స్వల్పకాలిక ‘అద్భుతాలు’

Short-lived 'miracles'బంగ్లాదేశ్‌లో ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ అస్తవ్యస్త పరిస్థితులమీద చాలా విశ్లేషణలు వచ్చాయి. వాటిలో ఎక్కువ భాగం షేక్‌ హసీనా ప్రభుత్వం అవలంబించిన పెత్తందారీ, నియంతృత్వ విధానాల మీద దృష్టిని ప్రధానంగా కేంద్రీకరించాయి. ఆ దేశ ఆర్థిక పరిస్థితిలో వచ్చిన మార్పుల గురించి చాలా తక్కువగా చెప్పాయి. కొన్ని విశ్లేషణలలో ఆర్థికస్థితి గురించిన చర్చే మొత్తంగా లేకుండా పోయింది. కేవలం కొద్ది నెలల క్రితమే ఒక ఆర్థిక ‘అద్భుతం’గా ప్రశం సలు పొందిన బంగ్లాదేశ్‌ ఆర్థిక వ్యవస్థ ఉన్నట్టుండి పతనమైంది. అక్కడి ప్రజల్లో అధిక సంఖ్యాకుల జీవన పరిస్థితులు హఠాత్తుగా దిగజారిపోయాయి. షేక్‌ హసీనా ప్రభుత్వం ప్రజల్లో తనకున్న పలుకుబడిని చాలా వేగంగా కోల్పో వడం వెనుక ప్రధాన కారణం ఈ దిగజారిన ప్రజల స్థితిగతులే. ఆ పరిస్థితులు ఆ విధంగా తయారవడానికి ప్రభుత్వమే ప్రధాన కారణంగా భావించిన ప్రజలు తమలో పెల్లుబుకుతున్న ఆగ్రహాన్ని వీధుల్లో నిరసనల రూపంలో వ్యక్తం చేశారు.
2021 వరకూ బంగ్లాదేశ్‌ ఆర్థిక వృద్ధిలో విజయం సాధించిన దేశంగా పరిగణించబడేది. నయా ఉదార వాద ఆర్థిక విధానాల చట్రం పరిధిలో ఎగుమతులను బాగా పెంచ డం ద్వారా ఈ వృద్ధి సాధించారు. ఆ దేశ ఎగు మతుల్లో దాదాపు 80శాతం దుస్తుల ఎగుమతులే. ఆ ఎగుమతుల వృద్ధి వేగం ఎంత ఎక్కువగా ఉండేదంటే, అతి స్వల్ప కాలంలోనే ప్రపంచం మొత్తం మీద దుస్తుల మార్కెట్‌లో 10 శాతం డిమాండ్‌ను బంగ్లాదేశ్‌ ఎగుమతులే అందు కుంటాయని భావించేవారు. ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంక్‌ వంటి సంస్థలు కోట్లాది మందికి పేదరికం నుంచి విముక్తి కలిగించిన దేశంగా బంగ్లాదేశ్‌ ను ప్రశంసిస్తూ వుండేవి. 2024 ఏప్రిల్‌ 2న విడుదల చేసిన నివేదికలో సైతం బం గ్లాదేశ్‌ జిడిపి వృద్ధి రేటు 5.6 దాకా ఉంటుందని ప్రపంచబ్యాంక్‌ అంచనా వేసింది.ఏ విధంగా చూపినా, ఆ వృద్ధిరేటు చెప్పుకోదగ్గదే.
