‘ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క…’ అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఒక విషయంలో దూకుడుగా వ్యవహరిస్తోంది. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలో చెరువులు, కుంటలను ఆక్రమించి పలు నిర్మాణాలు చేపట్టిన కబ్జారాయుళ్ల భరతం పడుతోంది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ (హైడ్రా) పేరిట ఓ సంస్థను ఏర్పాటు చేసిన సర్కారు… శరవేగంతో అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తోంది. సీనియర్ ఐపీఎస్ రంగనాథ్ నేతృత్వంలోని ఈ సంస్థ సినీనటుడు నాగార్జునకు చెందిన ఎన్- కన్వెన్షన్‌తోపాటు కాంగ్రెస్ సీనియర్ నేత పల్లంరాజు, మరికొందరు బడా బాబులు బఫర్ జోన్లు, ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మించిన పలు అక్రమ నిర్మాణాల పని పట్టిన సంగతి విదితమే. ఇదే ఊపులో జన్వాడలో మాజీ మంత్రి కేటీఆర్‌కు చెందినదిగా చెప్పుకుంటున్న ఫామ్ హౌస్‌ను కూడా రేపోమాపో కూల్చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. ప్రతిగా ఆయన కూడా సీఎం రేవంత్‌తోపాటు మంత్రి పొంగులేటి, కాంగ్రెస్ సీనియర్లు మధుయాష్కీ గౌడ్, వివేక్, పట్నం మహేందర్‌రెడ్డి తదితరులకు చెందిన పలు నిర్మాణాలు కూడా చెరువులను ఆక్రమించి కట్టినవేనంటూ ఆరోపిం చటం మాటల యుద్ధానికి దారితీసింది. కాంగ్రెస్ నేతలు సైతం ‘నిబంధనలకు విరుద్ధంగా మా నిర్మాణాలుంటే దగ్గరుండి మరీ కూల్చివేయిస్తాం…’ అంటూ ప్రతి సవాళ్లు విసురుకోవటం ఇప్పటిదాకా జరిగిన కథ.
వాస్తవానికి ఉమ్మడి రాష్ట్రంలో ఒక్క హైదరాబాద్‌లోనే కాకుండా అనేక జిల్లాలు, మున్సిపాల్టీల్లోని చెరువులు, కుంటలు, నాలాలు కబ్జాకు గురయ్యాయన్నది కాదనలేని సత్యం. తెలంగాణ వచ్చిన తర్వాత వీటన్నింటినీ రక్షిస్తాం, పరిరక్షిస్తామంటూ కేసీఆర్ సర్కారు గొలుసుకట్టు చెరువుల కోసం ‘మిషన్ కాకతీయ’ను చేపట్టింది. దాంతో ప్రయోజనాలు ఒనగూరినా ‘కమీషన్ కాకతీయ’ అనే అపవాదును కూడా మూటగట్టుకోవటం కొసమెరుపు.
హైదరాబాద్ పరిధిలోని అయ్యప్ప సొసైటీ కిందికి వచ్చే ప్రాంతంలో చెరువును అక్కినేని నాగార్జున ఆక్రమించి ఎన్-కన్వెన్షన్‌ను నిర్మించారనే ఆరోపణలతో దాన్ని కూల్చివేసేందుకు అప్పట్లో బుల్డోజర్లు సైతం వెళ్లాయి. కానీ ఏం జరిగిందో తెలియదుగానీ… అవి వెంటనే వెనక్కి వచ్చేశాయి. అప్పటి నుంచి ఇప్పటి దాకా పదేండ్ల కాలంలో దాన్ని ఎవ్వరూ ముట్టుకోలేదు. అంతేకాదు… ఇప్పుడు హైడ్రా కూల్చేస్తామని చెబుతున్న అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన అనేకమంది నేతల అక్రమ నిర్మాణాలకు కూడా బీఆర్‌ఎస్ హయాంలోనే అనుమతులొచ్చిన విషయాన్ని మనం గుర్తెరగాలి. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ‘అందరూ శాఖాహారులే అయితే.. రొయ్యల బుట్ట ఎలా మాయ మైంది…’ అన్నట్టు కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ నేతలందరూ ‘మావి అక్రమ నిర్మాణాలైతే దగ్గరుండి కూల్చేయిస్తాం…’ అని చెప్పటం వింతల్లో మరీ వింతలాగా ఉంది. అందరూ చెరువు శిఖం భూములు, ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మాణాలు చేపడితే ఎంఐఎం ఓవైసీ సోదరులు ఏకంగా సల్కం చెరువులోనే విద్యా సంస్థను నెలకొల్పటం పలు వివాదాలకు తావిచ్చింది. ఈ క్రమంలోనే హైడ్రా కమిషనర్ రంగనాథ్…’మాకు అక్బరుద్దీన్ అయినా ఒకటే, మల్లారెడ్డి అయినా ఒకటే…’ అని చెప్పటం సామాన్యుల్లో ఆ సంస్థ పట్ల విశ్వసనీయతను పెంచింది. అందుకే హైదరాబాద్‌లో మాదిరిగానే రాష్ట్రమంతటా కబ్జాలకు గురైన చెరువులు, కుంటలను కాపాడాలి, అందుకోసం హైడ్రా తరహాలోనే ప్రత్యేక సంస్థలను ఏర్పాటు చేయాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. అంటే నీటి వనరుల ఆక్రమణలతో హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకూ ప్రజలు ఎంతగా విసిగిపోయారో, ఎన్ని ఈతి బాధలు పడ్డారో అర్థం చేసుకోవచ్చు.
అయితే హైడ్రాపై ‘అదేముందిలే, మబ్బుల్లో పుట్టి మబ్బుల్లోనే పోతుంది…’ అనే రాజకీయ విమర్శలు కూడా వెల్లువెత్తుతుండటం గమనార్హం. కాంగ్రెస్, ఇంకా చెప్పాలంటే ముఖ్యమంత్రి రేవంత్ తన రాజకీయ ప్రత్యర్థులను లొంగదీసుకునేందుకు, వారి ఆర్థిక మూలాలను దెబ్బతీసేం దుకే ఈ సంస్థను ఏర్పాటు చేశారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇలాంటి వ్యాఖ్యానాలు, కామెంట్లన్నింటికీ చెక్ పెట్టాలంటే ఆక్రమణదారులు ఎంతటివారైనా సరే, వదిలిపెట్టకుండా కూల్చివేతలు కొనసాగించటం ద్వారా హైడ్రా తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సి ఉంటుంది. రాజకీయ ప్రమేయం కాని, లేని నిఖార్సయిన సంస్థ అనే విధంగా అది తన సత్తా చాటాలి. తద్వారా ఇది పొలిటికల్ ‘హైడ్రా’మా కాదని చెప్పగలగాలి. అలా చాటగలిగినప్పుడే ప్రభుత్వానికి, హైడ్రాకు ప్రజల మద్దతు ఉంటుంది. హైడ్రాతో సంబంధం లేకపోయినా హైదరాబాద్‌లోని మూసీ పరివాహక ప్రాంతంలో నాలాల పక్కనున్న పన్నెండు వేల కుటుంబాలను కూడా తరలించనున్నారనే వార్తలు వెలువడుతున్న వేళ… వారందరికీ నష్టపరిహారం, పునరా వాసం తదితరాంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి, పరిష్కరించాల్సిన అవసరముంది.