వేధింపులకు షీటీమ్స్‌ అడ్డుకట్ట

SheTeams stop harassment– 15 రోజుల్లో 117 మంది ఆకతాయిల పట్టివేత
– అవగాహన కార్యక్రమాలు, కౌన్సెలింగ్‌
– డెకారు ఆపరేషన్స్‌
నవతెలంగాణ-సిటీబ్యూరో
బస్టాండ్‌లు, రైల్వే, మెట్రో స్టేషన్లు, స్కూళ్లు, కాలేజీలు, కూరగాయల మార్కెట్లు, రోడ్లు, కాలేజీలు, రద్దీ ప్రాంతాలు, చివరకు దేవాలయాలు, ఉత్సవాల్లోనూ పోకిరీల ఆగడాలు మితిమీరుతున్నాయి. అయితే, షీ బృందాలు ఎప్పటికప్పుడూ ఆకతాయిల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తున్నాయి. బాధిత యువతులు, మహిళలకు ‘మీ కోసం మేమున్నామని భరోసా’ ఇస్తున్నాయి. 15 రోజుల్లో 117 మందిని రాచకొండ షీ టీమ్స్‌ అదుపులోకి తీసుకున్నాయి.
గత నెల నవంబర్‌ 16 నుంచి 30 వరకు 135 ఫిర్యాదులు షీ బృందాలకు అందాయి. ఫోన్ల ద్వారా వేధించినవి 24కాగా, వాట్సాప్‌ ద్వారా వేధించినవి 30, సోషల్‌మీడియా ద్వారా వేధించినవి 18, నేరుగా 63 మంది ఆకతాయిలు వేధింపులకు పాల్పడ్డారు. విచారణ చేపట్టిన షీ బృందాలు నాలుగు క్రిమినల్‌ కేసులు, 47 పెట్టి కేసులు నమోదు చేశాయి. మరో 68 మందికి కౌన్సెలింగ్‌ ఇచ్చాయి.
ఏడేండ్లుగా వేధిస్తున్న మీడియా వ్యక్తి అరెస్ట్‌
ఎల్‌బీ నగర్‌లో నివాసముంటున్న ఓ గృహిణి ప్రయివేటు కంపెనీలో పనిచేస్తోంది. ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎలక్ట్రానిక్‌ మీడియాలో పనిచేస్తున్న ఓ వ్యక్తి ఏడేండ్లుగా ఆమెను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. దాంతో అతని తల్లిదండ్రులకు విషయం చెప్పింది. అయితే, కొద్దిరోజులు బాగానే ఉన్న నిందితుడు, తిరిగి వేధించడం ప్రారంభించాడు. విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆమెను బెదిరించాడు. దీంతో బాధితురాలు ఎల్‌బీనగర్‌ షీ టీమ్స్‌ను సంప్రదించింది. వెంటనే స్పందించిన షీ బృందాలు నిందితున్ని అదుపులోకి తీసుకొని ఎల్‌బీనగర్‌ పోలీసు స్టేషన్‌లో అప్పగించి క్రిమినల్‌ కేసు నమోదు చేశారు.
ప్రేమించాలంటూ బాలికకు వేధింపులు
వనస్థలిపురంలో ఉండే 14 ఏండ్ల బాలిక 9వ తరగతి చదువుతోంది. ప్రతిరోజూ స్కూల్‌కు వెళ్లి వస్తుంటే, మార్గమధ్యలో ఓ బాలుడు 9 నెలల నుంచి ప్రేమించాలని వేధిస్తున్నాడు. దాంతో బాలిక తల్లిదండ్రులతో కలిసి షీ టీమ్‌లో ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన షీ బృందాలు అతన్ని అరెస్టుచేసి కేసు నమోదు చేశాయి.
