మెరిసిన షమి, సూర్య

Shining Shami, Surya– రాణించిన శుభ్‌మన్‌, రాహుల్‌
– తొలి వన్డేలో ఆసీస్‌పై భారత్‌ గెలుపు
మహ్మద్‌ షమి (5/51), సూర్యకుమార్‌ యాదవ్‌ (50) ఫామ్‌ అందుకున్నారు. ప్రపంచకప్‌ ముంగిట బంతితో ఒకరు, బ్యాట్‌తో ఒకరు జోరందుకోవటంతో మొహాలిలో ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో టీమ్‌ ఇండియా సంపూర్ణ విజయం సాధించింది. కీలక ఆటగాళ్లు ఫామ్‌లోకి రావటంతో పాటు బలమైన ఆసీస్‌పై ఆతిథ్య భారత్‌ అలవోక విజయం సాధించింది. తొలుత ఆస్ట్రేలియా 276 పరుగులు చేయగా, 48.4 ఓవర్లలో భారత్‌ లక్ష్యాన్ని ఛేదించింది.
నవతెలంగాణ-మొహాలి

ఆస్ట్రేలియాపై టీమ్‌ ఇండియా సత్తా చాటింది. భారత బౌలర్లు సమిష్టి చెలరేగటంతో తొలి వన్డేలో భారత్‌ 5 వికెట్ల తేడాతో ఆసీస్‌పై ఘన విజయం సాధించింది. ఓపెనర్లు శుభ్‌మన్‌ గిల్‌ (74, 63 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), రుతురాజ్‌ గైక్వాడ్‌ (71, 77 బంతుల్లో 10 ఫోర్లు)లకు తోడు కెప్టెన్‌ కెఎల్‌ రాహుల్‌ (58 నాటౌట్‌, 63 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌), సూర్యకుమార్‌ యాదవ్‌ (50, 49 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) అర్థ సెంచరీల మోత మోగించారు. దీంతో 277 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 48.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మూడు మ్యాచుల వన్డే సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 276 పరుగులకు కుప్పకూలింది. పేసర్‌ మహ్మద్‌ షమి (5/51) ఐదు వికెట్ల ప్రదర్శనతో చెలరేగాడు. ఓపెనర్‌ డెవిడ్‌ వార్నర్‌ (52, 53 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), జోశ్‌ ఇంగ్లిశ్‌ (45, 45 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), స్టీవ్‌ స్మిత్‌ (41, 60 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. భారత్‌, ఆస్ట్రేలియా రెండో వన్డే ఆదివారం ఇండోర్‌లో జరుగనుంది.
సూర్య మెరిసె : ఆసీస్‌తో గత సిరీస్‌లో మూడు సార్లు తొలి బంతికే డకౌట్‌గా నిష్క్రమించిన సూర్యకుమార్‌ యాదవ్‌.. ఆ తర్వాత మ్యాచుల్లోనూ మెప్పించలేదు. ప్రపంచకప్‌ ముంగిట సూర్యకుమార్‌ యాదవ్‌ ఫామ్‌ భారత్‌కు ఆందోళనగా మారింది. ఆసీస్‌తో తొలి వన్డేలో సూర్య (50) అదిరే అర్థ సెంచరీ సాధించాడు. నాణ్యమైన కంగారూ బౌలింగ్‌ దాడిని ఎదుర్కొని కెఎల్‌ రాహుల్‌తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పిన సూర్య.. ఐదు ఫోర్లు, ఓ సిక్సర్‌తో కదం తొక్కాడు. తొలుత ఓపెనర్లు గిల్‌ (74), రుతురాజ్‌ (71) తొలి వికెట్‌కు 142 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేసి గెలుపు బాట వేశారు. ఆసీస్‌ స్పిన్నర్‌ జంపా వరుస వికెట్లతో బ్రేక్‌ సాధించినా.. కెఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్‌లు అర్థ సెంచరీ ఇన్నింగ్స్‌లతో ఆసీస్‌ ఆశలపై నీళ్లు చల్లారు. శ్రేయస్‌ అయ్యర్‌ (3), ఇషాన్‌ కిషన్‌ (18) నిరాశపరిచారు.
షమి విజృంభణ : టాస్‌ నెగ్గిన భారత్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఇన్నింగ్స్‌ నాల్గో బంతికే మిచెల్‌ మార్ష్‌ (4) వికెట్‌తో మహ్మద్‌ షమి బ్రేక్‌ సాధించాడు. డెవిడ్‌ వార్నర్‌ (52), స్టీవ్‌ స్మిత్‌ (41) రెండో వికెట్‌కు 94 పరుగులు జోడించి ఆసీస్‌ నిలబెట్టారు. మార్నస్‌ లబుషేన్‌ (39), కామెరూన్‌ గ్రీన్‌ (31), జోశ్‌ ఇంగ్లిశ్‌ (45) సహా మార్కస్‌ స్టోయినిస్‌ (29), పాట్‌ కమిన్స్‌ (21) పరుగుల వేటలో మెప్పించినా.. నాణ్యమైన భారత బౌలర్లపై వేగంగా పరుగులు సాధించటంలో విఫలమయ్యారు. దీంతో ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 10 వికెట్లకు 276 పరుగులే చేసింది. మహ్మద్‌ షమి ఐదు వికెట్లు పడగొట్టగా.. బుమ్రా, అశ్విన్‌, జడేజాలు తలా ఓ వికెట్‌ తీసుకున్నారు.
స్కోరు వివరాలు
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ : 276/10
(వార్నర్‌ 52, జోశ్‌ 45, స్మిత్‌ 41, షమి 5/51, అశ్విన్‌ 1/47)
భారత్‌ ఇన్నింగ్స్‌ : 281/5
(గిల్‌ 74, గైక్వాడ్‌ 71, రాహుల్‌ 58, సూర్య 50, కమిన్స్‌ 1/44)