అమెరికాలో సూపర్‌ మార్కెట్‌ వద్ద కాల్పులు

– ముగ్గురు మృతి, 10మందికి గాయాలు
లిటిల్‌ రాక్‌, ఆర్కాన్సాస్‌ : అమెరికాలోని అర్కాన్సాస్‌ రాష్ట్రంలో ఒక సరుకుల దుకాణం వద్ద ఒక వ్యక్తి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు చనిపోగా, 10మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. కాల్పులతో స్టోర్‌ తలుపులకు, అక్కడ పార్క్‌ చేసిన కార్ల అద్దాలకు బుల్లెట్‌ గుర్తులు కనిపిస్తున్నాయి. బయట నేలపై ఖాళీ తూటాలు పడి వున్నాయి. కాల్పుల కలకలంతో ఆ దారిన వెళ్ళేవారు లోపల, అక్కడ పార్కింగ్‌ స్థలంలో దాగుండేందుకు ప్రయత్నించారు. కాల్పులు జరిపిన వ్యక్తిపై వెంటనే అక్కడ గల పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఇద్దరు పోలీసులు కూడా గాయపడ్డారని రాష్ట్ర పోలీసు విభాగం తెలిపింది. లిటిల్‌ రాక్‌ నగరానికి దక్షిణంగా ఫోర్డీస్‌ పట్టణంలో మాడ్‌ బుచర్‌ గ్రోసరీ స్టోర్‌లో శుక్రవారం ఉదయం 11.30గంటల సమయంలో కాల్పులు జరిగాయని తెలిపారు. తొలుత కాల్పుల శబ్దం వినిపించినపుడు బాణాసంచా కాల్పులని భావించామని, తర్వాత ఒక వ్యక్తి తుపాకీ పట్టుకుని కాల్చడం చూసి భయంతో పరిగెత్తామని ఒక మహిళ తెలిపారు. అమెరికాలో ఇలా కాల్పులు జరగడం చాలా ఎక్కువ. 2022లో బఫెలో సూపర్‌ మార్కెట్‌లో జరిగిన కాల్పుల్లో 10మంది మరణించగా, గతేడాది కొలరాడోలో జరిగిన సంఘటనలో మరో పది మంది చనిపోయారు.