– ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రుల పనితీరు
– రైతులు అన్యాయమవుతున్నా పట్టించుకోవడం లేదు
– సమీక్ష పెట్టి రైతులకు నష్టపరిహారం ప్రకటించాలి : ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించిన మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ
తెలంగాణాలో ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు అందినకాడికి వసూలు చేయడం.. ఢిల్లీకి పంపడమే వాళ్ల పనితీరుగా ఉందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని యాద్గార్‌పల్లి గ్రామంలో ఎండిపోయిన పంట పొలాలను ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్‌రావు, కంచర్ల భూపాల్‌రెడ్డితో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సాగు నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో రెండు పర్యాయాలు సాగునీరు ఇచ్చి లక్షలాది ఎకరాలను కాపాడామన్నారు. ఆనాడు ఎస్‌ఎల్‌బీసీ, ఎడమకాల్వ చివరి భూములకు కూడా నీరందించామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదటి పొలానికి కూడా నీరు అందని పరిస్థితి ఉందని, రైతులు కన్నీరు పెట్టుకున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే నీరు ఇచ్చి ఆదుకునేవారని చెప్పారు. పంటలు పండితే రైతులకు రూ.500 ఇవ్వాల్సి వస్తుందనే సాకుతోనే నీరు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేశారని, కనీసం జిల్లా మంత్రులకు కూడా సోయి లేకుండా పోయిందని ఆరోపించారు. మంత్రులకు ఇసుక దందా చేయడం, వసూలు చేయడం ఢిల్లీకి పంపడం మాత్రమే తెలుసని విమర్శించారు. ప్రభుత్వం మిల్లులతో కుమ్మక్కై రైతులకు ద్రోహం చేస్తోందని ఆరోపించారు. రైతులను ఆదుకునేందుకు వెంటనే జిల్లా స్థాయిలో వెంటనే సమీక్ష జరిపి నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా.. కనీసం రెండు తడులకైనా నీరు అందిస్తే పంటలు చేతికొచ్చేవని రైతులు కన్నీరు పెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు కంచర్ల కృష్ణారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు మోసిన్‌ఆలీ, నాయకులు నామిరెడ్డి యాదగిరిరెడ్డి, కరుణాకర్‌రెడ్డి, మట్టపల్లి సైదులు యాదవ్, హాతీరాంనాయక్ తదితరులు ఉన్నారు.