ష్‌…గప్‌చుప్‌ ! అంతా రహస్యమే

Shh...Gupchup! Everything is secret– ఆ ‘ఇద్దరు’ చెప్పిందే వేదం
– ఆ మూడు నేర చట్టాల గురించి సంప్రదింపుల ఊసే లేదు
– పారదర్శకతకు చోటే లేదు
– అంత తొందర ఎందుకంటున్న ప్రతిపక్షాలు
న్యూఢిల్లీ : బ్రిటీష్‌ కాలం నాటి ఐపీసీ, సీఆర్‌పీసీ సెక్షన్లతో పాటు ఎవిడెన్స్‌ చట్టం స్థానంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన మూడు బిల్లులను సమీక్షించేందుకు హోం వ్యవహారాల స్టాండింగ్‌ కమిటీ గురువారం నుంచి సమావేశమైంది. అయితే ఈ కమిటీ 2020లో ఏర్పడినప్పటి నుంచీ అంతా రహస్యమే. ఏ విషయంపై చర్చించినా బయటికి పొక్కదు. సిఫారసులు చేయడంలోనూ, బిల్లుల రూపకల్పనలోనూ సభ్యులు కాని ఇద్దరు వ్యక్తులు… సొలిసిటర్‌ జనరల్‌ (ఎస్‌జీ) తుషార్‌ మెహతా, అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎస్‌జీ) సూర్యప్రకాష్‌ వి రాజు తెర వెనుక కీలక పాత్ర పోషిస్తుంటారని విశ్వసనీయ వర్గాలు ‘వైర్‌’కు తెలిపాయి. వీరిలో రాజు గుజరాత్‌ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేసి, 2020 జూలైలో సుప్రీంకోర్టు ఏఎస్‌జీగా నియమితులయ్యారు. సోహ్రబుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ కేసులో అమిత్‌ షా పక్షాన వాదించారు. సభ్యులు కాని వ్యక్తులను బిల్లుల రూపకల్పనకు ఎందుకు అనుమతిస్తున్నారన్న ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పరు. దీనికి జవాబు చెప్పాల్సింది హోం మంత్రిత్వ శాఖ మాత్రమేనని కమిటీ సభ్యుడొకరు వ్యాఖ్యానించారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయమేమంటే… బిల్లుల్ని ప్రవేశపెట్టిన సందర్భంగా హోం మంత్రి అమిత్‌ షా ప్రసంగిస్తూ వీటిని ఖరారు చేయడానికి ముందు విస్తృత సంప్రదింపులు జరిపామని చెప్పుకొచ్చారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, లా యూనివర్సిటీలు, న్యాయ సంస్థలు, ముఖ్యమంత్రులు, సీనియర్‌ అధికారులు, గవర్నర్లు, ఎంపీలు…ఇలా అందరి అభిప్రాయాలు తీసుకున్నామని తెలిపారు. దీనిపై మరింత వివరణ ఇస్తూ 18 రాష్ట్రాలు, ఆరు కేంద్ర పాలిత ప్రాంతాలు, సుప్రీంకోర్టు, 16 హైకోర్టులు, ఐదు న్యాయ సంస్థలు, 22 లా యూనివర్సిటీలు, 142 మంది ఎంపీలు, 270 మంది ఎమ్మెల్యేలతో పాటు ప్రజల నుండి కూడా అభిప్రాయాలు తెలుసుకున్నామని వివరించారు. అయితే ఆయా వ్యక్తులు, సంస్థల అభిప్రాయాలను మాత్రం ప్రజలకు బహిర్గతం చేయలేదు. పబ్లిక్‌ డొమైన్‌లో ఉంచలేదు.అంతేకాదు…క్రిమినల్‌ చట్టాలలో సంస్కరణలపై హోం మంత్రిత్వ శాఖ కమిటీ ఇచ్చిన తుది నివేదికలోని అంశాలను ఈ బిల్లుల్లో చేర్చారు. అయితే ఆ నివేదికను కూడా బయటపెట్టలేదు. ఈ కమిటీ కూడా రహస్యంగానే తమ విధులు నిర్వర్తిస్తోంది. దీంతో దాని పనితీరులోనూ, అది చేపట్టే ప్రక్రియలోనూ పారదర్శకత లోపిస్తోంది. ఈ గోప్యత కారణంగా నివేదికలో ఏముందో ప్రజలకు తెలియడం లేదు. అందులోని అంశాలపై కూలంకషంగా చర్చించి, స్టాండింగ్‌ కమిటీకి అభిప్రాయాలు తెలియజేసే అవకాశం వారికి లేకుండా పోతోంది. ఏతావాతా తేలిందేమంటే ఈ ప్రక్రియ మొత్తం అత్యంత రహస్యంగా జరిగిపోతోంది.
