
నవతెలంగాణ – తొర్రూరు రూరల్
ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఆర్థిక అక్షరాస్యతను కలిగి ఉండాలని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ తొర్రూరు మేనేజర్ అల్లాడ సుజాత అన్నారు. శుక్రవారం మండలంలోని కర్కాల గ్రామంలో ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన కల్పించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ పొదుపును పాటించి ఆర్థికంగా అభివృద్ధి సాధించాలన్నారు. బ్యాంకులో ఉన్న అన్ని పథకాలు, బ్యాంక్ అకౌంట్ వలన ఉపయోగాలు, లోన్ రీ పేమెంట్, ఇన్సూరెన్స్ పథకాలు, డిజిటల్ పేమెంట్స్ యొక్క ప్రాముఖ్యతతో పాటు ఐదు సూత్రాలను క్షుణ్ణంగా వివరించారు. బ్యాంక్ అకౌంట్ కలిగిన ప్రతి ఖాతాదారుడు ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా పథకం 436, ప్రధానమంత్రి సురక్ష బీమా పథకం 20 తో భీమా తీసుకోవాలన్నారు. ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రతి ఏడాది 1000 రూపాయలు చెల్లిస్తే 20 లక్షల ప్రమాద బీమా కింద బ్యాంకులు అందజేస్తాయని తెలిపారు. రైతులు బ్యాంకులో తీసుకున్న రుణాలు, బంగారం రుణాలను సకాలంలో రెన్యువల్ చేసుకోవాలన్నారు. ప్రజలు బ్యాంకులు అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ మహేందర్, బ్యాంక్ మిత్ర పొడిశెట్టి శారద, తదితరులు పాల్గొన్నారు.