బీజేపీ ఎంపీలకు షాక్‌.. కాంగ్రెస్‌ ఎంపీలు విన్‌

బీజేపీ ఎంపీలకు షాక్‌.. కాంగ్రెస్‌ ఎంపీలు విన్‌–  దుబ్బాకలో బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన మెదక్‌ ఎంపీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏడుగురు ఎంపీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోగా నలుగురు గెలుపొందారు. ముగ్గురు ఓడిపోయారు. బీజేపీ నుంచి బరిలో దిగిన కరీంనగర్‌ ఎంపీ బండి సంజరు, ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపూరావు, నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు గట్టి షాక్‌ తగిలింది. కరీంనగర్‌ అసెంబ్లీ స్థానం నుంచి బండి సంజరు కుమార్‌ పోటీచేయగా ఆయన ప్రస్తుత మంత్రి గంగుల కమలాకర్‌ చేతిలో స్వల్ప ఓట్లతో పరాజితులయ్యారు. కోరుట్ల నుంచి ధర్మపురి అర్వింద్‌ పోటీచేశారు. అక్కడ తొలిసారి బరిలోకి దిగిన కల్వకుంట్ల సంజరు చేతిలో అర్వింద్‌ ఓట్లతో ఓడిపోయారు. ఆదిలాబాద్‌ ఎంపీగా ఉన్న సోయం బాపూరావు బోథ్‌ స్థానం నుంచి బరిలోకి దిగి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి అనిల్‌ జాదవ్‌ చేతిలో ఘోరంగా ఓడిపోయారు. ఈ ముగ్గురూ గెలుస్తారని బీజేపీ అధిష్టానం గంపెడాశలు పెట్టుకోగా నిరాశే మిగిలింది. బీజేపీ ఎంపీలకు ఇలా జరగ్గా..కాంగ్రెస్‌ ఎంపీలు మాత్రం ఎమ్మెల్యేలుగా పోటీ చేసి విజయం సాధించారు. యాదాద్రి భువనగిరి ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్లగొండ అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేశారు. అక్కడ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డిపై వెంకట్‌రెడ్డి ఘనవిజయం సాధించారు. నల్లగొండ ఎంపీగా ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హుజూర్‌నగర్‌ అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగి సైదిరెడ్డిపై భారీ మెజార్టీతో గెలుపొందారు. టీపీసీసీ అధ్యక్షులు, మల్కాజిగిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి కొడంగల్‌, కామారెడ్డి నుంచి పోటీ చేశారు. కొడంగల్‌లో విజయం సాధించారు. కామారెడ్డిలో ఓడిపోయారు. మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి దుబ్బాక అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసి బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై ఘన విజయం సాధించారు.