ఆమ్‌ఆద్మీ పార్టీకి షాక్‌..

Shock for Aam Aadmi Party..– ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 53 మంది అభ్యర్థుల ఓటమి
– కేవలం ఐదుగురికి మాత్రమే 5000 కంటే ఎక్కువ ఓట్లు
రారుపూర్‌: ఢిల్లీ, పంజాబ్‌ రాష్ట్రాల్లో ఆప్‌ పార్టీ సత్తా చాటింది. అయితే ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఆశించిన ఫలితాలను సాధించ లేక పోయింది. ఛత్తీస్‌గఢ్‌ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఎన్నికల్లో మొత్తం 53 మంది ఆప్‌ అభ్యర్థులు భారీ ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ రెండోసారి అదృష్టాన్ని పరీక్షించు కుంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ 53 స్థానాల్లో పోటీ చేసి 0.93 శాతం ఓట్లు సాధించింది. 2018 ఎన్నికల్లో ఆప్‌ 85 స్థానాల్లో పోటీ చేసి 0.87 శాతం ఓట్లు సాధించింది. 2018లో పార్టీ అభ్యర్థులందరికీ డిపాజిట్లు గల్లంతయ్యాయి.
ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి చెందిన 53 మంది అభ్యర్థుల్లో కేవలం ఐదుగురు అభ్యర్థులు మాత్రమే 5 వేలకు పైగా ఓట్లు సాధించారు. అలాగే ఎంతమంది అభ్యర్థుల డిపాజిట్లు జప్తు అయ్యాయన్న డేటాను ఎన్నికల సంఘం ఇంకా వెల్లడించలేదు. ఆప్‌ రాష్ట్ర విభాగం చీఫ్‌ కోమల్‌ హుపెండి 15,255 ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు. భానుప్రతాపూర్‌ స్థానం నుంచి వరుసగా రెండోసారి ఓటమి పాలయ్యారు. ఐదు వేలకు పైగా ఓట్లు పొందిన మిగిలిన నలుగురు అభ్యర్థులలో సంత్రమ్‌ సలామ్‌ (అంతగఢ్‌), బాలు రామ్‌ భవాని (దంతేవాడ),ఖడ్గరాజ్‌ సింగ్‌ (కవార్ధా), జస్వీర్‌ సింగ్‌ (బిల్హా) ఉన్నారు.
నోటా కంటే తక్కువ ఓట్లు
53 మంది అభ్యర్థులలో, తొమ్మిది మందికి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. ఈ స్థానాల్లో చిత్రకోట్‌, జగదల్‌పూర్‌, బస్తర్‌, కేష్‌కల్‌, సాజా, అరంగ్‌, రామానుజ్‌గంజ్‌, లుంద్రా, కుంకూరి స్థానాలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి సంబంధించి రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి అమితం శుక్లా బుధవారం మాట్లాడుతూ, ”ఎన్నికలలో పార్టీ ఓటమిని ఎదుర్కొంది, అయితే బస్తర్‌ ప్రాంతంలో మంచి పనితీరు కనబరిచింది.”
మా పార్టీ అభ్యర్థులు ఐదు వేలకు పైగా ఓట్లు సాధించిన ఐదు స్థానాల్లో మూడు (భానుప్రతాపూర్‌, అంతగఢ్‌, దంతెవాడ) బస్తర్‌ ప్రాంతానికి చెందిన వారున్నారని తెలిపారు.
”మేం మెరుగ్గా చేయగలిగినంతా చేశాం. కానీ ఫలితాలు మాత్రం మా అంచనాల ప్రకారం లేవు. అలాంటి పనితీరుకు కారణాలను మేం పరిశీలిస్తాం” అని శుక్లా చెప్పారు.
అన్ని ఎన్నికల సర్వేలలో ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ విజయం సాధిస్తుందని అంచనా వేసిన విషయం విదితమే. అయితే ఫలితాలు మరింత ఆశ్చర్యకరంగా ఉన్నాయని, మేం కొన్ని స్థానాల్లో మంచి పనితీరును ఆశించామని, కానీ అది జరగలేదని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని మరింత మెరుగ్గా పనిచేసేలా ప్రయత్నిస్తామని శుక్లా చెప్పారు.
పది హామీలిచ్చినా ఫలితమివ్వలే..
ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్‌ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడితే ఉచిత విద్యుత్‌, మహిళల కు నెలవారీ ‘సమ్మాన్‌ రాశి’, నిరుద్యోగులకు నెల కు రూ. 3,000 భృతి సహా పది హామీలను ఇచ్చారు. 90 స్థానాలున్న ఛత్తీస్‌గఢ్‌లో ఐదేండ్ల విరామం తర్వాత బీజేపీ 54 సీట్లు గెలుచుకుని అద్భుతంగా పునరాగమ నం చేసింది.
కాంగ్రెస్‌ 35 స్థానాలకు తగ్గగా, గోండ్వా నా రిపబ్లిక్‌ పార్టీ ఒక స్థానాన్ని గెలుచుకుంది.