నవతెలంగాణ పెద్దవంగర: నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా కు అధికారులు, సిబ్బంది కృషి చేయాలని మహబూబాబాద్ జిల్లా విద్యుత్ సూపరింటెండెంట్ ఇంజనీర్ నరేష్ అన్నారు. మండలంలోని అవుతాపురం గ్రామంలో కొనసాగుతున్న విద్యుత్ మరమ్మతు పనులు ఆయన తొర్రూరు డీఈ మధుసూదన్ తో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని, విద్యుత్ సరఫరాలో ఓల్టేజీ సమస్యలుంటే పరిష్కరించాలన్నారు. ఉద్యోగులు స్ధానికంగా ఉండి సమస్యలను పరిష్కరించాలన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా విద్యుత్ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో ఏడీ చలపతిరావు, ఏఈ రమేష్ బాబు, సబ్ ఇంజనీర్ నీహల్ తదితరులు పాల్గొన్నారు.