ఉపాధ్యాయుడు గుర్రం శేఖర్ సేవలు ప్రశంసానీయమని చిట్యాల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు విజయ్ కుమార్, ప్రధానోపాధ్యాయుడు చిక్కాల సతీష్ అన్నారు. మండలంలోని రామచంద్రు తండా ప్రాథమిక పాఠశాలలో తొమ్మిదేళ్లుగా విధులు నిర్వహించి, ఇటీవల బదిలీపై వెళ్లిన శేఖర్ ను ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ.. ప్రతి ఉద్యోగికి బదిలీలు సహజం అన్నారు. వృత్తి నిర్వహణలో అంకిత భావంతో పనిచేసినప్పుడు సమాజంలో తగిన గుర్తింపు ఉంటుందన్నారు. శేఖర్ సమయపాలన పాటిస్తూ, విధులను సమర్ధవంతంగా చేసే వారని కొనియాడారు. గతంలో పేద విద్యార్థులకు తన సొంత ఖర్చులతో పాఠ్య సామాగ్రిని అందించారని గుర్తు చేశారు. ఉత్తమ భోధనతోనే ఉపాధ్యాయులకు ప్రత్యేక గుర్తింపు వస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ కళ్యాణి, ఉపాధ్యాయులు సోమారపు ఐలయ్య, యాకుబ్ పాషా, మురళి, ప్రభాకర్, బాలరాజు, ఎర్ర వెంకన్న, జనార్ధన్, అజయ్, మాజీ సర్పంచ్ చిలుకమ్మ, అంగన్వాడీ టీచర్ మమత, గ్రామస్థులు, విద్యార్థులు తల్లితండ్రులు పాల్గొన్నారు.