– టైటాన్స్ చేతిలో పరాజయం
– గుజరాత్ బౌలర్ల సమిష్టి ప్రదర్శన
– హైదరాబాద్ 162/8, గుజరాత్ 168/3
సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఊహించని షాక్. గత మ్యాచ్‌లో రికార్డు బద్దలుకొట్టే స్కోరుతో అసమాన విజయం సాధించిన ఆరెంజ్ ఆర్మీ.. మొతెరా మైదానంలో గుజరాత్ టైటాన్స్ చేతిలో కంగుతింది. అరవీర బ్యాటింగ్ లైనప్ కలిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గుజరాత్ టైటాన్స్ బౌలర్లు ముకుతాడు వేశారు. మోహిత్ శర్మ (3/25), రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ సమిష్టిగా రాణించటంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. ట్రావిశ్ హెడ్ (19), అభిషేక్ శర్మ (29), హెన్రిచ్ క్లాసెన్ (24) నిరాశపరచటంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలుత 162 పరుగులే చేసింది. ఊరించే లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ మరో 5 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఐపీఎల్17లో సన్‌రైజర్స్‌కు ఇది రెండో పరాజయం కాగా, గుజరాత్ టైటాన్స్‌కు ఇది రెండో విజయం.
నవతెలంగాణ-అహ్మదాబాద్
కథ అడ్డం తిరిగింది. ముంబయి ఇండియన్స్‌పై ఐపీఎల్‌లో రికార్డు 277 పరుగుల భారీ స్కోరు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ తన తర్వాతి మ్యాచ్‌లో బ్యాట్‌తో తడబడింది!. గుజరాత్ టైటాన్స్ బౌలర్లు కలిసికట్టుగా సన్‌రైజర్స్ బ్యాటర్లను కట్టడి చేయటంతో ఇది సాధ్యపడింది. 163 పరుగుల ఛేదనలో డెవిడ్ మిల్లర్ (44 నాటౌట్, 27 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), సాయి సుదర్శన్ (45, 36 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), శుభ్‌మన్ గిల్ (36, 28 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. 19.1 ఓవర్లలోనే లాంఛనం ముగించిన గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ వెటరన్ పేసర్ మోహిత్ శర్మ (3/25) మూడు వికెట్ల ప్రదర్శనతో 162 పరుగులకే పరిమితమైంది. అభిషేక్ శర్మ (29, 20 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), అబ్దుల్ సమద్ (29, 14 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), హెన్రిచ్ క్లాసెన్ (24, 13 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. గుజరాత్ టైటాన్స్ పేసర్ మోమిత్ శర్మ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు సాధించాడు.
అలవోకగా కొట్టారు
గుజరాత్ టైటాన్స్ లక్ష్యం 163 పరుగులు. ఐపీఎల్‌లో గత రెండు సీజన్లలో ఛేదనలో గుజరాత్ టైటాన్స్‌కు తిరుగులేని రికార్డుంది. సొంత మైదానంలో ఊరించే లక్ష్యం ముగించేందుకు టైటాన్స్ ఒత్తిడికి గురి కాలేదు. ఓపెనర్లు వృద్దిమాన్ సాహా (25, 13 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు), శుభ్‌మన్ గిల్ (36, 28 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్‌కు 36 పరుగులు జోడించారు. పవర్‌ప్లేలో సాహా దూకుడుగా ఆడాడు. షాబాజ్, భువనేశ్వర్ కుమార్‌లపై బౌండరీలు బాదాడు. ఓ ఎండ్‌లో కెప్టెన్ గిల్ కాస్త నెమ్మదిగా ఆడినా.. సాధించాల్సిన రన్‌రేట్ తక్కువగా ఉండటంతో టైటాన్స్‌కు సమస్య లేదు. సాయి సుదర్శన్ (45, 36 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి గిల్ రెండో వికెట్‌కు కీలక భాగస్వామ్యం నమోదు చేశాడు. శుభ్‌మన్ గిల్ వికెట్‌తో సన్‌రైజర్స్ పుంజుకునే ప్రయత్నం చేసినా.. డెవిడ్ మిల్లర్ (44 నాటౌట్) రాకతో టైటాన్స్ మరింత పట్టు బిగించింది. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లతో సన్‌రైజర్స్ ఒత్తిడి పెంచేందుకు చూసింది. డెత్ ఓవర్లలో టైటాన్స్‌ను దెబ్బతీసేందుకు హైదరాబాద్ ఎదురుచూడగా.. మయాంక్ మార్కండే ఓవర్లో 24 పరుగులు పిండుకున్న మిల్లర్, సాయి సుదర్శన్ టైటాన్స్ గెలుపు లాంఛనం చేశారు. ఆఖరు ఓవర్లో తొలి బంతిని సిక్సర్‌గా బాదిన డెవిడ్ మిల్లర్ గుజరాత్ టైటాన్స్‌కు 7 వికెట్ల తేడాతో ఘన విజయం అందించాడు. విజరు శంకర్ (14 నాటౌట్) ఫర్వాలేదనిపించే ఇన్నింగ్స్ నమోదు చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో పాట్ కమిన్స్, మయాంక్ మార్కండే, షాబాజ్ అహ్మద్‌లు తలా ఓ వికెట్ ఖాతాలో వేసుకున్నారు.
