రాష్ట్రీయ స్వయం సేవక్ సంఫ్‌ు (ఆరెస్సెస్) ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ. హిందూ రాజ్య స్థాపన దాని లక్ష్యం. కానీ అది మోసపూరితంగా ఒక సాంస్కృతిక సంస్థ అని చెప్పుకుంటుంది. అది మన రాజ్యాంగంలో వక్కాణించబడిన భారత జాతీయవాదానికి విరుద్ధంగా హిందూ జాతీయవాదం కోసం కృషి చేస్తుంది. ఇది హిందువులను ఒక జాతిగా పరిగణిస్తుంది కాబట్టి దానికి అనుగుణంగానే తన లక్ష్యాలను నిర్దేశించుకుంది. భారత రాజ్యాంగాన్ని రద్దుచేసి, మనదేశాన్ని హిందూ రాజ్యంగా మార్చాలని బీజేపీకి చెందిన నాయకులు పదే పదే డిమాండ్ చేస్తున్నారు. ఆరెస్సెస్ సర్సంగ్ చాలక్ క.సుదర్శన్ 2000 సంవత్సరంలో ఆరెస్సెస్ అధినేతగా ఎన్నికైన సందర్భంగా ఇదే విషయాన్ని ప్రకటించాడు. బీజేపీ స్వయం సమృద్ధి చెందిందని, ఎన్నికల ప్రచారంలో ఆరెస్సెస్ మద్దతు తమకు అవసరం లేదని, 2024 ఎన్నికలకు ముందు బీజేపీ అధ్యక్షుడు జే.పీ.నడ్డా ప్రకటన చేశాడు. కానీ 2019 ఎన్నికల వరకు బీజేపీకి, ఆరెస్సెస్ మద్దతుగా నిలిచింది. ఆరెస్సెస్ ప్రతిజ్ఞ, ప్రార్థనలు తన లక్ష్యం గురించి మనకు ఏమి చెప్తాయి?
భారతీయ జనతాపార్టీ (బీజేపీ)ని, దాని రాజకీయ సంతతిని రూపొందించడంలో ఆరెస్సెస్ పాత్రను, ఆరెస్సెస్ నాయకుల రచనలు, వారి చర్యల ద్వారా తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు. బీజేపీకంటే ముందుగా ఉన్న భారతీయ జనసంఘ్ స్థాపనలో హిందూ మహాసభ నాయకుడైన శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ, ఆరెస్సెస్‌తో కలిసి పని చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆరెస్సెస్ ప్రధాన సిద్ధాంతకర్త, నాటి ఆరెస్సెస్ అధినేత ఎం.ఎస్.గోల్వాల్కర్ (గురూజీ), జనసంఘ్ లేక బీజేపీలో శిక్షణ పొందిన ఆరెస్సెస్ స్వయం సేవకులు, ప్రచారకుల పాత్రను గురించి వివరించాడు.
గోల్వాల్కర్ ఇలా రాశాడు: ”ఉదాహరణకు, మాలో కొంతమంది స్నేహితులకు వెళ్లి రాజకీయాల్లో పనిచెయ్యాలని చెపితే, వారికి దానిలో ఆసక్తి ఉందని లేదా రాజకీయాలు వారికి ప్రేరణ అని అర్థం కాదు. నీరు లేని చోట చేపలు చనిపోయిన విధంగా వారు రాజకీయాల కోసం మరణించరు. ఒకవేళ రాజకీయాల నుండి విరమించుకోవాలని వారికి చెప్పినా గానీ వారికెలాంటి అభ్యంతరం ఉండదు. వారి విచక్షణతో ఎలాంటి అవసరం ఉండదు.” జనసంఫ్‌ు లేదా బీజేపీ, ఆరెస్సెస్ సూచనలను తప్పకుండా అనుసరించాలనే విషయాన్ని ఇది స్పష్టంగా తెలియజేస్తుంది.
గురూజీ ఇంకా ఇలా చెప్పాడు: ”మా స్వయం సేవకుల్లో కొందరు (కార్యకర్తలు) రాజకీయాల్లో పనిచేసే విషయం మాకు తెలుసు. అక్కడ వారు బహిరంగ సభలు, ప్రదర్శనలకు సంబంధించిన పని చెయ్యాలి, నినాదాలు ఇవ్వాల్సి ఉంటుంది.”
