ప్రధాని వెళ్లి, చీఫ్‌ జస్టిస్‌ ఇంట్లో పూజలు చేయడమా?

Should the Prime Minister go and worship at the Chief Justice's house?కుళ్లు బుద్ది ఎంత తగ్గింది అనేదాన్ని బట్టి,
వివేకం ఎంత పెరిగింది? – అనేది కొలవొచ్చు – బౌద్ధ ధమ్మం.
అన్నీ ఆ దేవుడే చూసుకుంటాడనే నమ్మకం ఉన్నవారు తమ నిజజీవితంలో లాలూచి పడటం, కాకా పట్టడం, లంచా లివ్వడం – తీసుకోవడం, గిమ్మిక్కులు చేయడం, అబద్దాలు చెప్పడం, కుట్రలు, కుతంత్రాలు పన్నడం మొత్తానికి మొత్తంగా ఆపేయాలి కదా? పైపైకి ఎదగడానికి ఉన్న ఆవినీతి మార్గాలన్నీ మూసేసుకోవాలి కదా? ఎవరైనా అలా చేయగలుగుతున్నారా? అన్నీ ఆదేవుడే చూసుకునేట్లయితే వీళ్లు ఎందుకు తాపత్రయపడుతున్నారు మరీ? ఏ మతస్థుడైనా సరే-తాము నమ్ముకున్న ఆ దేవుడు తమకు ఎందుకు అన్నీ సమకూర్చడం లేదూ? ఒళ్లొంచి పనిచేస్తేనే కదా కూలి డబ్బులొస్తున్నాయి. నెలంతా బండచాకిరి చేస్తేనే కదా జీతమొస్తొంది? తెలివి ఉపయోగించి వ్యాపారం చేస్తేనే కదా లాభాలొచ్చేది? మనుషులుగా వాళ్లు తమ కృషిని తాము తక్కువగా అంచనా వేసుకుంటూ, ఎక్కడా లేని ఏదో శక్తి తమకు ఆధారమౌతోందనుకుంటే ఏమన్నమాట? దానికే ‘భక్తి’ అని పేరుపెట్టి, ఆత్మద్రోహం చేసుకుంటు న్నారన్న మాట! తమ కష్టార్జితం తమకు దక్కిందనే ఆత్మవిశ్వాసం వారికి ఉండటం లేదన్నమాట!
ఒక్కసారి చీఫ్‌ జస్టీస్‌ ఆఫ్‌ ఇండియా చంద్రచూడ్‌, భారత ప్రధాని నరేంద్రమోడీ కలిసి చేసిన ఇటీవలి గణేష్‌ పూజ గురించి ఆలోచిద్దాం! నిజంగానే వారికి ఆ దేవుడి మీద అంత భక్తి శ్రద్ధలున్నాయా? లేక వారి పూజ వెనక మరేదైనా ఉద్దేశం ఉందా? సామాన్యులైన సగటు మనుషుల్ని పక్కన పెడదాం. ఎందుకంటే వారు ఇతరులను ప్రభావితం చేయలేరు. కానీ, ఉన్నత విద్యావంతులు, వైజ్ఞానికులు, రాజ్యాంగ బద్ధమైన అత్యున్నత పదవుల్లో ఉన్నవారు, వారి విశ్వాసాల్ని ప్రజాజీవితంలో ప్రదర్శనకు పెట్టకుండా ఉంటే మంచిది. అలా ప్రదర్శించడం వల్ల సామాన్య ప్రజలు ప్రభావితులవుతారు. పైగా, జరిగే మేలుకంటే, సమాజానికి జరిగే కీడే ఎక్కువగా ఉంటుంది. రాకెట్‌, సైంటిస్ట్‌గా పేరు తెచ్చుకున్న అబ్దుల్‌ కలాం బాబాలు, స్వాముల కాళ్ల మీదపడి – తనను, తన పదవిని, దేశ రాజ్యాంగాన్ని, దేశ ప్రజల ఆత్మ గౌరవాన్ని…అన్నింటినీ దిగజార్చారు. ఇలాంటి ఉదాహరణలు దేశంలో ఎన్నయినా చెప్పుకోవచ్చు. మతాన్నీ, మనువాదాన్ని ఆయుధాలుగా చేసుకుని, దేశ ప్రజల్ని విభజించిన ప్రధాని మోడీ, అంతర్జాతీయ వేదికల మీద ఘోరంగా అవమానాలకు గురయ్యారు. తనకు తానై చీఫ్‌ జస్టిస్‌ చంద్రచూడ్‌ ఇంటికి వెళ్లి, ఆయన ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా గణపతి పూజ చేసి – ఈ దేశ ప్రజలకు ఏమి సందేశమిచ్చారూ? ‘ఎంతటి వారినైనా సరే- నేను నా వలలో పడేసుకుంటాను’ అని చెప్పదలిచారా? మతాన్ని, దేవుణ్ణీ-తన నీచ రాజకీయాలకు, సరైన సమయంలో సరైన విధంగా ఉనయోగించుకుంటాను- అని ప్రకటించారా?