ఒకసారి కరోనా మహమ్మారి ప్రభావం చూపడం ప్రారంభించాక బంగ్లాదేశ్‌ ఎగుమతులు దెబ్బ తిన్నాయి. ఐతే ఇది తాత్కాలికమేనంటూ ప్రపంచబ్యాంక్‌ భావించింది. అందుకే 2024 నివేదికలో వృద్ధిరేటు మీద తన అంచనాలను ప్రకటిం చింది. కాని ఆర్థిక పతనం కొనసాగుతూ వచ్చింది. ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు. ప్రపంచ ఆర్థి వ్యవస్థలో మాంద్యం నెలకొని కొనసాగుతున్నప్పుడు ఒకానొక దేశంలో పతనమైన ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం అంత తేలికేమీ కాదు. బంగ్లాదేశ్‌కి విదేశీ మారకద్రవ్యం గణనీయంగా అందే మరొక మార్గం ప్రవాస బంగ్లాదేశీయులు. వారి నుంచి వచ్చే చెల్లింపులు కూడా ఆర్థిక మాంద్యం ప్రభావం వలన దెబ్బతిన్నాయి. బంగ్లాదేశ్‌ తన విద్యుత్‌ ఉత్పత్తికి ప్రధానంగా చమురు మీద ఆధారపడతుంది. ఆ చమురును దిగుమతి చేసుకుంటుంది. ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా చమురు ధరలు పెరిగాయి. దాంతో తీవ్ర స్థాయిలో విదేశీ మారక ద్రవ్యానికి కొరత ఏర్పడింది. ఫలితంగా విద్యుత్‌ కోతలు పెరిగాయి. పైగా విద్యుత్‌ ధరలు పెరిగాయి. దాని పర్యవసానంగా విద్యుత్‌ మీద ఆధారపడి ఉత్పత్తి అయ్యే సరుకుల ధరలూ పెరిగాయి. ఇదంతా కలిసి దేశ ఆర్థి వ్యవస్థలో తీవ్ర సంక్షోభానికి కారణమైంది. ఆగస్టు నెలలో ద్రవ్యోల్బణం 9.52 శాతానికి ఎగబాకింది. ఇది గత దశాబ్దంలోకెల్లా అత్యధికం. కొందరైతే ఈ అంచనాలు తక్కువ చేసి చూపారని కూడా అంటున్నారు.
ఈ ద్రవ్యోల్బణానికి దోహదం చేసినవి రెందు కారణాలు ఉన్నాయి. మొదటిది: బంగ్లాదేశ్‌ కరెన్సీని డాలర్‌తో పోల్చి మారకపు రేటు తగ్గించడం. అమెరికన్‌ ప్రభుత్వం తన దేశంలో ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి వడ్డీ రేట్లు పెంచింది. దాంతో డాలర్లు అమెరికాకు ఎక్కువగా ప్రవహించడం మొదలైంది. దాని ఫలితంగా ఇతర దేశాల్లో డాలర్లకు కొరత ఏర్పడి వాటి డిమాండ్‌ పెరిగింది. దానివలన డాలర్‌ మారకపు రేటు పెరిగింది. దీనికి బంగ్లాదేశ్‌కు ఏర్పడిన విదేశీ మారకపు ద్రవ్య కొరత తోడైంది. ఇక రెండో కారణం: నయా ఉదారవాద చట్రంలో ఆర్థిక వ్యవస్థ నడుస్తున్నందున ప్రభుత్వం ధరల పెరుగుదలతో బాధపడే ప్రజలకు ఏ విధంగానూ ఊరట కలిగించే చర్యలు చేపట్టడానికి కుదరదు. అలా ఊరట కలిగించాలంటే ప్రభుత్వం ప్రజలకిచ్చే సబ్సిడీలను పెంచాలి. అలా పెంచేందుకు ప్రపంచబ్యాంక్‌ షరతులు అనుమతించవు.