మల్కాజ్‌గిరిలో నివాసముండే 16 సంవత్సరాల బాలిక తమ అపార్ట్‌మెంట్‌లోకి పోతూ గేటు మూసేస్తుండగా, ఇంతలో గేటు ముందుకు బైక్‌పై ఓ గుర్తుతెలియని వ్యక్తి వచ్చాడు. అకస్మాత్తుగా తన ప్యాంట్‌ విప్పి ప్రయివేటు పార్ట్స్‌ ఆమెకు చూపించాడు. ఆమె వెంటనే ఇంట్లో చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు నిందితున్ని అరెస్టు చేశారు.
అవగాహన కార్యక్రమం
నవంబర్‌ 16 నుంచి 30 వరకు రాచకొండ షీ టీమ్స్‌ 47 అవగాహన కార్యక్రమాలు నిర్వహించాయి. మహిళా చట్టాలు, వారి హక్కులు, నేరాలపై దాదాపు 8275 మందికి అవగాహన కల్పించాయి.
డెకారు ఆపరేషన్‌
కుషాయిగూడ పరిధిల్లో షీ బృందాలు డెకారు ఆపరేషన్‌ నిర్వహించాయి. రోడ్డుపై వెళ్తున్న మహిళలను, బాలికలను ఇబ్బందులకు గురిచేస్తున్న 22 మంది పోకిరీలను అదుపులోకి తీసుకున్నాయి. ఎల్‌బీనగర్‌, వనస్థలిపురం, మల్కాజ్‌గిరి ప్రాంతాల్లో సైతం షీ బృందాలు డెకారు అపరేషన్స్‌ నిర్వహించి ఆకతాయిలను అరెస్టు చేశాయి.
‘రాపిడో’ ఆటో డ్రైవరు అరెస్టు
రామంతపూర్‌లో నివాసముండే బాధి తురాలు నార్సింగ్‌ నుంచి రాపిడో ఆటోను బుక్‌ చేసుకుంది. ఆటోలో ఇంటికి వస్తున్న క్రమంలో డ్రైవరు మార్గ మధ్యలో ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దాంతో బాధితురాలు షీ టీమ్స్‌ను సంప్రదిం చగా.. వెంటనే స్పందించి నింది తున్ని అదుపులోకి
తీసున్నారు.
ధైర్యంగా ఫిర్యాదు చేయాలి: డీసీపీ
బాలికలను, మహిళలను వేధించే పోకిరీలను వదిలిపెట్టే ప్రసక్తి లేదని డీసీపీ ఉషా విశ్వనాథ్‌ తెలిపారు. బాధితులు ముందుకొచ్చి ధైర్యంగా ఫిర్యాదు చేయాలని కోరారు. రాచకొండ ఉమెన్‌ సేఫ్టీ వింగ్‌, షీటీమ్స్‌ ఆధ్వర్యంలో మంగళవారం రాచకొండ క్యాంప్‌ కార్యాలయంలో ఈవ్‌ టీజర్లకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. మహిళలను, యువతులను వేధిస్తున్న 117 మందిని (మేజర్స్‌-47, మైనర్స్‌ -70) షీ టీమ్స్‌ అరెస్టు చేశాయని వివరించారు. షీబృందాలు మఫ్టీలో తిరుగుతూ డెకారు ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయని, పోకిరీల చేష్టలను సాక్ష్యాధారాలతో పట్టుకొని న్యాయస్థానంలో హాజరు పరుస్తున్నామని తెలిపారు. వారికి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్‌ ఇస్తున్నామన్నారు. బాధితులు షీ బృందాలకు ఫిర్యాదు చేయాలని సూచించారు. నేరుగా కానీ వాట్సాప్‌లో 8712662111లో ఫిర్యాదు చేయొచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ వెంకటేశం, ఇన్‌స్పెక్టర్‌ పి.పరశురాం, అడ్మిన్‌ ఎస్‌ఐ రాజు, షీటీమ్స్‌ సిబ్బంది, కౌన్సిలర్స్‌ శాంతిప్రియ, రమ్యా, శ్యామల గౌరి తదితరులు పాల్గొన్నారు.