దేశ ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు. చీఫ్‌ జస్టిస్‌ చంద్రచూడ్‌కు ముందు 46వ చీఫ్‌ జస్టిస్‌గా పనిచేసిన రంజన్‌ గొగోయ్‌ బీజేపీ ప్రభుత్వంతో లాలూచీ పడి, ప్రభుత్వ పెద్దలు కోరుకున్న తీర్పునిచ్చారు. పదవిలో నుంచి దిగి పోగానే రాజ్యసభ సభ్యుడైపోయారు. దానితో ఆయనేమైనా సంతోషపడ్డారా? లేదే-ప్రభుత్వానికి అనుకూలంగా అంత పెద్ద తీర్పునిస్తే నాకు ఇంత చిన్న పదవి కట్టబెడతారా? అని అలిగి నోరు మూసుకుని కూర్చున్నారు. తప్పుడు పని ఎప్పుడైనా తప్పుడు పనే -బాబ్రీ మసీదు భూవివాదంలో ”మసీదును కులగొట్టడం ఒక నేరం-ఘోర తప్పిదం” అని సుప్రీంకోర్టు తీర్పులో ఉంది. ఆ మాట అంత స్పష్టంగా రాసినా గొగోయ్‌ ”నేరగాళ్ల”కు ఆ భూమిని కట్టబెట్టారు. అంటే బాబ్రీమసీదును కూలగొట్టిన దుండగులకే దాన్ని అప్పగించారు… కదా? అక్కడే మోడీ ప్రభుత్వం రామాలయం నిర్మించింది. ఇంత అక్రమమైన తీర్పు ప్రకటించిన గొగోయ్‌ న్యాయమూర్తుల బృందంలో డి.వై. చంద్రచూడ్‌ కూడా ఉన్నారు. ఆ తీర్పు మీద చంద్రచూడ్‌ సంతకం కూడా ఉంది. ఇప్పుడు మోడీ ఇంటికొస్తే అనుమతించి ఆయనతో తన ఇంట్లో గణపతి పూజ చేయించు కుంటారా? ఒక రాజకీయ నాయకుడు ఒక చీఫ్‌జస్టిస్‌ కలిసి పూజలు చేస్తుంటే ఈడి, సిబిఐ, ఐటి వ్యవస్థలతో పాటు దేశంలోని న్యాయవ్యవస్థ కూడా అమ్ముడై పోయిందన్న భావన దేశ ప్రజల్లో కలగదా? దేశ ప్రజలు ఇక న్యాయం కోసం ఎక్కడికి వెళ్లాలీ?
గొప్ప అజ్ఞానిగా మోడీ ప్రతిభ విశ్వవ్యాప్తమైనప్పుడు. ఆయనా, ఆయన పార్టీ, ఆరెస్సెస్‌ అంతా కలిసి దేశంలో మారణకాండలు సృష్టించడంలో సిద్ధహస్తులని తెలిసినపుడు, చీఫ్‌ జస్టిస్‌గా ఉన్నవారు ఎంత జాగ్రత్తగా ఉండాలీ? తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులివ్వకుండా ఉంటే, భవిష్యత్తులో మంచి పదవి ఇస్తానని చెప్పడానికి మోడీయే గణేష్‌ పూజను అవకాశంగా తీసుకున్నారా? దేశ ప్రజలకు ఎన్నెన్నో అనుమానాలున్నాయి. జస్టిస్‌ చంద్ర చూడ్‌ పదవీ విరమణ చేయగానే ఆయనకు ఏ పదవి దక్కనుందో చూడాలి.
దేశంలో మత ఉగ్రవాదం పెచ్చరిల్లి పోవడానికీ, దేశం ఆర్థికంగా దిగజారి పోవడానికీ, ఆర్థిక నేరగాళ్లు దేశం విడిచి పారిపోవడానికీ గత పదేండ్లుగా అధికారంలో ఉన్న మోడీ అహంకార ప్రభుత్వమే కారణం! ఉద్యమాలలో వందల సంఖ్యలో రైతులు ప్రాణత్యాగాలు చేస్తే స్పందన ఉండదు. తాము జరిపించిన మారణకాండలకు జవాబుదారీ తనం లేదు. ఇతర రాజకీయ పార్టీలు రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే ఓర్వలేని తనం. పార్టీలను చీల్చి, అవినీతిపరుల్ని తమ పార్టీలో చేర్చుకోవడం. మీడియాతో సహా వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేయడం. దేశంలో మోడీ ప్రభుత్వం సాధించినవి (అప)జయాలు! వీటన్నిటికి తోడుగా ఇప్పుడు న్యాయవ్యవస్థను లోబరుచుకోవడాన్ని ఈ దేశ ప్రజలు స్పష్టంగా గమనించారు. అర్థం చేసుకున్నారు.
