కారుకు షాక్‌ ?

Car shock?– కాంగ్రెస్‌తో కుదిరిన ఒప్పందం
– మల్కాజిగిరి నుంచి మైనంపల్లి
– మెదక్‌ నుంచి రోహిత్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
కారుకు మరో షాక్‌ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే, మల్కాజిగిరి తాజా బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావు గులాబీకి గుడ్‌బై చెప్పనున్నారు. ఈమేరకు శుక్రవారం కాంగ్రెస్‌ నేతలతో చర్చలు పూర్తయ్యాయి. మైనంపల్లికి మల్కాజిగిరి అసెంబ్లీ స్థానాన్ని, ఆయన కుమారుడు మైనంపల్లి రోహిత్‌కు మెదక్‌ అసెంబ్లీ స్థానాన్ని కేటాయించేలా ఒప్పందం కుదిరినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ నుంచి మెదక్‌ టికెట్‌ ఆశిస్తున్న తిరుపతిరెడ్డిని పార్టీ నేతలు ఒప్పించినట్టు తెలిసింది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ లేదా దానికి సరి సమానమైన కార్పొరేషన్‌ పదవి ఇస్తామని పార్టీ హామీ ఇచ్చినట్టు పార్టీ వర్గాలు చెప్పాయి. మరో నేత శశిధర్‌రెడ్డికి పార్టీలో కీలకమైన పదవి ఇస్తామని ఒప్పించారు. పార్టీ ఆదేశాలమేరకు వారిద్దరు మైనంపల్లి రాకను ఆహ్వానించినట్టు తెలిసింది. మల్కాజిగిరి నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే నందికంటి శ్రీధర్‌తో కూడా చర్చలు జరుపుతున్నారు. అయితే మూడు, నాలుగు రోజుల్లో మైనంపల్లి, ఆయన కుమారుడు కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్నట్టు మైనంపల్లి అనుచరులు అంటున్నారు.