క్రికెట్‌కు శిఖర్‌ ధావన్‌ గుడ్‌ బై

క్రికెట్‌కు శిఖర్‌ ధావన్‌ గుడ్‌ బైన్యూఢిల్లీ: టీమిండియా ఎడమచేతివాటం బ్యాటర్‌, మాజీ కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ క్రికెట్‌ అన్ని ఫార్మాట్‌ల గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించాడు. సోషల్‌ మీడియా వేదికగా తన రిటైర్మెంట్‌ ప్రకటనను వెల్లడించాడు. క్రికెట్‌ అధ్యాయాన్ని ముగిస్తున్నట్లు శనివారం ‘ఎక్స్‌’లో ఒక వీడియోను విడుదల చేశాడు. కెరీర్‌ ముగిసినట్లు, ఎన్నో జ్ఞాపకాలను మోసుకెళ్తున్నట్లు అందులో వెల్లడించాడు. ‘మీ ప్రేమ, అభిమానానికి థ్యాంక్స్‌.. గుండెల్లో శాంతిని నింపుకుని.. క్రికెట్‌కు అల్విదా చెబుతున్నా..’ అంటూ పేర్కొన్నాడు. టీమిండియాకు సుదీర్ఘ కాలం ఓపెనర్‌గా రాణించిన ధావన్‌.. 17వన్డేల్లో, ఏడు టెస్టుల్లో కెప్టెన్‌గా ఉన్నాడు. టీమిండియా తరపున శిఖర్‌ ధావన్‌ చివరిసారి డిసెంబర్‌ 2022లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఆడాడు. తన కెరీర్‌లో 34టెస్టులు, 167వన్డేలు, 68టీ20లు ఆడిన ధావన్‌. టెస్టుల్లో 2315, వన్డేల్లో 6793, టీ20ల్లో 1759 పరుగులు చేశాడు. ఇందులో 40 ప్లస్‌ సగటుతో.. 90 ప్లస్‌ స్ట్రయిక్‌ రేట్‌తో.. మొత్తం 24సెంచరీలు చేశాడు. వన్డేల్లో 5వేల పరుగులు చేసిన 8మంది బ్యాటర్లలో అతను ఒకడు. ఈ జాబితాలో ఇండియా నుంచి రోహిత్‌, కోహ్లీ మాత్రమే ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో పంజాబ్‌ కింగ్స్‌ తరపున ఐపిఎల్‌లో చివరి టోర్నీ ఆడాడు.