ఎందుకీ హడావిడి? : ప్రతిపక్షం
మూడు బిల్లులను హడావిడిగా, ఎటువంటి సంప్రదింపులు జరపకుండా, పారదర్శకత లేకుండా పార్లమెంటులో ప్రవేశపెట్టడంపై ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. పైగా విస్తృత సంప్రదింపుల కోసం స్టాండింగ్‌ కమిటీ సమావేశాన్ని సెప్టెంబర్‌కు వాయిదా వేయాలని కోరినా పట్టించుకోలేదని విమర్శించాయి. పైగా స్టాండింగ్‌ కమిటీ సమావేశం గురించి తమకు కేవలం కొద్ది రోజుల ముందు మాత్రమే సమాచారం ఇచ్చారని కొందరు సభ్యులు ఆరోపించారు. ఈ బిల్లులపై తమ అభ్యంతరాలు తెలియజేస్తామని, సంప్రదింపులకు మరింత సమయం కోరతామని సమావేశానికి ముందు ఓ సభ్యుడు తెలిపారు. బిల్లుల్ని పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి ముందు ఎవరితోనూ చర్చించలేదని ఆయన విమర్శించారు. ఈ చట్టాలు వంద సంవత్సరాల క్రితం నాటివని, సంప్రదింపులు జరపకుండా వాటిలో భారీ మార్పులు చేయడం సబబు కాదని చెప్పారు. బిల్లులపై విస్తృత సంప్రదింపులు అవసరమని ప్రతిపక్ష పార్టీలన్నీ చెబుతుండగా నూతన చట్టాలకు హిందీ పేర్లను తగిలించడంపై డీఎంకే తీవ్ర అభ్యంతరం తెలిపింది.
బిల్లుల్లో ఏముంది?
కేంద్ర హోం శాఖ ప్రవేశపెట్టిన మూడు బిల్లుల్లోని నిబంధనలు రాష్ట్రాలకు విశేషాధికారాలు కట్టబెడుతున్నాయి. క్రిమినల్‌ నేరాలకు సంబంధించి రాష్ట్రాలు తమ తమ చట్టసభలలో ప్రత్యేక చట్టాలు ప్రవేశపెట్టవచ్చు. భావ ప్రకటనా స్వేచ్ఛకు కళ్లెం వేసే నిబంధనలను ఈ బిల్లుల్లో చేర్చారు. పోలీసుల అధికారాలను పెంచారు. పోలీస్‌ కస్టడీ సమయాన్ని 15 రోజుల నుండి 40 రోజులకు లేదా 60 రోజుల వరకూ పెంచుకునే వీలు కల్పించారు.
ఏమిటీ కమిటీ ?
ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ సంహిత, సీఆర్‌పీసీ స్థానంలో భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత, ఎవిడెన్స్‌ చట్టం స్థానంలో భారతీయ సాక్ష్య బిల్లులను కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఈ నెల 11న పార్లమెంట్‌ సమావేశాల చివరి రోజున హడావిడిగా ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. వీటిపై సంప్రదింపులు జరిపి, నివేదిక అందజేసేందుకు స్టాండింగ్‌ కమిటీకి పంపాలని ఆయన స్పీకర్‌ను కోరారు. వారం రోజుల తర్వాత ఆగస్ట్‌ 18న స్పీకర్‌ను సంప్రదించిన అనంతరం రాజ్యసభ చైర్మెన్‌ బిల్లులను స్టాండింగ్‌ కమిటీకి పంపారు. నివేదిక అందజేసేందుకు బీజేపీ ఎంపీ బ్రిజ్‌లాల్‌ నేతృత్వంలోని స్టాండింగ్‌ కమిటీకి మూడు నెలల సమయం ఇచ్చారు. ఈ కమిటీలో ఉభయ సభలకూ చెందిన 27 మంది ఎంపీలు సభ్యులుగా ఉన్నారు.