మెరిసిన మీరాబాయి

మెరిసిన మీరాబాయి– పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత
– ఐడబ్ల్యూఎఫ్‌ ప్రపంచకప్‌
బ్యాంకాక్‌ (థారులాండ్‌) : భారత స్టార్‌ వెయిట్‌లిఫ్టర్‌ మీరాబాయి చాను మెరిసింది. హిప్‌ గాయం నుంచి కోలుకున్న టోక్యో ఒలింపిక్స్‌ సిల్వర్‌ మెడలిస్ట్‌.. ఆరు నెలల విరామం తర్వాత అదరగొట్టింది. థారులాండ్‌లో జరుగుతున్న ఐడబ్ల్యూఎఫ్‌ (అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్‌ ఫెడరేషన్‌) ప్రపంచకప్‌లో మీరాబాయి చాను సత్తా చాటింది. మహిళల 49 కేజీల విభాగం గ్రూప్‌-బిలో మూడో స్థానంలో నిలిచిన మీరాబాయి చాను..ఏకంగా 184 కేజీలను ఎత్తిపడేసింది. స్నాచ్‌లో 81 కేజీలు, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 103 కేజీల బరువు అలవోకగా ఎత్తిని మీరాబాయి చాను 2024 పారిస్‌ ఒలింపిక్స్‌కు లాంఛనంగా అర్హత సాధించింది. ఒలింపిక్స్‌ అర్హత ప్రక్రియ ప్రకారం వెయిట్‌లిఫ్టర్లు కనీసం రెండు తప్పనిసరి ఈవెంట్లు, మూడు ఇతర క్వాలిఫయింగ్‌ టోర్నీల్లో పోటీపడాలి. క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో కనీసం 103 కేజీలు, స్నాచ్‌లో కనీసం 81 కేజీలు.. ఓవరాల్‌గా కనీసం 184 కేజీల బరువు ఎత్తాలి. అప్పుడే 2024 పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించవచ్చు. తాజా ఐడబ్ల్యూఎఫ్‌ ప్రపంచకప్‌లో అన్ని అర్హత కొలమానాలను అందుకున్న మీరాబాయి చాను ముచ్చటగా మూడోసారి ఒలింపిక్స్‌లో పోటీపడేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఒలింపిక్‌ క్వాలిఫికేషన్‌ ర్యాంకింగ్‌ (ఓక్యూఆర్‌)లను త్వరలోనే అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్‌ సమాఖ్య విడుదల చేయనుంది. తాజా ర్యాంకింగ్స్‌ ప్రకారం మహిళల 49 కేజీల విభాగంలో మీరాబాయి చాను రెండో స్థానంలో కొనసాగుతుంది. అగ్రస్థానంలో చైనా వెయిట్‌లిఫ్టర్‌ జియాన్‌ హుహువా నిలిచింది. నిబంధనల ప్రకారం ప్రతి వెయిట్‌ విభాగంలో ఒలింపిక్‌ క్వాలిఫికేషన్‌ ర్యాంకింగ్స్‌లో టాప్‌-10లో నిలిచిన అథ్లెట్లు నేరుగా పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తారు. ఆరు నెలల విరామం తర్వాత తొలి ప్రయత్నంలోనే మెప్పించిన మీరాబాయి చాను.. పారిస్‌ ఒలింపిక్స్‌ నాటికి అత్యుత్తమ ఫిట్‌నెస్‌, ఫామ్‌ అందుకునే అవకాశం ఉంది. పారిస్‌ 2024 ఒలింపిక్స్‌లో భారత్‌ నుంచి వెయిట్‌లిఫ్టింగ్‌ విభాగంలో మీరాబాయి చాను మాత్రమే పోటీపడనుంది.