నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్, రెరా కార్యదర్శి శివబాలకృష్ణ ఏసీబీకి పట్టుబడటంతో పురపాలక శాఖ వణుకుతోంది. ఆయా శాఖల్లో పనిచేసే అధికా రులకు కంటిమీద కునుకు కరువైనట్టు సమాచారం. పరోక్షంగా సంబంధాలు ఉన్న మాజీ మంత్రి, మరో ఐఏఎస్ అధికారికి ఒకింత గుబులు పట్టుకున్నట్టు తెలిసింది. కీలక అధికారిగా బాధ్యతలు నిర్వహించిన బాలకృష్ణ ఇంట్లో దాదాపు రూ. 500 కోట్ల మేర ఆస్తుల పత్రాలు, ఇతరాలు దొరకడంతో ఏసీబీ అప్రమత్తమై నట్టు తెలిసింది. ఒక డైరెక్టర్ ఇంట్లోనే భారీ మొత్తం దొరకడంతో, ఈ వ్యవహారం తో ఇంకా చాలా మందికి లింకులు ఉండే అవకాశాలు లేకపోలేదనే కోణంలో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) విచారణ చేసే అవకాశ మున్నట్టు సమాచారం. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఓ మాజీ మంత్రి ఇప్పుడు ఏసీబీ వ్యవహారం తమవైపు తిరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునే పనిలో ఉన్నట్టు వినిపిస్తున్నది. బీఆర్‌ఎస్ సర్కారులోని మంత్రులతో లింక్ పెట్టుకున్న ఒక ప్రముఖ రియాల్టీ సంస్థ దాదాపు 100 ప్రాజెక్టులు తీసుకుని, 50 కూడా పూర్తిచయలేకపోయిందనే అరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు పాత సర్కారులో అన్నీ తానై వ్యవహరించిన ఆ మంత్రి అండదండలే కారణమని తెలిసింది. సదరు కంపెనీకి ఆ మాజీ మంత్రి ఆదేశాల మేరకే రెరా నుంచి శివబాలకృష్ణ ఆపన్నహస ్తం అందించినట్టు తెలిసింది.ఈమేరకు మంత్రికి రియాల్టీ సంస్థ భారీగానే ముడుపు లు సమర్పించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఆ మంత్రితో శివబాలకృష్ణకు తత్సం బంధాలు ఉన్నాయని తెలిసింది. ఏసీబీ ఆ కోణంలో విచారణ చేసే అవకాశమదని సమాచారం. రియల్‌ఎస్టేట్ కంపెనీ నిర్మించే ప్రాజెక్టులకు అనుమతులు త్వరితగతిన మంజూరు చేయడంలో ఇటు హెచ్‌ఎండీఏతోపాటు రెరాలో కార్యదర్శిగా ఉన్న శివబాలకృష్ణ సహకరించినట్టు సమాచారం. ఆమేరకు ఏసీబీ కీలక సమాచారం రాబట్టిందనే ప్రచారం జరుగు తున్నది. అయితే సంబంధిత మాజీ మంత్రి జోలికి ఇప్పట్లో ఏసీబీ వెళ్లే అవాశం లేదనీ,పూర్తి సాక్ష్యాధారాలు సేకరించాకే ఏమీ చేయాలనే అంశంపై ఆలోచించ నున్నట్టు తెలిసింది. ఇదిలావుండగా మరో ఐఏఎస్ అధికారికి సైతం శివబాలకృష్ణతో సంబంధాలు ఉన్నాయనే గుసగుసలు సంబంధిత శాఖలో చోటుచేసుకుంటున్నాయి.