సెలబ్రిటీ రిసార్ట్‌ విల్లాలో కాల్పుల కలకలం

– భార్యాభర్తల మధ్య కలహాలే కారణం..!
– పిల్లలను చూసేందుకు వచ్చిన భర్తపై మరో వ్యక్తి కాల్పులు
నవతెలంగాణ-శామీర్‌పేట
మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సెలబ్రిటీ రిసార్ట్‌లో జరిగిన కాల్పులు శనివారం కలకలం సృష్టించాయి. భార్యాభర్తల మధ్య కల హాలే ఇందుకు కారణమని తెలుస్తోంది. బాలానగర్‌ డీసీపీ సందీప్‌, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వైజాగ్‌లోని హిందూజా థర్మల్‌ పవర్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్న సిద్దార్థ్‌ దాస్‌కు స్మిత గ్రాంథితో కొన్నేండ్ల కిందట వివాహమైంది. వారికి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఉన్నారు. అయితే, దంపతుల మధ్య 2019 నుంచి విభేదాలున్నాయి. దాంతో సిద్దార్థ్‌ దాస్‌కు దూరంగా ఉంటోంది. పిల్లలను తనవెంటే ఉంచుకుని.. మనోజ్‌ అనే వ్యక్తితో కలిసి మూడేండ్లుగా శామీర్‌పేట మండలంలోని సెలబ్రిటీ రిసార్ట్‌ విల్లాలో ఉంటోంది. అలాగే, సిద్దార్థ్‌ నుంచి విడాకులు కావాలని స్మిత 2019లో కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టులో అప్లరు చేసినట్టు తెలిసింది. ఇదిలా ఉండగా, శనివారం సిద్దార్థ్‌ తన పిల్లలను చూడటానికి సెలబ్రిటీ రిసార్ట్‌కు వచ్చాడు. ఈ క్రమంలో మనోజ్‌ను విల్లాలో చూసిన సిద్దార్థ్‌ అతనితో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో మనోజ్‌ తన వద్ద ఉన్న ఎయిర్‌గన్‌తో సిద్దార్థ్‌పై కాల్పులు జరిపాడు. అందులో బుల్లెట్స్‌ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. సమచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు విచారణ అనంతరం తెలియజేస్తామని డీసీపీ తెలిపారు.