ఆర్థిక వ్యవస్థ వృద్ధి వేగం మందగించడంతో దేశంలో నిరుద్యోగం తీవ్ర సమస్యగా మారింది. మరోపక్క ద్రవ్యోల్బణం వలన ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచుదామంటే అప్పుడు ఎగుమతి చేసే సరుకుల ధరలను పెంచాల్సి వుంటుంది. అలా పెంచితే అంతర్జాతీయ మార్కెట్‌ లో పోటీలో నిలదొక్కుకోవడం సాధ్యం కాదు. ఒక వేళ నిలదొక్కుకోవడం కోసం బంగ్లాదేశ్‌ కరెన్సీ మారకపు రేటును తగ్గించా లనుకుంటే దాని వలన దిగుమతి చేసుకునే చమురు ధరలు పెరిగిపోతాయి. దాని వలన మళ్ళీ ధరలు పెరిగిపోతాయి. ఈ చిక్కుల మధ్య బంగ్లాదేశ్‌ ఐఎంఎఫ్‌ ను, ఇతర అంతర్జాతీయ రుణదాతలను అప్పుల కోసం అభ్యర్ధించింది. అలా పొందిన అప్పులతో విదేశీ చెల్లింపుల లోటు సమస్య మరింత పెరిగింది. తెచ్చిన అప్పులకు వడ్డీలు, వాయిదాలు చెల్లించవలసి వుంటుంది. వాటి మొత్తం పెరిగి పోయింది. అది విదేశీ చెల్లింపులలో లోటుకు దారి తీసింది. పైగా ఐఎంఎఫ్‌ షరతుగా విధించిన కొత్త పొదుపు చర్యలతో నిరుద్యోగం మరింత పెరిగింది.
షేక్‌ హసీనా ప్రభుత్వం దెబ్బతినడం వెనుక ఈ ఆర్థిక సంక్షోభం ప్రభావం ప్రధానంగా పనిచేసింది. ఈ సంగతిని కొందరు గుర్తించారు. కాని దానికి కారణం హసీనా ప్రభుత్వం కొందరు ఆశ్రిత పెట్టుబడిదారులను వెనకేసుకురావడమేనంటూ విశ్లేషిస్తున్నారు. మరికొందరు ప్రభుత్వం అమలు చేసిన రిజర్వేషన్‌ విధానం ముఖ్య కారణం అంటున్నారు. బంగ్లాదేశ విముక్తి పోరాటంలో పాల్గొన్న సైనికుల సంతానానికి రిజర్వేషన్లు ఉద్యోగాలలో కల్పించడం పట్ల వ్యతిరేకత తలెత్తింది. అయితే దీన్నే ప్రధాన కారణంగా చూపించడం అంటే అసలు సమస్యను పక్కకు తప్పించడమే. అసలు రిజర్వేషన్లకు వ్యతిరేకత రావడానికి కారణం అక్కడ పెరిగిపోతున్న నిరుద్యోగం.సంక్షో భానికి కారణం బంగ్లాదేశ్‌ తన ఆర్థిక వ్యూహాన్ని మొత్తంగా ఎగుమతుల పెంపు అనే అంశం చుట్టూ రూపొందించడం. అది కూడా నయా ఉదారవాద చట్రానికి లోబడిన వ్యూహం. సంక్షోభానికి మూలకారణం ఈ ఆర్థిక వ్యూహంలోనే ఉంది.
ఈ వ్యూహం కొద్దికాలం పాటు చాలా నాటకీయంగా విజయవంతమైన ఫలితాలను రాబట్టవచ్చు. కాని ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తంగానే మందగిస్తున్నప్పుడు ఎగు మతులు దెబ్బ తినకమానవు. ఇక ఉక్రెయిన్‌ యుద్ధం వంటి ప్రతికూల పరిణామాలు అంతర్జాతీయ రంగంలో తలెత్తితే దాని పర్య వసానాలు కూడా ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీస్తాయి.ఆర్థిక వ్యూహం విజయవంతంగా నడిచిన కాలంలో వేసిన ముందడుగులు కూడా నిష్ప్ర యోజనమై, ఆర్థిక వ్యవస్థ చాలా వెనక్కి జారి పోతుంది. బంగ్లాదేశ్‌ అనుభవం నుండి నేర్చుకోవలసినవి రెండు గొప్ప గుణపాఠాలు ఉన్నాయి. మొదటిది: విజయ వం తంగా పురోగమిస్తున్న ఒక మూడవ ప్రపంచదేశ ఆర్థిక వ్యవస్థ ఒక విఫలమైన వ్యవస్థగా పడిపోవడం ఒక హఠాత్‌ పరిణా మంగా జరగడం. రెండవది: దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక రంగంలో ఎదురయే సమస్యలు అక్కడికే పరిమితం కాకుండా అన్ని రంగాలనూ కష్టాల్లోకి నెట్టడం.
