మిల్లర్లతో ఇబ్బందులు లేకుండా చూడాలి

– కేంద్రాల్లో త్వరగా కొనుగోళ్లు పూర్తి చేయాలి
మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పుట్ట శైలజ
నవతెలంగాణ-మంథని: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు రైస్‌ మిల్లర్లతో ఇబ్బందులు లేకుండా చూడాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పుట్ట శైలజ, జిల్లా సివిల్‌ సప్లై అధికారిని కోరారు. మంగళవారం రాత్రి మంథనిలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె సందర్శించగా రైతులు తమ సమస్యలు విన్నవించారు. లారీలు రావడం లేదని, మిల్లర్లు ఇబ్బందులకు గురి చేస్తున్నారని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే ఆమె డీఎస్‌ఓతో ఫోన్‌లో మాట్లాడి సమస్యను వివరించారు. కేంద్రాల్లో త్వరగా కొనుగోళ్లు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆమె వెంట ఎంపీపీ కొండ శంకర్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఎక్కేటి అనంత రెడ్డి, సింగిల్‌ విండో చైర్మన్‌ కొత్త శ్రీనివాస్‌, మున్సిపల్‌ వార్డు కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు ఉన్నారు.
రైతులు ఆందోళన చెందవద్దు
రైతులు పంట అమ్ముకోవడంలో ఆందోళన చెందవద్దని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పుట్ట శైలజ అన్నారు. బుధవారం మంథనిలోని మార్కెట్‌ యార్డును సందర్శించిన ఆమె పోలీసుల సహకారంతో లారీల్లో ధాన్యం తరలించే ఏర్పాట్లు చేపట్టారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుతం లారీల కొరత ఉన్న క్రమంలో జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ నేతృత్వంలో ఇసుక లారీలను ఆపి వాటిలో ధాన్యం తరలించే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. మంథనితో పాటు మండలంలోని ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి పూర్తిస్థాయిలో ధాన్యం తరలించే విధంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఆమె వెంట సింగిల్‌ విండో చైర్మన్‌ కొత్త శ్రీనివాస్‌, జడ్పీటీసీ తగరం సుమలత-శంకర్‌ లాల్‌, తహసీల్దార్‌ బండి ప్రకాష్‌, పెద్దపల్లి జిల్లా ఆర్టీఏ అధికారి రవికుమార్‌, మంథని ఆర్‌ఐ రాజిరెడ్డి, సంఘ కార్యదర్శి మామిడాల అశోక్‌ కుమార్‌, నాయకులు శంకర్‌ లాల్‌, రాజబాబు, పోలీస్‌, రెవెన్యూ అధికారులు, ప్యాడి సూపర్‌వైజర్లు తదితరులు పాల్గొన్నారు.