ఆ లక్ష్యాలకు అనుగుణంగానే ఆరెస్సెస్, స్వయం సేవకుల్ని పెంచి పోషించి, శిక్షణ ఇచ్చిన తరువాతనే అనేక సంస్థల్ని ప్రారంభించింది. మహాత్మాగాంధీ హంతకుడైన నాథూరామ్ గాడ్సే ఒక శిక్షణ పొందిన ఆరెస్సెస్ ప్రచారకుడు. ఆరెస్సెస్ సభ్యత్వానికి సంబంధించి ఎలాంటి రికార్డులు ఆ సమయంలో దాచిపెట్టలేదు కాబట్టి గాంధీజీ హత్యకు సంబంధించి ఆధారాలేవీ దొరక్కుండా ఆరెస్సెస్ జాగ్రత్త పడింది. హంతకుడు, ఆరెస్సెస్ ముఖ్యుడైన నాథూరామ్ గాడ్సేను సంఘ్ నుండి బహిష్కరించలేదు లేదా అతడు ఆ సంస్థను వదిలిపెట్టి వెళ్లలేదని నాథూరామ్ గాడ్సే కుటుంబం విశ్వసిస్తుంది.
హిందూ జాతీయవాదంపై విజ్ఞాన సంపన్నుడైన షంసుల్ ఇస్లాం ఇలా పేర్కొన్నాడు: ”ఆరెస్సెస్ కేంద్ర ప్రచురణ సంస్థ అయిన సురుచి ప్రకాశన్, ఝండేవాలన్, న్యూఢిల్లీ 1977లో ‘పరమ్ వైభవ్ కే పాత్ పర్’ అనే గ్రంథాన్ని ప్రచురించింది. దానిలో వివిధ లక్ష్యాల సాధన కోసం ఆరెస్సెస్ స్థాపించిన 40కి పైగా సంస్థల వివరాలను ఇచ్చారు. మూడు ప్రధాన సంస్థల్లో బీజేపీ ఒక రాజకీయ సంస్థగా ఉంది. ఏబీవీపీ, హిందూ జాగరణ్ మంచ్, విశ్వహిందూ పరిషత్, స్వదేశీ జాగరణ్ మంచ్, సంస్కార్ భారతి లాంటి సంస్థలు ఆ జాబితాలో ఉన్నాయి.
అదేవిధంగా ఆరెస్సెస్ ప్రార్థన, ప్రతిజ్ఞలు, సంఘ్ అనుచరులు హిందూ దేశానికి కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేస్తాయి. ఆరెస్సెస్ ప్రార్థన ఇలా: ”ఓ ప్రభువా, హిందూ రాజ్యంలో అంతర్భాగంగా ఉన్న మేము నీకు గౌరవంతో వందనం చేస్తున్నాం/నీ కోసం మేము నడుం బిగించాం/దీని సాధన కోసం మాకు మీ ఆశీర్వాదాలివ్వండి.” ప్రతిజ్ఞ కూడా అంతే సూటిగా ఉంది: ”నా పవిత్రమైన హిందూ మతం, హిందూ సమాజం, హిందూ సంస్కృతిని పెంపొందించడం ద్వారా భారతవర్ష గొప్పతనాన్ని సాధించడానికి నేను ఆరెస్సెస్ సభ్యుడిని అయ్యాను.”
ఆరెస్సెస్ ఒక ‘సాంస్కృతిక సంస్థ’ అనే ముసుగు, అనేకమంది భావోద్వేగాలను ఆకర్షించడం ద్వారా ఆరెస్సెస్ విస్తరించడానికి ఉపయోగపడుతుంది. ఆరెస్సెస్ స్వభావం గురించి స్వాతంత్య్ర ఉద్యమ పోరాటంలో పాల్గొన్న ముఖ్యమైన నాయకులకు స్పష్టత ఉంది. పంజాబ్ శరణార్థుల కోసం వాఘా వద్ద ఏర్పాటు చేసిన ఒక ప్రధాన రవాణా శిబిరంలో ఆరెస్సెస్ కార్యకర్తలు ప్రదర్శించిన వారి సామర్థ్యం, క్రమశిక్షణ, ధైర్యసాహసాలను గాంధీజీ పరివారంలోని ఒక సభ్యుడు ప్రశంసించాడు.’హిట్లర్ నాజీలు, ముస్సోలినీ నాయకత్వంలోని ఫాసిస్టులు కూడా అలానే ఉంటారనే’ విషయాన్ని మర్చిపోకూడదని గాంధీజీ వెంటనే తిరిగి చమత్కరించాడు. ఆరెస్సెస్, ఒక నిరంకుశ దృక్పథం గల మత సంస్థ అని గాంధీ వర్ణించాడు.
