సెల్లార్ లో దుకాణాలు.. రహదారులపై వాహనాలు

Shops in the cellar.. Vehicles on the roads– అనుమతి ఒకటి… చేసేది ఇంకొకటి
– ట్రాఫిక్ తో ప్రజల ఇక్కట్లు… పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ – సిరిసిల్ల
జిల్లా కేంద్రం రోజురోజుకు వేగంగా అభివృద్ధి చెందుతోంది. పట్టణంలో దుకాణాలు, గోదాములకు అద్దెలు వేళల్లో ఉన్నాయి. దీంతో దుకాణ సముదాయాలు, బహుళ అంతస్తుల భవన నిర్మాణానికి అనుమతులు పొందుతున్నారు. అదే సమయంలో సెల్లార్లను నిర్మించుకుంటున్నారు. సెల్లార్లకు అనుమతి లేకున్నప్పటికీ పురపాలక శాఖ అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. సెల్లార్లు నిర్మాణం చేసుకొని వాటిని అద్దెకు ఇస్తున్నారు. సెల్లార్ లలో వాహనాలు ఉండాల్సి ఉండగా, వాహనాలను రోడ్లపై ఉంచి ట్రాఫిక్ సమస్యకు కారణమవుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పలువురు సెల్లార్లలో ప్రత్యేక గదులు నిర్మించి షట్టర్లను ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో వ్యాపారం కొనసాగిస్తుండడంతో ప్రధాన రహదారులపై వాహనదారులు వాహనాలు పార్కింగ్ చేస్తున్నారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఫలితంగా ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుంది. సెల్లార్లలో దుకాణాలు ఏర్పాటు చేయడంతో కొనుగోలుదారులు తమ వాహనాలను రోడ్లపై పార్కింగ్ చేస్తున్నారు. నో పార్కింగ్ అంటూ పోలీసులు జరిమానా విధిస్తున్నారు.
పట్టణంలో ప్రధాన ప్రాంతాల్లో సెల్లార్లు..
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కరీంనగర్ రోడ్డు లోని అంబేద్కర్ చౌరస్తా సమీపంలో ఓ మందుల దుకాణం యజమాని సెల్లార్  ఏర్పాటు చేసి అద్దెకు ఇచ్చారు. కొత్త బస్టాండ్ సమీపంలో  సెల్లార్లను ఏర్పాటు చేసి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు ఇతర దుకాణాలకు అద్దెకు ఇచ్చారు. పెద్ద బజార్లో ఏర్పాటు చేసిన సెల్లార్లను దుకాణాలకు అద్దెకివ్వడంతో వాహనాలు దుకాణాల ముందు సెల్లార్ల ముందు నిలుపుతున్నారు. ఆ ప్రాంతం రహదారి చిన్నగా ఉండగా అటు నుంచి వెళ్లే వాహనదారులు, పాదాచారులు ట్రాఫిక్ సమస్యతో చాలా ఇబ్బంది పడుతున్నారు. కొత్తచెరువు సమీపంలో ఓ యజమాని తన భవనానికి ఉన్న సెల్లార్ సిమెంట్ గోదాముకు అద్దెకి ఇచ్చారు. గాంధీ చౌరస్తా లో సెల్లార్లు ఏర్పాటు చేసినప్పటికీ అవి అద్దెకు ఇవ్వడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. వాహనాలు ఇలా ప్రధాన రహదారిపై నిలుపుతుండడంతో ట్రాఫిక్ సమస్య పెరిగిపోయింది. మున్సిపల్ అధికారులు అసలే పట్టించుకోవడం లేదు. అంతేకాకుండా అనేక నిర్మాణాలు జరుగుతుండగా అనుమతి లేకుండా అనేకమంది సెల్లార్లు కొత్తగా ఏర్పాటు చేస్తున్నప్పటికీ అధికారులు మాత్రం ఎలాంటి నిబంధనలు లేనప్పటికీ వదిలేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సిందే.