కేవలం ఎగుమతును పెంచుకోవడం మీదనే బంగ్లాదేశ్‌ కేంద్రీకరించడం వల్లనే ఈ కష్టాలు వచ్చాయని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. పైగా ఆ ఎగుమతుల్లో కూడా కేవలం దుస్తుల ఎగుమతుల మీదే కేంద్రీకరిం చడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు. దుస్తులతో బాటు ఎగుమతుల్లో వివిధ సరుకులను చేర్చివుంటే ఇలా జరిగేది కాదం టున్నారు. మరికొందరు ఎగమతుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని దేశంలో వివిధ పరిశ్రమల ఏర్పాటుకు మళ్లించి మొత్తంగా ఆర్థిక వ్యవ స్థను బలపరిచి వుండాల్సిందని అంటున్నారు. ఈ విమర్శలు చేసేవారు ఒక విషయాన్ని విస్మరిస్తున్నారు. నయా ఉదారవాద ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వం జోక్యం కల్పించుకోగల సామర్ధ్యాన్ని కోల్పోతుంది. దేశీయంగా పరిశ్రమలను ప్రోత్సహించాలంటే అంతర్జాతీయ పోటీ నుండి ఆ పరిశ్రమలకు రక్షణ కల్పించాలి. కాని అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి అటువంటి రక్షణ చర్యల పట్ల కన్నెర్ర చేస్తుంది. ఆ అంతర్జాతీయ పెట్టుబడి సహకారం లేకపోతే ఎగుమతులు కాస్తా దెబ్బతింటాయి. అంతేకాదు. అంత ర్జాతీయ మార్కెట్‌లో ఏయే సరుకుల ఎగుమతులు నిలదొక్కు కోవాలన్నది అంతర్జా తీయ పెట్టుబడి నిర్ణయిస్తుందే తప్ప ఆయా దేశాల ప్రభుత్వాలు కావు. అందుచేత బంగ్లాదేశ్‌లో అను సరించిన ఎగుమతుల- ఆధారిత అభివృద్ధి వ్యూహం దెబ్బతిని పోవడానికి కేవలం అక్కడి ప్రభుత్వమే కారణం అని నిందించడం సరికాదు.
ఇప్పుడు మహమ్మద్‌ యూనస్‌ ఉద్దేశాలేమైనా, విద్యార్ధుల ఉద్దేశాలేమైనా, అక్కడ జరగబోయే ఎన్నికల్లో షేక్‌ హసీనా నేతృత్వంలోని అవామీలీగ్‌ పార్టీని పోటీ చేయడానికి అనుమ తించకపోతే…ప్రస్తుత రాజకీయ సంక్షోభ పరిస్థి తుల నుండి లాభం పొందేది మాత్రం అక్కడి మితవాద పార్టీలే. అక్కడ మిత వాద శక్తులు బలపడితే అది అమెరికాకి ఆనంద దాయకంగా ఉంటుంది. దేశీయ కార్పొరేట్‌ గద్దలకూ అది ఆనందదాయకమే. ప్రస్తుతం ప్రపంచంలో ఆవిష్కరించ బడుతున్న కొత్త దృశ్యాన్ని బంగ్లాదేశ్‌ పరిస్థితులు మన ముందు చూపిస్తున్నాయి.