ఆరెస్సెస్‌కు ఫాసిజం లక్షణాలు ఉన్నాయని నెహ్రూ అభిప్రాయం. ”ఆరెస్సెస్ చాలా రహస్యంగా ఉంటుంది. దాని ఫలితంగానే అది ఫాసిస్ట్ మార్గాల్లో అభివృద్ధి చెందింది. అది కచ్చితంగా ప్రజల శాంతియుత సహజీవనానికి విఘాతం కలిగిస్తుందని” భారత ప్రథమ రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ అభిప్రాయపడ్డాడు.
సర్దార్ వల్లభారు పటేల్ ఇలా అన్నాడు: ”గాంధీజీ హత్య కేసుకు సంబంధించి మా వద్ద ఉన్న నివేదికల ప్రకారం ఆరెస్సెస్, హిందూ మహాసభల కార్యకలాపాల ఫలితంగా ముఖ్యంగా ఆరెస్సెస్ కార్యకలాపాలు దేశంలో ఇలాంటి ఘోరమైన విషాదం చోటు చేసుకునే వాతావరణాన్ని సృష్టించాయి.
ఆరెస్సెస్ కార్యకలాపాలు ప్రభుత్వం, రాజ్యం ఉనికికి ముప్పును కలిగించాయి. నిషేధం విధించినప్పటికీ కూడా ఆ కార్యకలాపాలు తగ్గుముఖం పట్టలేదని మా నివేదికలు చెబుతున్నాయి. వాస్తవానికి, సమయం గడిచేకొద్దీ ఆరెస్సెస్ వర్గాలు మరింత ధిక్కారాన్ని ప్రదర్శిస్తూ, విధ్వంసపూరిత చర్యలకు పాల్పడుతున్నాయి.”
ఆరెస్సెస్ మూడుసార్లు నిషేధించబడి, సాంస్కృతిక సంస్థ అనే ముసుగును ధరించడం ద్వారా ఆ నిషేధం నుండి బయటపడిన విషయాన్ని మనం గుర్తుచేసుకోవాలి. ప్రభుత్వోద్యోగులు రాజకీయాల్లో పాల్గొనడంపై విధించిన నిషేధం, మన(బ్యూరోక్రసీ) ఉద్యోగస్వామ్యం రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉందనీ, రాజకీయ పక్షపాతం లేకుండా ఉందనే విషయాన్ని నిర్ధారిస్తుంది. ఆరెస్సెస్ కార్యక్రమాల్లో పాల్గొనే ప్రభుత్వోద్యోగులపై విధించిన ఈ నిషేధం యాభై సంవత్సరాలకు పైగా అమలులో ఉంది. ఇలా జరగడం ఇది మూడోసారి.
జనతాపార్టీ, అటల్ బిహారీ వాజపేయిలు కూడా రాజకీయ వ్యవహారాలకు నాయకత్వం వహించారు కానీ ఈ నిషేధాన్ని ఎత్తివేయలేదు. నరేంద్ర మోడీ గడిచిన పది సంవత్సరాలకు పైగా అధికారంలో ఉంటున్నాడు. ఆయన ఇప్పుడు ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంటున్నాడు? ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్, అత్ున్నత నాయకుని పై విమర్శలు చేస్తున్న తరువాతే ఈ నిర్ణయమా? భారతీయ సంస్కృతికి, ఆరెస్సెస్ అందిస్తున్న సేవలను సాంస్కృతిక కార్యకర్తలు, సామాజిక శాస్త్రవేత్తలు అంచనా వేయాల్సిన అవసరం ఉంది. ఆరెస్సెస్ ఒక సాంస్కృతిక సంస్థ అనే ముసుగును తొలగించి, భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం దాని రాజకీయ ఎజెండాను అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది అత్యున్నతమైన రాజకీయ వేషం.
(”ఇండియన్ కరెంట్స్” సౌజన్యంతో)
అనువాదం: బోడపట్ల రవీందర్, 9848412451
– రామ్ పునియానీ