సిద్ధేశ్వర కాటన్‌ మిల్లులో షార్ట్‌సర్క్యూట్‌

Short circuit in Siddheshwar Cotton Mill– రెండు వేల క్వింటాళ్ల పత్తి దగ్ధం
నవతెలంగాణ-ఆత్మకూరు(ఎం)
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్‌ (ఎం) మండల కేంద్రంలోని సిద్ధేశ్వర కాటన్‌ మిల్లులో సోమవారం షార్ట్‌ సర్క్యూట్‌ అవ్వడంతో 2వేల క్వింటాళ్ల పత్తి దగ్ధమైంది. ఇందుకు సంబంధించి పత్తి మిల్లు సిబ్బంది తెలిపిన ప్రకారం.. మిల్లులో ఈనెల 4న సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో రైతుల నుంచి పత్తిని కొనుగోలు చేస్తున్న సమయంలోనే విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ అయింది. పక్కనే నిల్వ ఉన్న పత్తిపై నిప్పు రవ్వలు పడి మంటలు వ్యాపించాయి. వెంటనే ఫైర్‌ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. భువనగిరి నుంచి ఫైర్‌ ఇంజిన్‌ వచ్చి మంటలను ఆర్పేసింది. ఎస్‌ఐ కృష్ణయ్య, తహసీల్దార్‌ రవికుమార్‌తో పాటు రెవెన్యూ సిబ్బంది ప్రమాదస్థలాన్ని సందర్శించి పరిశీలించారు. ఇప్పటివరకు 25వేల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేయగా, సుమారు 2 వేల క్వింటాళ్ల పత్తి దగ్ధమైంది.