ప్రపంచ పెట్టుబడిదారీ సంక్షోభం వలన నయా ఉదారవాద విధానాలను అమలు చేసే మూడో ప్రపంచ దేశాలో ఎక్కువ భాగం ఆర్థిక మాంద్యంలోకి నెట్టబడుతున్నాయి. నిరుద్యోగం తీవ్ర స్థాయికి చేరడం, విదేశీ రుణాలు పెరిగి పోవడం కనిపిస్తున్నది. ఏవైనా దేశాల్లో సాపేక్షంగా స్వయం నిర్ణయాధికారాన్ని నెరపగలిగే స్థితిలో మధ్యేవాద ప్రభుత్వాలు ఉన్నా, అవి ప్రజా బాహుళ్యంలో తమ పలుకుబడిని కోల్పో తున్నాయి. వాటిని దించి ఆ స్థానాల్లో తనకు అనుకూలంగా ఉండే మితవాద ప్రభుత్వాలను తీసుకురాగల శక్తి సామ్రాజ్య వాదానికి పెరిగింది. ఇలా ఏర్పడే కొత్త ప్రభుత్వాలు అంతకు ముందున్న ప్రభుత్వాలకన్నా నియంతృత్వంగా నడిచేవే. ఇవి నయా ఉదారవాద మార్గాన నడవడంతోబాటు, ప్రజల ఆలోచ నలను మతతత్వం వైపో, మరో విధంగా ప్రజల్లోనే ఒక మైనా రిటీ తరగతిని మెజారిటీ ప్రజలకు శత్రువులుగా చిత్రీకరించే విద్వేష రాజకీయాల వైపో మళ్లిస్తాయి. ”బొమ్మ పడితే గెలుపు నాది, బొరుసు పడితే ఓటమి నీది” అన్నట్టుగా సామ్రాజ్యవాదం పరిస్థితి ఇప్పుడు ఉంది. నయా ఉదారవాద విధానాల ఫలితంగా ప్రజల్లో తలెత్తే అసంతృప్తి ఫలితంగా ఆ ఉదారవాద విధానాల చట్రాన్ని బద్దలు కొట్టుకుని బయటపడడం జరగదు సరికదా, అవే విధానాలను నయా ఫాసిస్టు నియంతృత్వ ప్రభు త్వాల ఆధ్వర్యంలో మరింత పటిష్టంగా ప్రజల మీద రుద్దే పరిస్థితి వస్తుంది.నయా ఉదారవాదం అనే పిశాచపు అణచివేతను గుర్తించినా, దానిని వదలగొట్టుకోవడం అంతకంతా కష్టతరమౌతుంది.
ఈ నయా ఉదారవాద విధానాల ఉక్కు చట్రాన్ని బద్దలు కొట్టుకుని అధిగమించాలంటే ప్రజలలో కేవలం ప్రభుత్వాల మీద అసంతృప్తి పెరిగితే చాలదు. ఈ విధానాలకు ప్రత్యామ్నా యంగా ఉండే ఆర్థిక వ్యూహాన్ని ప్రజల ముందుంచి దాని సాధన లక్ష్యంగా వారిని సమీకరించాలి. ఆ వ్యూహంలో ప్రభుత్వ జోక్యా నికి ఎక్కువ అవకాశం ఉండాలి. దేశీయ మార్కెట్‌ను బలోపేతం చేసే దిశగా అది ఉండాలి. దేశంలోని ఖనిజాలు, ఇతర సహజవనరుల మీద జాతికి పూర్తి అదుపు ఉండాలి. బంగ్లాదేశ్‌ మరీ చిన్న దేశం ఏమీ కాదు. 17 కోట్ల జనాభా ఉన్న దేశం. కేవలం బయట నుంచి ఒత్తిడి చేయడం ద్వారా అటువంటి దేశంలో నయా ఉదారవాద చట్రంలో ఎగుమతి-ఆధారిత వృద్ధి వ్యూహాన్ని అమలు చేయడం అంత తేలికేమీ కాదు. అక్కడ పాలక వర్గాల సహకారంతోటే దానిని అమలు చేశారు. అయితే, దానికి ప్రత్యామ్నాయంగా అమలు చేయాల్సిన, దేశీయ మార్కెట్‌-ఆధారిత అభివృద్ధి వ్యూహాన్ని అమలు చేయడం కూడా అంత తేలికేమీ కాదు. ఇందుకు ప్రజల మద్దతు చాలా అవసరం. ప్రస్తుతం ప్రపంచ పెట్టుబడిదారీ ఆర్థిక సంక్షోభపు ప్రతికూల పర్యవసానాలను అనుభవిస్తున్న మూడవ ప్రపంచ దేశాల ముందు ఇంతకన్నా వేరే మార్గం లేదు.
(స్వేచ్ఛానుసరణ)

ప్రభాత్‌ పట్నాయక్‌