నవతెలంగాణ సూర్యాపేట కలెక్టరేట్
ప్రభుత్వ హాస్పిటల్స్ ను బలోపేతం చేస్తూ, ప్రయివేటు హాస్పిటల్స్ మెడికల్ మాఫియాను అరికట్టాలని పిఓడబ్ల్యు జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పివైఎల్ జిల్లా నాయకులు వాస కరుణాకర్ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయం ముందు పిఓడబ్ల్యు, పివైఎల్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్పటల్ బలోపేతం చేయాలని, ప్రభుత్వ హాస్పిటల్స్లలో మెడికల్ మాఫియాను అరికట్టాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ హాస్పిటల్స్ లలో కనీస సౌకర్యాలు కరువయ్యాయని, డాక్టర్ల నిర్లక్ష్యం వలన రోగులు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కనీస సౌకర్యాలు లేక మహిళలు చిన్నపిల్లలు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. నూటికి ఎనభై శాతం మందులు హాస్పిటల్ లో కాకుండా బయట నుంచి తెచ్చుకోవాల్సి వస్తుందని దీని వలన రోగులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ, ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ హాస్పిటల్స్లో ఈసీజి చేసేవారు లేక వార్డ్ బాయ్స్ చేత ఈసీజీ చేయిస్తున్నారని, అందువలన సరైన రోగ నిర్ధారణ కాక ప్రజలు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఆరోపించారు. మాతా శిశు విభాగం దగ్గర నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణంలో కాంట్రాక్టర్ సరియైన రక్షణ చర్యలు తీసుకోకపోవడం మూలాన.. ప్రజలు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఆరోపించారు.వెంటనే కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్స్ లలో కూడా కనీస శుభ్రత పాటించడం లేదని, మెడిసిన్ పై విపరీతమైన రేట్లు వేస్తూ ప్రజలను దోపిడి చేస్తున్నారని ఆరోపించారు. ప్రైవేట్ హాస్పిటల్స్ వారు పిఆర్ఓ వ్యవస్థ ద్వారా ప్రజలను విపరీతంగా దోచుకుంటున్నారని, వెంటనే పిఆర్వో వ్యవస్థను రద్దు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ హాస్పిటల్ లో సౌకర్యాలు మెరుగుపరచకుండా, ప్రైవేట్ మెడికల్ మాఫియాను అరికట్టకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే రాబోయే రోజులలో మా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.అనంతరం డిఎంహెచ్ఓ కోటాచలంకి వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యు జిల్లా అధ్యక్షులు మారసాని చంద్రకళ, ఉపాధ్యక్షులు సూరం రేణుక,సహాయ కార్యదర్శి సంతోషిమాత,కోశాధికారి మోటకట్ల జయమ్మ, జిల్లా కమిటీ సభ్యులు ఐతరాజు పద్మ, హుజూర్నగర్ డివిజన్ అధ్యక్ష,కార్యదర్శులు లక్ష్మి, పావని, ఉపాధ్యక్షులు సయ్యద్ రేష్మ, కోశాధికారి శ్యామల పివైఎల్ జిల్లా నాయకులు గోగుల వీరబాబు, సైదులు, చిట్టి, శ్రీదేవి, గుండగాని రేణుక, పుప్పాల సైదమ్మ తదితరులు పాల్గొన్నారు.