బ్యాటర్లు విఫలం
టాస్ నెగ్గిన సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఛేదనలో తిరుగులేని రికార్డున్న గుజరాత్ టైటాన్స్‌కు రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసే సదవకాశం కల్పించటం సన్‌రైజర్స్‌కు వ్యూహాత్మక తప్పిదమే!. గత మ్యాచ్ జోరు కొనసాగించటంలో ఆరెంజ్ ఆర్మీ బ్యాటర్లు విఫలమయ్యారు. ట్రావిశ్ హెడ్ (19), మయాంక్ అగర్వాల్ (16) తొలి వికెట్‌కు 34 పరుగులు జోడించి శుభారంభం అందించారు. కానీ ఓపెనర్లు ఇద్దరిలో ఎవరూ ఆశించిన దూకుడు చూపించలేదు. హెడ్ మూడు ఫోర్లు బాదగా, మయాంక్ రెండు బౌండరీలు కొట్టాడు. మయాంక్‌ను అజ్మతుల్లా.. హెడ్‌ను నూర్ అహ్మద్ వెనక్కి పంపారు. అభిషేక్ శర్మ (29), ఎడెన్ మార్‌క్రామ్ (17) నిరాశపరిచారు. అభిషేక్ రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో సానుకూలంగా కనిపించినా.. మార్‌క్రామ్ మళ్లీ మొదటికొచ్చాడు. 19 బంతుల్లో 17 పరుగులే చేసి ఇతర బ్యాటర్లపై ఒత్తిడి పెంచాడు!. హెన్రిచ్ క్లాసెన్ (24, 13 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు), అబ్దుల్ సమద్ (29, 14 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) ధనాధన్ ఇన్నింగ్స్‌లు ఆడారు. క్లాసెన్ రెండు సిక్సర్లు, ఓ ఫోర్ బాదగా.. సమద్ మూడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో చెలరేగాడు. క్లాసెన్ దండయాత్రకు రషీద్ ఖాన్ ముగింపు పలుకగా.. సమద్ రనౌట్‌గా నిష్క్రమించాడు. షాబాజ్ అహ్మద్ (22, 20 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) సాదాసీదా ఇన్నింగ్స్‌తో సరిపెట్టాడు. వాషింగ్టన్ సుందర్ (0) తేలిపోయాడు. దీంతో 20 ఓవర్లలో 8 వికెట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ 162 పరుగులు చేసింది. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో మోహిత్ శర్మ మూడు వికెట్లతో మెరువగా.. రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, అజ్మతుల్లా ఓమర్‌జారు, ఉమేశ్ యాదవ్ కీలక వికెట్లు పడగొట్టారు.
స్కోరు వివరాలు :
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ : ట్రావిశ్ హెడ్ (బి) నూర్ (బి) అహ్మద్ 19, మయాంక్ అగర్వాల్ (సి) నల్కాండె (బి) అజ్మతుల్లా 16, అభిషేక్ శర్మ (సి) శుభ్‌మన్ (బి) మోహిత్ శర్మ 29, ఎడెన్ మార్‌క్రామ్ (సి) రషీద్ ఖాన్ (బి) ఉమేశ్ యాదవ్ 17, హెన్రిక్ క్లాసెన్ (బి) రషీద్ ఖాన్ 24, షాబాజ్ అహ్మద్ (బి) తెవాటియ (బి) మోహిత్ శర్మ 22, అబ్దుల్ సమద్ (రనౌట్) 29, వాషింగ్టన్ సుందర్ (సి)రషీద్ ఖాన్ (బి) మోహిత్ శర్మ 0, పాట్ కమిన్స్ నాటౌట్ 2, ఎక్స్‌ట్రాలు : 4, మొత్తం : (20 ఓవర్లలో 8 వికెట్లకు) 162.
వికెట్ల పతనం : 1-34, 2-58, 3-74, 4-108, 5-114, 6-159, 7-159, 8-162.
బౌలింగ్ : అజ్మతుల్లా ఓమర్‌జారు 3-0-24-1, ఉమేశ్ యాదవ్ 3-0-28-1, రషీద్ ఖాన్ 4-0-33-1, నూర్ అహ్మద్ 4-0-32-1, మోహిత్ శర్మ 4-0-25-3, దర్శన్ నల్కాండె 2-0-18-0.
గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ : వృద్దిమాన్ సాహా (సి) కమిన్స్ (బి) షాబాజ్ అహ్మద్ 25, శుభ్‌మన్ గిల్ (సి) అబ్దుల్ సమద్ (బి) మయాంక్ మార్కండె 36, సాయి సుదర్శన్ (సి) అభిషేక్ శర్మ (బి) కమిన్స్ 45, డెవిడ్ మిల్లర్ నాటౌట్ 44, విజరు శంకర్ నాటౌట్ 14, ఎక్స్‌ట్రాలు : 4, మొత్తం : (19.1 ఓవర్లలో 3 వికెట్లకు) 168.
వికెట్ల పతనం : 1-36, 2-74, 3-138.
బౌలింగ్ : భువనేశ్వర్ కుమార్ 4-0-27-0, షాబాజ్ అహ్మద్ 2-0-20-1, జైదేవ్ ఉనద్కత్ 3.1-0-33-0, వాషింగ్టన్ సుందర్ 3-0-27-0, మయాంక్ మార్కండె 3-0-33-1, పాట్ కమిన్స్ 4-0-28-1.