలుచుకున్నాము’ అంటూ ఆమె ఎంతో ఆనందంగా చెప్పారు.
వెన్ను విరిగింది
NARAలో శిక్షణ పూర్తి చేసిన తర్వాత 2011లో గల్ఫ్‌ స్ట్రీమ్‌ పార్క్‌, మయామి, ఫ్లోరిడాలో తన మొదటి రేసును గెలిచి జాకీయింగ్‌ కెరీర్‌ను ప్రారంభించారు. అప్పటి నుండి ఆమె జీవితం ఒక గ్లోపింగ్‌ రైడ్‌. అనేక విజయాలతో పాటు గాయాలు కూడా వచ్చాయి. ఎలాంటి పరిస్థితినైనా అధిగమించగలిగే శక్తి, ధైర్యం ఆమెది. కానీ ఒక గాయం ఆమె పోటీ జీవితాన్ని దాదాపుగా ముగిం చింది. అందరూ రేసు ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు. వారిలో అపర్ణ కూడా ఉన్నారు. ఆమె స్వారీ చేస్తున్నప్పుడు కిందపడిన ఆమెపై గుర్రం పడి తీవ్రంగా గాయ పడ్డారు. మెలకువ వచ్చేసరికి ఆసుపత్రిలో ఉన్నారు. ఆ ప్రమాదంలో ఆమె వెన్ను విరిగింది. ప్రాణాలతో బయట పడటమే అత్యంత కష్టంగా మారింది. అయితే 11 నెలల తర్వాత పట్టుదలతో అపర్ణ తిరిగి రైడింగ్‌కు వచ్చారు.