– తొలి రోజే మూడు స్వర్ణాలు సొంతం
– వరల్డ్ యూనవర్శిటీ క్రీడలు 2023
చెంగ్డు (చైనా) : ప్రపంచ విశ్వవిద్యాలయాల క్రీడల్లో టీమ్ ఇండియా అత్యుత్తమ ప్రదర్శన చేసింది. గత పోటీల్లో ఓవరాల్‌గా నాలుగు పతకాలు సాధించిన భారత్.. ఈ సారి తొలి రోజు పోటీల్లోనే ఏకంగా నాలుగు పతకాలు కైవసం చేసుకుంది. భారత స్టార్ షూటర్లు ఈసారి వరల్డ్ యూనవర్శిటి క్రీడల బరిలో నిలువటంతో పసిడి మోత మోగింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను భాకర్ పసిడి పతకం సాధించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ఎలవేనిల్ వలరివన్ సైతం గోల్డ్ మెడల్‌ను సొంతం చేసుకుంది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ జట్టు విభాగంలోనూ మన షూటర్లు సత్తా చాటారు. మను భాకర్, అశోక్ పాటిల్, యశస్వి సింగ్ త్రయం స్వర్ణం దక్కించుకుంది. ఇక జూడోలోనూ భారత అమ్మాయి ఓ పతకం సాధించింది. మహిళల 57 కేజీల విభాగంలో యామిని మౌర్య మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించింది. మూడు పసిడి, ఓ కాంస్య పతకంతో నాలుగు మెడల్స్ సాధించిన టీమ్ ఇండియా పాయింట్ల పట్టికలో నాల్గో స్థానంలో కొనసాగుతుంది. చైనాలోని చెంగ్డులో జరుగుతున్న ప్రపంచ విశ్వవిద్యాలయాల క్రీడలు ఆగస్టు 8న ముగియనున్నాయి.