భక్తి దేశభక్తి వంటి మాటలతో జనాన్ని ఎంతకాలమైనా మోసం చేయగలమన్న భ్రమలో బీజేపీ వారున్నారు. సహజంగా ఈ దేశ ప్రజలకు సహనం ఎక్కువ. అది గనక కట్టలు తెంచుకుంటే దాన్ని అపేశక్తి ఎవరికీ ఉండదు. ఆ విషయం ఆధికారంలో ఉన్నవారు గ్రహించుకోవడం లేదు. 2007లో సంఝోతా ఎక్స్‌ప్రెస్‌లో బాంబుదాడులు చేసి, అరవై ఎనిమిది మంది మరణానికి కారణమైన కిరాతకుడు (స్వామి) అసీమానంద కారవాన్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అసలు విషయం ఒప్పుకున్నాడు. తాము ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌భగవత్‌ అనుమతితోనే ఆ ఘాతుకానికి పాల్పడ్డామని చెప్పాడు. 2005లో సూరత్‌లో జరిగిన ఆరెస్సెస్‌ సమావేశాలలో మోహన్‌ భగవత్‌, ఇంద్రేష్‌కుమార్‌లు అసీమానంద్‌ను, అతని సహచరుడు సునీల్‌ జోషిని కలిసి – ముస్లింలపై బాంబుదాడులు చేసేందుకు పథకాలు అందించారు. ఇది ఒక చిన్న ఉదాహరణ! ఈ పదేండ్లలో ఇలాంటి సంఘటనలు మన దేశంలో లక్షల్లో జరిగి ఉంటాయి. ఇంతెందుకూ జస్టిస్‌ లోయను చంపించినవాడు దేశానికి హోంమంత్రి అవుతాడు. ఇదెక్కడి ధర్మం? ఇంకెక్కడి న్యాయం? మరి న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థా ఏం చేసినట్టూ? ‘హూకిల్డ్‌ జస్టిస్‌ లోయా?’ అనే పుస్తకం ప్రకటించిన రచయిత అమెరికా వైట్‌ హౌస్‌ ముందే నిరసన తెలియజేస్తూ ప్రసంగించాడు కదా? ప్రపంచ మీడియా దాన్ని విశ్వవాప్తం చేసింది కదా? నా అంతటివారు లేడని ఎవరి ఇంట్లో వారు, ఎవరి దేశంలో వారు విర్రవీగితే సరిపోదు. అంతర్జాతీయ స్థాయిలో దేశ ఔన్నత్యం ఎంత దిగజార్చారన్నది కూడా అంచనా వేసుకుంటూ ఉండాలి. ”సెక్యులరిజం అనే భావన మనకు యూరోప్‌ నుండి వచ్చిందని, మనం దాన్ని అనుసరించవల్సిన అగత్యం లేదని” – తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి ప్రకటించారు. బీజేపీ హయాంలో ఆరెస్సెస్‌ కార్యకర్తలందరూ గవర్న ర్లయి కూచు న్నందువల్ల – ఈ ప్రజాస్వామ్య దేశానికి ఈగతి పట్టింది. కోషియారీ, ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌, జగదీప్‌ ధన్‌కర్‌ లాంటి వారంతా ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు గవర్నర్లయి అక్కడి ప్రభుత్వాలను వేధించడమే కార్యక్రమంగా పెటుకున్నారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండి, రాజ్యాంగంలోని అంశాలను తప్పుపట్టేవారికి ఆ పదవుల్లో కొనసాగే అర్హతే ఉండడు కదా?
లోగడ మోడీ అమెరికా వెళ్లినపుడు ‘క్రైమ్‌ మినిస్టర్‌ ఆఫ్‌ ఇండియా’ అని అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. మన దేశంలో గోది మీడియా ఆ విషయం చూయించలేదు. క్వాడ్‌ (QUAD) సమావేశాల కోసం మోడీ ఇటీవల మళ్లీ అమెరికా వెళ్లినప్పుడు, స్వయాన అమెరికా అధ్యక్షుడు బైడెనే మోడీిని అవమానించాడు. దేశం లోనే కాదు, అంతర్జాతీయంగా కూడా తనకు విలువ లేకుండా పోయిందన్న సంగతి ఆ పెద్దమనిషి ఆలోచించుకునే స్థితిలో ఉన్నట్టు లేదు. అధికారం కోసం తహతహలాడే రాజకీయ నాయకులు మతాన్ని, దేవుణ్ణి, సంప్రదాయాన్ని ఉపయోగించి సమాజ స్వరూపాన్ని మార్చేస్తున్నారు. స్థాయినే దిగజార్చుతున్నారు. ఇందులో భాగంగానే, ప్రధాని చీఫ్‌ జస్టిస్‌ ఇంటికెళ్లి పూజ చేశారు. దేశ ప్రజలకు అది అభ్యంతరకరమైన చర్యే – ఇప్పుడిక చీఫ్‌ జస్టిస్‌ చంద్రచూడ్‌, తన నిజాయితీ దేశ ప్రజల ముందు నిరూపించుకోవాల్సి ఉంది!
– సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త (మెల్బోర్న్‌ నుంచి)
– డాక్టర్‌ దేవరాజు మహారాజు