పోలీసుల ఆత్మహత్యలు ప్రభుత్వానికి పట్టవా?

– మాజీమంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పోలీసుల ఆత్మహత్యలు ప్రభుత్వానికి పట్టింపు లేదా? అని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆదివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ములుగు జిల్లాలో ఎస్సై, సిద్దిపేటలో కానిస్టేబుల్‌ కుటుంబం, కామారెడ్డిలో ఎస్సై , కానిస్టేబుల్‌, ఆదివారం సిరిసిల్లలో కానిస్టేబుల్‌ కుటుంబం, మెదక్‌ కుల్చారంలో హెడ్‌ కానిస్టేబుల్‌… వీరంతా స్వల్ప కాలంలో పోలీసులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులే వరుసగా ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నదని పేర్కొన్నారు. శాంతి భద్రతలు పరిరక్షించవలసిన రక్షకుల జీవితాలకే రక్షణ కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. పని ఒత్తిళ్లు, పెండింగ్‌ హామీలను తీర్చడంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి పోలీసులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నదని తెలిపారు. ఈ ఆత్మహత్యలపై నిజానిజాలు వెలుగులోకి రావడానికి శాఖాపరమైన దర్యాప్తు చేయాలని తెలంగాణ డీజీపీని కోరినట్టు తెలిపారు.